కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోండి

– ఏఐసీసీకి రాష్ట్ర నాయకులు ఫిర్యాదు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
జూన్‌ 2021లో రేవంత్‌రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడైనప్పటి నుంచి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వివిధ సందర్భాల్లో పార్టీకి వ్యతిరేకంగా బహిరంగ వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారని రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు చెరుకు సుధాకర్‌, ఈరవత్రి అనిల్‌, అద్దంకి దయాకర్‌, బెలయ్యనాయక్‌, అయోధ్యరెడ్డి, గోమాసశ్రీనివాస్‌…ఈమేరకు సోమవారం ఏఐసీసీకి ఫిర్యాదు చేశారు. తాజాగా పార్టీ నేత చెరుకు సుధాకర్‌ను చంపేస్తామంటూ బెదిరించిన ఆడియో వైరల్‌ అవుతున్నదని తెలిపారు. దానిపై విమర్శలు వెల్లువెత్తుతున్న ఆవిషయాన్ని వెంకట్‌రెడ్డి ఖండించలేదని గుర్తు చేశారు. మునుగోడు ఉపఎన్నిక అభ్యర్థిగా పాల్వాయి స్రవంతికి టికెట్‌ దక్కడంతో వెంకట్‌రెడ్డి కీలక పాత్ర పోషించినప్పటికి ఆమెను గెలిపించడానికి ప్రయత్నించలేదని గుర్తు చేశారు. ఉపఎన్నిక ప్రచారం సందర్భంగా ఆస్ట్రేలియా వెళ్లి కాంగ్రెస్‌ అభ్యర్థికి కాకుండా బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మద్దతు ఇవ్వాలని కోరిన విషయాన్ని పేర్కొన్నారు. వరంగల్‌ డిక్లరేషన్‌ బహిరంగ సభలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఏ పార్టీతోనూ పొత్తు ఉండదంటూ చెప్పినప్పటికీ, పొత్తు ఉంటుందంటూ పార్టీ వైఖరికి భిన్నంగా వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యల వెనుక బీజేపీ ఉందంటూ ఫిర్యాదు పేర్కొన్నారు. గతంలో మాజీ మంత్రి షబ్బీర్‌ అలీపై వెంకట్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని తెలిపారు. వెంకట్‌ రెడ్డి అనుచరులు టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారని పేర్కొన్నారు. రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర రాష్ట్రంలో కొనసాగినప్పటికి అందుబాటులో ఉండి కూడా వెంకట్‌రెడ్డి దూరంగా ఉన్నారని పేర్కొన్నారు. దానికి కొనసాగింపుగా రాష్ట్రంలో చేపట్టిన హాత్‌ సే హాత్‌ జోడో యాత్రలో పాల్గొనకుండా పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని వివరించారు. వెంకట్‌రెడ్డి పార్టీ సిద్ధాంతాలను దెబ్బతీసేలా, ఉదరుపూర్‌ ప్రకటనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు పార్టీ క్యాడర్‌ను గందరగోళపరుస్తున్నాయనీ, మనోభావాలను దెబ్బతీస్తున్నారనీ, తెలంగాణ, కష్టపడి పనిచేసే కేడర్‌ను కంగదీస్తోంది.