మాతృభాషల ద్వారానే ఆలోచనలకు పదును

మాతృభాష ప్రాముఖ్యత అనేక అంశాల ద్వారా ప్రభావితం అవుతోంది. ఏ భాష నేర్చుకోవడానికైనా బాల్యం, కౌమార దశల్లోనే ఎక్కువగా అవకాశం ఉంటుంది. చిన్నతనంలో కానీ, యుక్త వయస్సులో కానీ కొత్త భాష నేర్చుకోవడం వల్ల మెదడు అత్యంత చురుగ్గా పనిచేస్తోంది. మెదడు, మెదడులోని వివిధ భాగాల పనితీరు వేగవంతం అవుతాయి. ఫలితంగా సంబంధిత వ్యక్తులు కొత్త భావనలకు, ఆలోచనలకు పదునుపెట్టే అవకాశం ఉంటుంది. ఇదే వయస్సులో వివిధ భాషలను సులువుగా నేర్చుకోవడానికి మెదడు సహకరిస్తోంది. మనం ఎదుర్కొనే వివిధ సామాజిక సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొనడానికి సులువుగా ఉంటుంది. ఈ అంశాలు మన జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపడమే గాకా, ప్రపంచాన్ని సరైన దృష్టితో చూసేందుకు తోడ్పడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రాబల్యం కలిగిన భాషలను చూసినట్లయితే.. లాటిన్‌ అమెరికాతో పాటు ఐరోపాలోని కొన్ని ప్రాంతాలలో స్పానిష్‌, ఫ్రెంచ్‌ భాషలు అత్యంత ప్రజాధరణ పొందిన భాషలుగా గుర్తింపు పొందాయి. ఇటాలియన్‌, జపనీస్‌, రష్యన్‌ భాషలకు సైతం రోజురోజుకి ఆదరణ పెరుగుతోంది. భారతీయ భాషలు కూడా ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆధిపత్య భాషగా ఉన్న తెలుగు 60శాతానికి పైగా మాట్లాడుతున్నారు. ఈ భాష విభిన్న సంస్కృతి, చరిత్ర గొప్పగా ఉండటంతో తెలుగు సమాజం శక్తివంతమైన సమాజంగా గుర్తింపు పొందుతోంది. ప్రతి భాష కూడా ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటుంది. ప్రజలు ఆలోచించే, కమ్యూనికేట్‌ చేసే విధానానికి సహకారాన్ని అందిస్తుంది. భారతదేశంలో 700కంటే విభిన్న భాషలు మాట్లాడుతున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న నేపథ్యంలో, ప్రపంచీకరణ మరింత వేగంగా విస్తరిస్తున్న క్రమంలో మాతృభాషలకు ప్రాధాన్యత తగ్గుముఖం పడుతోంది. ఈ ప్రభావంతో చాలా వరకు మాతృ భాషలు మనుగడ లేకుండా పోయాయి. ముఖ్యంగా ప్రభుత్వ, ప్రయివేటు విద్యా సంస్థలలో మాతృభాషలను వినియోగించే అవకాశాలు లేకపోవడంతో భవిష్యత్తులో ప్రమాదం పొంచి ఉంది. ప్రపంచంలో మనం ఎన్ని భాషల్లో మాట్లాడినా మాతృభాషలోనే ఆలోచనలకు పదునుపెడతాం. అయితే ఇతర భాషలను నేర్చుకుంటూనే మాతృభాషను గౌరవించుకోవాల్సిన, కాపాడుకోవాల్సిన అవసరం మనపైనా, ప్రభుత్వాలపైనా ఉంది. లేకుంటే, మాతృభాషల మనుగడకే ప్రమాదం.
– డాక్టర్‌ మాగి వెంకన్న,
9030899902

Spread the love