హైదరాబాద్‌ ఐటీకి…బయో టెక్నాలజీ గమ్యస్థానం

–  రాష్ట్ర ప్రభుత్వంతో బీఎంఎస్‌ అవగాహనా ఒప్పందం
– వంద మిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టనున్న కంపెనీ
– మూడేండ్లలో 1,500 మందికి ఉద్యోగాలు : మంత్రి కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
బయోటెక్నాలజీ, ఐటీకి గమ్యస్థానంగా హైదరాబాద్‌ మారిందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. రాష్ట్రం లో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చి నందుకు బీఎంఎస్‌ కంపెనీని ఆయన అభినందించారు. ప్రపంచంలోనే అగ్రగామి 10 ఫార్మాస్యూటికల్‌ కంపెనీల్లో ఒకటైన బ్రిస్టల్‌ మైర్స్‌ స్క్విబ్‌ రాష్ట్రంలో 100 మిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు గురువారం హైదరా బాద్‌లో రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కె.తారకరామా రావు సమక్షంలో ఆ సంస్థ ప్రతినిధులు, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేశారు. ఆ సంస్థ నగరంలో నెలకొల్ప నున్న కేంద్రం ఔషధాల అభివృద్ధి, ఐటీ, ఇన్నోవేషన్‌ రంగాల్లో కార్యకలాపాల ను నిర్వహించనున్నది. ఈ కేంద్రం రాకతో రాబోయే మూడేండ్ల కాలంలో 1,500 మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఒప్పం దం సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు బీఎంఎస్‌ ముందుకు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ బయో టెక్నాలజీ, ఐటీకి గొప్ప ఆకర్షనీయ గమ్య స్థానంగా ఉన్నదని తెలిపారు. బీఎంఎస్‌ కూడా ఈ రెండు రంగాల్లో అనేక కార్యక్రమాలు చేపడుతున్నదని వెల్ల డించారు. నగరంలో ఉన్న మానవ వనరుల నైపుణ్యం ఆ సంస్థ కార్యకలాపాలకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు. రాష్ట్రంలోని యువత ఐటీ, టెక్నాలజీలో అద్భుతమైన ప్రతిభను కనబరుస్తోందని తెలిపారు. తెలంగాణలో తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని మంత్రి ఈ సందర్భంగా బీఎంఎస్‌ సంస్థ ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. బయోటెక్నాలజీ, లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో శరవేగంగా ఎదుగుతున్న రాష్ట్రంగా 2028 నాటికి లైఫ్‌ సైన్సెస్‌ ఎకో సిస్టం విలువను రెట్టింపు చేసే లక్ష్యంతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఆయన వివరించారు. బీఎంఎస్‌ త్వరలోనే 1,500 మంది ఉద్యోగవకాశాలిచ్చే లక్ష్యాన్ని చేరుకుని మరింత మందికి అవకాశాలు కల్పించాలని ఆకాంక్షించారు. ఫార్మాసిటీకి పర్యావరణ, ఇతర అనుమతులు ఉన్న నేపథ్యంలో అక్కడ తయారీ ప్లాంటును ఏర్పాటు చేయొచ్చనీ బీఎంఎస్‌ ప్రతి నిధులకు వివరించారు. బీఎంఎస్‌ కంపెనీ గ్లోబల్‌ డ్రగ్‌ డెవలప్‌మెంట్‌ విభాగం మేనేజింగ్‌ డైరెక్టర్‌ సమ్మిత్‌ హిరావత్‌ మాట్లాడుతూ తమ కంపెనీ ఫార్మాస్యూటికల్‌, బయోటెక్నాలజీ, వైద్య రంగంలో అనేక సేవలనంది స్తున్నదని తెలిపారు. హైదరాబాద్‌ గత ఐదు సంవత్సరాల్లో అద్భుతమైన అభివృద్ధి సాధించిందని కొనియాడారు. మౌలిక వసతుల విషయంలో నగరం ఎంతగానో అభివృద్ధి చెందిందని వివరించారు.

Spread the love