సెమీస్‌లో నంద్యాల జోడీ

– హైదరాబాద్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీ
నవతెలంగాణ-హైదరాబాద్‌:
12వ హైదరాబాద్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో మాదాపూర్‌ డిసిపి, హెచ్‌ఓటీఏ అధ్యక్షులు నంద్యాల నర్సింహారెడ్డి జోరు కొనసాగుతోంది. పురుషుల 50 ప్లస్‌ విభాగంలో నంద్యాల నర్సింహారెడ్డి జోడీ వరుసగా రెండో సీజన్‌లో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఎల్బీ స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచుల్లో నంద్యాల నర్సింహారెడ్డి, నీల్‌కాంత్‌ జోడీ సాధికారిక విజయం నమోదు చేసింది. సంజరు, సురేశ్‌ జోడీపై 8-1తో గెలుపొంది క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్న నంద్యాల జోడీ.. క్వార్టర్స్‌లో మరింత దూకుడు ప్రదర్శించింది. అమిత్‌, శ్రీనివాస్‌ రెడ్డి జోడీపై 8-0తో విజయం సాధించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. పురుషుల 50 ప్లస్‌ సింగిల్స్‌ విభాగంలో నార్త్‌జోన్‌ ఐజీ ఎస్‌.చంద్రశేఖర్‌ రెడ్డి సైతం సెమీస్‌లో అడుగుపెట్టారు. క్వార్టర్‌ఫైనల్లో చంద్రశేఖర్‌పై 8-3తో విజయం సాధించి సెమీస్‌కు చేరుకున్నాడు. ఈ విభాగంలో నీల్‌కాంత్‌, మూర్తి కూడా సెమీఫైనల్‌కు అర్హత సాధించారు. మెన్స్‌ 40 ప్లస్‌ విభాగంలో సంజరు, బోస్‌.. మెన్స్‌ 30 ప్లస్‌ విభాగంలో విజరు ఆనంద్‌, రాజాలు సెమీఫైనల్లో ప్రవేశించారు. ఇక మహిళల ఓపెన్‌ విభాగం విజేతగా సౌమ్య నాయుడు నిలిచింది. టైటిల్‌ పోరులో నీలం అగర్వాల్‌పై 9-3తో సౌమ్య నాయుడు అలవోక విజయం నమోదు చేసింది.