– గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ధర్నా
నవతెలంగాణ-భద్రాచలం రూరల్
గిరిజన సంక్షేమ శాఖ పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ కార్మికులకు రావలసిన 18 నెలల వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని కోరుతూ గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలో హాస్టల్స్ డైలీ వేజ్, ఔట్ సోర్సింగ్ కార్మికుల యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బి.మధు మాట్లాడారు. డైలివేజ్ కార్మికులకు ఏడు నెలలు, ఔట్ సోర్సింగ్ కార్మికులకు 18 నెలలు జీతాలు చెల్లించకుండా తీవ్రమైన ఇబ్బందులకు ప్రభుత్వం గురి చేస్తుందని వారి సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని కోరారు. 2023 అక్టోబర్ 26వ తేదీ నుంచి ఆర్థిక శాఖ పరిధిలో పెండింగ్‌లో ఉన్న ఔట్ సోర్సింగ్ కార్మికుల వేతనాలు చెక్కును వెంటనే క్లియరెన్స్ చేయాలని, చెక్కును పాస్ చేసి వేతనాలు విడుదల చేయాలన్నారు. హాస్టల్ కార్మికుల ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గిరిజన కార్మికుల ఆకలి బాధను ఈ ప్రభుత్వానికి పట్టదా అని ప్రశ్నించారు. ఔట్ సోర్సింగ్ కార్మికులకు క్యాటరింగ్ విధానాన్ని రద్దుచేసి జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఐదు సంవత్సరాల సర్వీస్ పూర్తయిన హాస్టల్ వర్కర్లందరినీ పర్మినెంట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. చనిపోయిన కార్మికుల స్థానంలో డైలీ వేజ్ వర్కర్ల వారసులకు ఉద్యోగం ఇవ్వాలని కోరారు. వేతనాలకు సరిపడినంత బడ్జెట్ కేటాయించాలని ప్రతి నెల మొదటి వారంలో వేతనాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బకాయి వేతనాలు చెల్లించాలని తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ… ప్రజావాణి కార్యక్రమంలో ప్రజాభవన్‌లో కార్మికులందరూ వ్యక్తిగతంగా దరఖాస్తులు సమర్పించారు. అనంతరం గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయం ముందు ధర్నా చేసి గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ నరసింహారెడ్డికి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ నరసింహారెడ్డి మాట్లాడుతూ… వారం రోజుల్లో వేతనాలు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పెండింగ్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. సమస్యలు పరిష్కారం చేయక పోతే క్యాటరింగ్ విధానాన్ని రద్దు చేసి ఔట్ సోర్సింగ్ కార్మికులకు జీవో 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని లేనియెడల తమ పోరాటాన్ని మరింత ఉదృతం చేస్తామని పేర్కొన్నారు. ధర్నాకు గిరిజన ఆశ్రమ పాఠశాలలో హాస్టల్ డైలీ వేజ్, ఔట్ సోర్సింగ్ కార్మికుల యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కే.బ్రహ్మాచారి అధ్యక్షత వహించగా రాష్ట్ర అధ్యక్షులు టేకం ప్రభాకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ సురేందర్, వివిధ జిల్లాల నాయకులు లక్ష్మణ్ నాయక్, హీరాలాల్, కౌసల్య, ముత్తయ్య, తిరుపతమ్మ, నాగమణి ముసలయ్య, రాజేష్, పాపారావు, జోడేలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.