– ఉన్నత విద్యలో 5శాతం : మంత్రి శ్రీనివాస్‌గౌడ్
– ట్రై క్రీడా పోస్టర్ ఆవిష్కరణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రెండు శాతం, ఉన్నత విద్యనభ్యసించడానికి 5శాతం రిజర్వేషన్లు అమలు అయ్యేలా చర్యలు చేపడుతున్నట్టు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(సాట్స్) సహకారంతో ఈ నెల 24న మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్, తెలంగాణ స్కేటింగ్ అసోసియేషన్, తెలంగాణ రెజ్లింగ్ అసోసియేషన్ అధ్వర్యంలో ‘ట్రై క్రీడా వేడుక-2023’ను నిర్వహిచనున్నా ఆ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మెన్ అంజనేయగౌడ్‌తో కలిసి మంత్రి శనివారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా 17వేల గ్రామాల్లో గ్రామీణ క్రీడా ప్రాంగణాలను నిర్మిస్తున్నామన్నారు. ఇప్పటికే 50 శాతం మైదానాల నిర్మాణాలను పూర్తి చేశామన్నారు. మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఒకే రోజు మూడు క్రీడలను సైక్లింగ్, స్కేటింగ్, రెజ్లింగ్‌లను నిర్వహిస్తున్నామని వెల్లడించారు. క్రీడల అభివృద్ధికి విశేషంగా కషి చేస్తున్న కోచ్‌ల ఉద్యోగ సర్వీసు క్రమబద్ధీకరణకు కషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఒలంపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు జగదీష్‌యాదవ్, కార్యదర్శి ప్రేమ్‌రాజ్, వెటరన్ క్రీడాకారులు మర్రిలక్ష్మారెడ్డి, గడ్డం శ్రీనివాస్ యాదవ్, నికత్ జరీన్ తండ్రి జమిల్ తదితరులు పాల్గొన్నారు.