12 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలివ్వాలి

– పోడు పట్టాదారులందరికీ పట్టాల్లివాల్సిందే
– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని
నవతెలంగాణ-కొత్తగూడెం
పోడు సాగు చేసుకుంటున్న 12 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, పోడు పట్టాదారులందరికీ పట్టాల్లివాల్సిందేనని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌ రావు అన్నారు. శుక్రవారం సీపీఐ(ఎం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం మంచికంటి భవన్‌లో జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పోతినేని మాట్లాడుతూ రాష్ట్రంలో సాగు చేస్తున్న పోడు సాగుదారు లందరికీ పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసారు. రాష్ట్రంలో12లక్షల ఎకరాల వరకు దరఖాస్తులు వచ్చాయని ప్రభుత్వమే ప్రకటించిందని అన్నారు. అర్హులైన సాగుదారులందరికీ 11లక్షల ఎకరాలపైనే పట్టాలు ఇవ్వాల్సి ఉండగా 4 లక్షల ఎకరాలకు పట్టాలు ఇవ్వబోతున్నట్లు చేస్తున్న ప్రచారం సరైంది కాదన్నారు. వచ్చె నెల 24 నుంచి పోడు పట్టాల పంపిణి చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటన చేయడం, సంతోషదాయకమే అయినా అతి తక్కువ ఎకరాలకు పట్టాలు ఇవ్వాలని నిర్ణయించడం ప్రజల్ని మభ్యపెట్టడమేనన్నారు. అశాస్త్రీయ పద్దతుల ద్వారా సర్వే చేసి పట్టాలను నిర్ధారణ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 84,000 కుటుంబాల నుండి 2,94,000 ఎకరాల భూమికి దరఖాస్తు చేసుకున్న వారందరికీ పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. భద్రాద్రి జిల్లాలో 50 వేలు, ఖమ్మం జిల్లాలో 5,857 మందినే లబ్దిదారులుగా గుర్తించి పట్టాలు ఇవ్వనున్నారని అన్నారు. రెండు జిల్లాలో ఇటువంటి పరిస్ధితి నెలకొని ఉంటే తప్పుల తడకలతో ఆశాస్త్రీయ పద్దతుల ద్వారా 15 రకాల ఆధారాల ప్రామానికంగా రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల దరఖాస్తుదారులను అనర్హులుగా గిర్తించి తొలగిం చడం వల్ల సాగుదారులు నష్టపోతారని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. విడతల వారిగా కాకుండా అందరికీ ఒకేసారి పట్టాలు పంపిణీ చేయాలని ఆయన డిమాండ్‌ చేసారు. పట్టాల పంపిణీలో రాష్ట్ర వ్యాప్తంగా అనుమానాలు ఉన్నాయని సంబందిత అధికారులు, ప్రభుత్వం నివృత్తి చేయాలని కోరారు. పోడు సాగుదారులకు పట్టాలు ఇవ్వాలని కూలీ, గిరిజన, ప్రజా సంఘాలు దశలవారిగా ఉద్యమాలు నిర్వహించిన ఫలితంగానే పోడుసాగుదారులకు పట్టాలు అందబొతున్నాయన్నారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి పోడు సాగుదారుడికి పట్టాలు ఇవ్వకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోడు సాగుదారులతో పార్టీ ఆద్వర్యంలో ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సమావేశంలో పార్టీ సీనీయర్‌ నాయకులు కాసాని అయిలయ్య, జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎజె. రమేష్‌, కొక్కెరపాటి పుల్లయ్య, యంబి నర్సారెడ్డి, మందలపు జ్యోతి, కొలగాని బ్రహ్మాచారి, కారం పుల్లయ్య, లిక్కి బాల రాజు జిల్లా కమిటీ సభ్యులు, పూర్తికాలం కార్యకర్తలు పాల్గొన్నారు.