నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
స్వరాష్ట్ర సాధన తర్వాత సింగరేణి కాలరీస్ సంస్థ అద్భుత ప్రగతిని సాధించిందని ఆ సంస్థ సీఎమ్‌డీ ఎన్ శ్రీధర్ చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంతో పోల్చినప్పుడు సంస్థ లాభాల్లో 421 శాతం వృద్ధిని సాధించామన్నారు. అమ్మకాల్లో 176 శాతం, ఉత్పత్తిలో 33 శాతం, రవాణాలో 39 శాతం అభివృద్ధిని కొనసాగించామని వివరించారు. మహారత్న కంపెనీలతో పోలిస్తే టర్నోవర్‌లో సింగరేణి రెండవ స్థానంలో ఉన్నదనీ, స్వరాష్ట్రంలో ఇప్పటి వరకు 19 వేలకు పైగా కొత్త నియామకాలు చేపట్టామన్నారు. ప్రస్తుత సింగరేణి ఉద్యోగుల్లో 45 శాతం యువకులే ఉన్నారని చెప్పారు. హైదరాబాద్ సింగరేణి భవన్‌లో శుక్రవారం జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ ఈ అండ్ ఎమ్ డీ సత్యనారాయణ రావు, అడ్వైజర్ మైనింగ్ డి.ఎన్.ప్రసాద్, అడ్వైజర్ ఫారెస్ట్రీ సురేంద్ర పాండే, జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ ఎం. సురేష్, అడ్వైజర్ లా లక్ష్మణరావు, అధికారుల సంఘం జనరల్ సెక్రెటరీ ఎన్.వి. రాజశేఖర్ రావు, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.