3 ఎకరాలు ఇవ్వలేదు..300 గజాల స్థలం ఇవ్వలేవా ?

– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్‌
– రాంకీ సంస్థ 720, రామోజీకి 1200 ఎకరాలా?
– పేదోడికి 60 గజాలు ఇవ్వడానికి భూములు లేవా?
58, 59 జీవోతో బీఆర్‌ఎస్‌ కార్యకర్తల భూకబ్జాలు రెవెన్యూ అధికారులకు కనుసన్నాల్లోనే కబ్జాలు రేషన్‌ కార్డుల జారీ ఏనాడో నిలిచిపోయింది బీసీ కులాలకు లక్ష ఆర్థిక సహాయానికి సవాలక్ష ఆంక్షలు కులం ఆదాయ సర్టిఫికెట్లు అందించే నాధుడే కరువు తెలంగాణ ప్రజా సంఘాల వేదిక ఆధ్వర్యంలో ఆందోళన
ఇబ్రహీంపట్నం డిప్యూటీ తహసీల్దార్‌కు వినతి
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
మూడు ఎకరాల భూమి ఇస్తానని ఒక్కరికి కూడా ఇవ్వలేదు…కనీసం నిలువ నీడకోసం 300 గజాలు స్థలమన్నా ఇవ్వమని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్‌ డిమాండ్‌ చేశారు. రామోజీరావు, రారకీ సంస్థకు అప్పజెప్పిన సుమారు 3వేల ఎకరాల ప్రభుత్వ భూమిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆ భూములను పేదలకు ఇంటి స్థలాల కోసం పంపిణీ చేయాలన్నారు. 58, 59 జీవోతో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు భూకబ్జాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇండ్ల స్థలాలు లేని పేదలు తెలంగాణ ప్రజాసంఘాల వేదిక ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ అధికారం చేపట్టిన తర్వాత రేషన్‌ కార్డుల జారీ పూర్తిగా నిలిచిపోయిందన్నారు. నూతనంగా పింఛన్ల మంజూరి లేదన్నారు. 57 సంవత్సరాలు కలిగిన వారందరికీ పింఛన్లు అందిస్తామన్న ఎన్నికల వాగ్దానం ఐదు సంవత్సరాలైనా అమలుకు నోచుకోవడం లేదని మండిపడ్డారు. కేసీఆర్‌ అధికారం చేపట్టిన తర్వాత 60 గజాల ఇంటి స్థలం పంచిన దాఖలాలు లేవని మండిపడ్డారు. ప్రతి పేదోడికి 300 గజాల ఇంటి స్థలం ఇచ్చే అవకాశాలున్న ఆ ప్రయత్నం చేయడం లేదన్నారు. ఆదిభట్ల టాటా కంపెనీ ఏర్పాటు సందర్భంగా ప్రతి పేదోడికి ఇంటి స్థలం ఇస్తామని ప్రభుత్వం చేసిన వాగ్దానం నేటికి అమలు కావడం లేదన్నారు. స్థానికులకు ఉద్యోగాలు లభించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రాంకీ సంస్థలకు 750 ఎకరాలు, రామోజీరావు 1200 ఎకరాలను కబ్జా చేస్తే ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. కానీ పేదోడు ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేస్తే మాత్రం తొలగించి అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారని మండిపడ్డారు. పేదలకు 3 ఎకరాల భూ పంపిణీచేస్తామన్న వాగ్ధానం గాలికొదిలేసిన ప్రభుత్వం కనీసం నిలువ నీడకోసం 300 గజాల ఇంటి స్థలమన్నా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వెంటనే రేషన్‌ కార్డుల పంపిణీ ప్రక్రియలు చేపట్టాలన్నారు. మరోవైపు బీసీ కులాలకు లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నామని చెప్పిన ప్రభుత్వం సవాలక్ష నిబంధనలు విధిస్తుందన్నారు. సర్వర్‌ సతాయింపుల పేరుతో బీసీ సామాజిక వర్గాలకు కులము, ఆదాయం సర్టిఫికెట్ల జారీ చేయడం లేదన్నారు. లక్ష రూపాయల ఆర్థిక సహాయానికి పేదలు ఏ విధంగా దరఖాస్తు చేసుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీంతో మిగిలిన దరఖాస్తు గడువును ఈ నెలాఖరు వరకు అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు ప్రయివేటు విద్యాసంస్థలు ఫీజుల పేరుతో విద్యార్థులను పీకుతుంటున్నాయన్నారు. ఫీజు నియంత్రణ ఎందుకు అమలు చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మరో వైపు 58, 59 జీవో పేరుతో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు లబ్ధి చేకూర్చేదిగా ఉందన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు రెవెన్యూ అధికారుల కనుసన్నాల్లోనే 58, 59 జీవో కింద భూ కబ్జాలకు పాల్పడుతున్నారన్నారు. దీనిని నిరోధించాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని నిలువరిస్తామని హెచ్చరించారు. అనంతరం డిప్యూటీ తహసిల్దార్‌ శ్రీనివాస్‌కు వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో కేవీపీఎస్‌ జిల్లా అధ్యక్షులు బి. సామెలు, మత్య్సకార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు శంకర్‌, సీపీఐ(ఎం) ఇబ్రహీంపట్నం మున్సిపల్‌ కార్యదర్శి ఎల్లేశ, రైతు సంఘం మండల కార్యదర్శి ముసిలయ్య, వృత్తి సంఘాల నాయకులు వెంకటేష్‌, వడ్డెర వత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పల్లపు విగేష్‌, కేవీపీఎస్‌ జిల్లా నాయకులు వీరేశం, స్వప్న, బి. యాదగిరి, దశరథ, బాలరాజు, లక్ష్మమ్మ, రాజు, రాణి, ఎల్లమ్మ, నాగరాణి, తదితరులు పాల్గొన్నారు.