మహారాష్ట్రలో విరిగిపడిన కొండచరియలు 16 మంది మృతి

– పలు ప్రాంతాలలో భారీ వర్షాలు
– స్తంభించిన జనజీవనం
ముంబయి : భారీ వర్షాలు మహారాష్ట్రను ముంచెత్తుతున్నాయి. రాయగడ్‌ జిల్లా ఖాలాపూర్‌ తాలూకాలోని ఇర్షాల్‌వడీ గ్రామంలో బుధవారం రాత్రి కొండచరియలు విరిగిపడి 16 మంది ప్రాణాలు కోల్పోయారు. సహాయ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి అనేక మందిని కాపాడారు. గాయపడిన వారిని నవీ ముంబయిలోని ఆస్పత్రికి తరలించారు. అయితే ఇప్పటికీ అనేక కుటుంబాలు శిథిలాల కింద చిక్కుబడి ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. భారత వాతావరణ విభాగం రాయగడ్‌లో రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. దీంతో మరిన్ని కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నదని భావిస్తున్నారు. భారీ వర్షాలు పడుతున్నప్పటికీ ఎన్డీఆర్‌ఎఫ్‌ దళాలు రంగంలోని దిగి సహాయ చర్యలు చేపట్టాయి. కొండ ప్రాంతం కావడంతో సహాయ చర్యల కోసం భారీ పరికరాలను తరలించడం కష్టమవుతోంది. ముంబయి, దాని పరిసర ప్రాంతాలలో భారీ వర్షాలు పడుతుండడంతో జన జీవనం స్తంభించింది. వందకు పైగా స్థానిక రైళ్లను రద్దు చేశారు. థానే, పాల్‌ఘర్‌, రారుగడ్‌లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలోని విపత్తు నిర్వహణ శాఖ అధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. కొండచరియలు విరిగిపడిన ప్రదేశాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఆయనకు ఫోన్‌ చేసి సహాయ కార్యక్రమాలపై ఆరా తీశారు. ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌, ఇతర అధికారులు సంఘటనా స్థలంలోనే ఉండి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ముంబయి, థానే, నవీ ముంబయి నుండి సహాయ కార్యక్రమాల కోసం యంత్రాలు, సిబ్బందిని తరలించారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించింది. గాయపడిన వారికి ఉచితంగా వైద్యం అందిస్తామని తెలిపింది.
శిథిలాలను తొలగించేందుకు అవసరమైన ఎక్సవేటర్లను హెలికాప్టర్ల ద్వారా తరలించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మట్టి, శిథిలాలు మినహా గ్రామంలో ఏమీ మిగలలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి 10.30 గంటల ప్రాంతంలో కొండచరియలు విరిగి పడ్డాయని వారు తెలిపారు. దట్టమైన చీకటి అలముకోవడంతో రాత్రికి సహాయ కార్యక్రమాలు నిలిపివేశారు. కాగా పర్వత ప్రాంతాలలోని గ్రామాలలో ఏరియల్‌ సర్వే నిర్వహించాలని విధానసభలో ప్రతిపక్ష నాయకుడు అంబదాస్‌ దాన్వే డిమాండ్‌ చేశారు.