38 ఉపసంహరణలు

– ఖమ్మంలో 13, భద్రాద్రి కొత్తగూడెంలో 25 నామినేషన్‌లు వెనక్కి
– ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 215 మంది అభ్యర్థులు బరిలో..
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి :
తెలంగాణ సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాలకు గాను 215 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బుధవారం సాయంత్రానికి ఉభయ జిల్లాల్లో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. ఖమ్మం జిల్లాలో మొత్తం 133 నామినేషన్లు దాఖలు కాగా 13 మంది ఉపసంహరించుకున్నారు. 120 మంది బరిలో నిలిచారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 120 నామ పత్రాలకు గానూ 25 మంది ఉపసంహరించుకోగా 95 మంది బరిలో ఉన్నారు. ఖమ్మం జిల్లాలో అత్యధికంగా పాలేరు నియోజకవర్గం నుంచి 37 మంది, ఖమ్మం నుంచి 33 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. అతితక్కువగా వైరా నియోజకవర్గం నుంచి 12 మంది మాత్రమే పోటీ చేస్తున్నారు. సత్తుపల్లి నుంచి 23 మంది, మధిర నుంచి 15 మంది తుదకు నిలిచారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా, కొత్తగూడెం నుంచి 30 మంది, ఇల్లందు నుంచి 20, పినపాక నుంచి 18, అశ్వారావుపేట నుంచి 14, భద్రాచలం నుంచి 13 మంది పోటీలో ఉన్నారు.
ఉపసంహరణలు ఇలా…
ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి ముగ్గురు అభ్యర్ధులు ఉపసంహరించుకున్నారు. వీరిలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కందాల ఉపేందర్‌ రెడ్డి సతీమణి కందాల విజయ, అయన బంధువు సోలీపురం జయచంద్రారెడ్డి, బీఎస్పీ అభ్యర్థి అల్లిక వెంకటేశ్వర్లు సతీమణి అల్లిక వెంకటరమణి ఉపసంహరించుకోగా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసిన రామసహాయం మాధవీరెడ్డి బరిలో ఉన్నారు. మధిర నియోజకవర్గం నుంచి కళ్యాణం రమేష్‌, దొంతమల్ల కిషోర్‌ కుమార్‌ ఉపసంహరించుకున్నారు. ఈ నియోజక వర్గంలో బీఆర్‌ఎస్‌ రెబల్‌ అభ్యర్థిగా ఫార్వర్డ్‌బ్లాక్‌ పార్టీ నుంచి నామినేషన్‌ వేసిన బొమ్మెర రామ్మూర్తి బరిలో ఉన్నారు. సత్తుపల్లి నుంచి గద్దల సుబ్బారావు, అద్దంకి అనిల్‌కుమార్‌ నామినేషన్‌ వెనక్కు తీసుకున్నారు. వైరా నియోజకవర్గం నుంచి లకావత్‌ గిరిబాబు, శెట్టిపల్లి శ్రీనుతో పాటు కాంగ్రెస్‌ టిక్కెట్‌ ఆశించిన ధరావత్‌ రామ్మూర్తినాయక్‌ వెనక్కు తగ్గారు. విజయాబాయి తండ్రి దశ దిన కర్మ నేపథ్యంలో నామినేషన్‌ ఉపసంహరించుకోలేదు. ఖమ్మం నుంచి కొమ్ము రమేష్‌, మిట్టకోల దినేష్‌, ఏలినాటి కోటయ్య నామినేషన్‌లు రద్దు చేసుకున్నారు. ఫార్వర్డ్‌ బ్లాక్‌ నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బరిలో ఉన్న జలగం వెంకట్రావు పోటీలో ఉన్నారు. పినపాక నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన మాజీ జడ్పీటీసీ బట్టా విజయగాంధీ నామినేషన్‌ రద్దు చేసుకున్నారు.