కాంగ్రెస్‌లో కల్లోలం

–  పొత్తులపై నోరుజారిన వెంకన్న
–  బీజేపీకి ఆయుధం… బీఆర్‌ఎస్‌కు ఆనందం
–  భగ్గుమన్న క్యాడర్‌.. ఆయనపై క్రమశిక్షణ చర్యలకు హస్తం నేతల పట్టు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
కాంగ్రెస్‌లో కల్లోలం రేగుతుందనీ, రాష్ట్రంలో హంగ్‌ వస్తుందనీ, బీఆర్‌ఎస్‌తో పొత్తు ఉంటుందంటూ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపుతున్నాయి. ఆయనపై పార్టీ నేతలు భగ్గుమంటున్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్‌ను డామేజ్‌ చేశాయంటూ ఆ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కోమటిరెడ్డి కంటే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్‌ నయం అంటూ కొంత మంది సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో సందర్భాల్లో కాంగ్రెస్‌పై, రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయన…ఇటీవలే దారికొస్తున్నారనే పరిస్థితి నెలకొంది. ఈ వ్యాఖ్యలతో ఆయన మళ్లీ దారి తప్పాడు అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. బీఆర్‌ఎస్‌తో సై అంటున్న కాంగ్రెస్‌ను ఆయన వ్యాఖ్యలు కలవరపెడుతున్నాయి. బీజేపీ అధ్యక్షులు బండి సంజరు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ పోటీలో లేదనే విషయం స్పష్టమైందనీ, బీఆర్‌ఎస్‌కు బీజేపీకి పోటీ ఉంటుందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఏమీ లేకపోయినా ఉన్నట్టు ప్రచారం చేసుకుంటున్న బీజేపీ చేతికి కొబ్బరికాయ దొరికినట్టైయింది. కాంగ్రెస్‌ అంతర్గత విభేదాలను అకాశంగా మార్చుకోవచ్చు అనే సంబరపడుతున్నది.పార్టీలో చర్చించకుండా వ్యక్తిగత అభిప్రాయాల ను చెప్పి పార్టీలో గందరగోళాన్ని సృష్టిస్తున్నారంటూ టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్‌ కుమార్‌గౌడ్‌, పార్టీ ఉపాధ్యక్షులు చామల కిరణ్‌ కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ పార్టీ సీనియర్‌ ఉపాధ్యక్షులు మల్లు రవి డిమాండ్‌ చేశారు. ఏ పార్టీతో పొత్తు ఉందంటూ ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ వరంగల్‌ సభలో చెప్పిన విషయాన్ని కూడా కోమటిరెడ్డి గుర్తుంచుకోకపోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. గతంలోనే ఆ పార్టీ నేత అద్దంకి దయాకర్‌ బహిరంగంగా పార్టీలో ఉంటే ఉండండి. లేకపోతే వెళ్లిపోండి’ అంటూ ప్రకటించారు. ఆ తర్వాత ఆయనకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కానీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అనేక సార్లు రేవంత్‌రెడ్డి లక్ష్యంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి, తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని గెలిపించేందుకు కృషి చేశారు. ఎన్నికల్లో ప్రచారం చేయకుండా కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లారు. అంతటితో ఆగకుండా మునుగోడులో కాంగ్రెస్‌పార్టీకి డిపాజిట్‌ దక్కదంటూ వ్యాఖ్యానించి, పార్టీ నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. తాజా వ్యాఖ్యలతో మరోసారి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. కొద్దిరోజుల క్రితం రాష్ట్రానికి వచ్చిన కొత్త ఇంచార్జి మాణిక్‌రావు ఠాక్రేను కలిసిన సందర్భంలో రేవంత్‌రెడ్డితోనూ భేటీ అయ్యారు. ఇద్దరూ కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. దీంతో పార్టీకి కలిసిపోయామంటూ ఓ సంకేతం ఇచ్చారని పార్టీ నేతలు భావించారు. పార్టీ భావించినట్టు ఆ ఐక్యత ఎంతో కాలం ఉండలేదని ఇప్పుడు ఆవేదన చెందుతున్నారు. చివరకు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి మద్దతుగా ఉన్న మాజీ ఎంపీ వి. హనుమంతరావు కూడా రివర్స్‌ అయ్యారు. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసి క్యాడర్‌ మనోభావాలు దెబ్బతీస్తున్నా రంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాత్రం రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఒంటరిగా పోటీ చేస్తుందనీ, ఇతర పార్టీ మెజార్టీకి రాకపోతే తెలంగాణ రాజకీయం కాంగ్రెస్‌ చేతిలో ఉంటుందంటూ విశ్లేషించారు.