మహిళా ఉద్యోగుల హక్కులకు ప్రాధాన్యత

–  టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ సీఎమ్‌డీ జి రఘుమారెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
విద్యుత్‌ సంస్థల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల హక్కులకు తొలి ప్రాధాన్యత ఇస్తామని దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) సీఎమ్‌డీ జీ రఘుమారెడ్డి తెలిపారు. వారి సమస్యల పరిష్కారంలో ఏ స్థాయిలోనూ పెండింగ్‌ ఫైల్స్‌ లేవన్నారు. మింట్‌ కాంపౌండ్‌లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో విద్యుత్‌ మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. దీనికాయన ముఖ్య అతిధిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి, శుభాకాంక్షలు తెలిపారు. బదిలీలు, పోస్టింగుల్లో మహిళలకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం కోసం మింట్‌ కాంపౌండ్‌లో స్థలాన్ని కేటా యించామన్నారు. ప్రస్తుతం సంస్థలో 11,260 మంది రెగ్యులర్‌ ఉద్యోగులు ఉంటే, వారిలో 1,723 మంది మహిళా ఉద్యోగులు వున్నారని తెలిపారు. ప్రస్తుతం జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టుల్లో సైతం మహిళలకు అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. అన్నింటా మహిళలకు సమాన అవకాశాలు లభిస్తున్నాయని వివరించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం అద్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీమతి జ్యోతి రాణి, శ్రీమతి తులసి నాగరాణి మాట్లాడుతూ అసోసియేషన్‌ బిల్డింగ్‌ కోసం జాగా ఇచ్చినందుకు సభాముఖంగా ధన్యవాదాలు తెలిపారు. అనంతరం పలు పోటీల్లో గెలుపొందిన ఉద్యోగినులకు బహుమతులు అందచేశారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు టి శ్రీనివాస్‌, జి పర్వతం, సీహెచ్‌ మదన్‌మోహన్‌రావు, ఎస్‌ స్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.