రూ. 2.90 లక్షల కోట్ల బడ్జెట్‌లో.. రూ.55వేల కోట్లు నిధులు బక్వాస్‌

నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా లేదని, రూ. 2.90లక్షల కోట్ల బడ్జెట్‌లో రూ.55 వేల కోట్ల నిధులు బక్వాస్‌ మాత్రమేనని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. ఆదివారం బడ్జెట్‌ సమావేశాల అనంతరం ఆయన మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ తనపై చేసిన ఆరోపణలపై స్పందించారు. అసెంబ్లీలో ద్రవ్య మినిమయ బిల్లు చర్చ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ పేరును సీఎం కేసీఆర్‌ పదేపదే ప్రస్తావించిన విషయం తెలిసిందే. డైట్‌ చార్జీలపై ఈటల సూచనలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఈటలను సంప్రదించి వివరాలు తీసుకోవాలని మంత్రి హరీశ్‌రావుకు చెప్పారు. బడ్జెట్‌ సమావేశాల అనంతరం దీనిపై ఈటల రాజేందర్‌ స్పందిస్తూ.. తనను డ్యామేజ్‌ చేసే వ్యూహంతోనే కేసీఆర్‌ అలా మాట్లాడారని అన్నారు. రకరకాల పద్దతుల్లో తమను హేళన చేశారని, ఈటల అనే వ్యక్తి కేసీఆర్‌ మెతక మాటలకు పడిపోడని స్పష్టం చేశారు. పలకరించుకుంటే, పక్కన కూర్చుంటే పార్టీలు మారే వ్యక్తిని కాదన్నారు. తాను బీఆర్‌ఎస్‌ పార్టీని వీడలేదని, వాళ్లే బయటకు పంపారని మరోసారి గుర్తుచేశారు. తనపై వాళ్లు చేసిన దాడి, పెట్టిన ఇబ్బంది ప్రజలు మర్చిపోలేదన్నారు. పార్టీలు మారే కల్చర్‌ ఉన్న వ్యక్తి తను కాదని.. మళ్ళీ పిలిచినా బీఆర్‌ఎస్‌లోకి వెళ్లనని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి తన స్టైల్‌లో మాట్లాడారని.. భట్టి, అక్బరుద్దీన్‌ ఒవైసీ, జగ్గారెడ్డి పేర్లనూ అలానే పిలుస్తారని తెలిపారు. మెస్‌ చార్జీల మీటింగ్‌తో పాటు ప్రజా సమస్యలకు సంబంధించిన ఏ మీటింగ్‌కైనా తప్పకుండా వెళ్తానని స్పష్టం చేశారు. తన 20ఏండ్ల రాజకీయ జీవితంలో బడ్జెట్‌ సమావేశాలు ఇంత తక్కువ పనిదినాలు ఎప్పుడూ జరగలేదని, ఫిబ్రవరి 15న మొదలై మార్చి 31వరకు నడిచేవని చెప్పారు. ఒక్కో పద్దు మీద ఒక్కొక్క రోజు చర్చ ఉండేదని, ఇప్పుడా సంస్కృతి లేదన్నారు. ఆర్టీసీ కార్మికులకు పీఆర్సీ, మహిళా సంఘాలకు రావాల్సిన వడ్డీలు, ఉద్యోగులతో పాటు అవుట్‌సోర్సింగ్‌, గెస్ట్‌ లెక్చరర్‌, వీవీలకు జీతభత్యాలు సకాలంలో రాక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. బిల్లులు రాక స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సూసైడ్‌ చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. సభలో ఎమ్మెల్యేలు స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి లేదని వాపోయారు. మందబలం ఉందని ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అవమానించడం, తిట్టడమే టార్గెట్‌గా సాగిందన్నారు. సభలో అధికారపార్టీ సభ్యులకే మాట్లాడే అవకాశం ఇచ్చారని, చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే మోడీపై తిట్ల పురాణం అని తెలిపారు.

Spread the love