అశ్వారావుపేట బరిలో 14 మంది

– గతం కంటే పెరిగిన పోటీదారులు
– అత్యధికులు స్వతంత్రులే
నవతెలంగాణ-అశ్వారావుపేట
ఈ ఏడాది జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ సాదారణ ఎన్నికల్లో అశ్వారావుపేట స్థానానికి 14 మంది బరిలో నిలిచారని ఉపసంహరణ గడువు అయిన బుధవారం ఎన్నికల అధికారి, అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ పి.రాంబాబు ప్రకటించారు. మొత్తం 23 మంది నామినేషన్‌లు దాఖలు చేయగా స్క్రూటినీలో సిపిఐ(ఎం) డమ్మి అభ్యర్ధి ఆదినారాయణ, బహుజన ముక్తి పార్టీ అభ్యర్ధి దరావత్‌ హనుమంతరావులు నామినేషన్‌లు అర్హత కోల్పోయాయి. 21 మందిలో 7 గురు తాటి నవీన్‌, మూడ్‌ రవిచంద్ర, వాసం పోలయ్య, అరియన్‌ ప్రశాంత్‌, ఎం.కిరణ్‌, కంగాల కల్లయ్య, సున్నం నాగమణిలు తమ నామినేషన్‌లను ఉపసంహరించుకున్నారు. బరిలో నిలిచిన వారిలో అర్జున్‌రావు (సిపిఐ ఎం),ఆదినారాయణ జారే(కాంగ్రెస్‌), మడకం ప్రసాద్‌ (బీఎస్పీ), మెచ్చా నాగేశ్వరరావు(బీఆర్‌ఎస్‌)లు గుర్తింపు పొందిన జాతీయ పార్టీల అభ్యర్ధులు. రిజిష్టర్‌ కాబడిన, గుర్తింపు పొందని జాతీయ, రాష్ట్ర పార్టీలకు చెందిన ఊకే రవి(గోండ్వానా దండకారణ్య పార్టీ), కన్నెబోయిన వెంకట నర్సయ్య (గోండ్వానా గణతంత్ర పార్టీ), పద్దం వెంకట రమణ(ఏలియన్స్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ పార్టీ), మనుగొండ వెంకట ముత్యం (భారతీయ చైతన్యం యువజన పార్టీ), ముయ్యబోయిన ఉమాదేవి (జనసేన) ఉన్నారు. మరో ఐదుగురు ఆంగోతు క్రిష్ణ, ఊకే ముక్తేశ్వర రావు, కిషోర్‌ కల్లూరి, కుంజా నాగమణి, తంబళ్ళ రవి లు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ పడుతున్నారు. దీంతో 14 మంది ఎన్నికల బరిలో నిలిచారు. కాగా 2014లో 10 మంది, 2014 లో 15 మంది, 2018 లో 12 మంది తలపడ్డారు. ఈ ఏడాది గతంలో కంటే మరో ఇద్దరు అదనంగా అంటే మొత్తం 14 మంది పోటీలో నిలిచారు. గతంలోనూ ప్రస్తుతం ప్రధాన పార్టీలు కంటే స్వతంత్ర అభ్యర్ధులు ఏ అధికంగా పోటీ పడటం గమనార్హం.