– గవర్నర్‌కు మరోసారి సిఫారసు చేయనున్న ప్రభుత్వం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అసెంబ్లీ సమావేశాల్లో ఐదు ప్రయివేటు విశ్వవిద్యాలయాల బిల్లును మరోసారి ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ బిల్లును ఆమోదించాలని కోరుతూ మరోసారి గవర్నర్‌కు ప్రభుత్వం సిఫారసు చేయనుంది. శ్రీనిధి విశ్వవిద్యాలయం (ఘట్‌కేసర్), గురునానక్ విశ్వవిద్యాల యం (ఇబ్రహీంపట్నం), నిక్‌మర్ కన్‌స్ట్రక్షన్ విశ్వవిద్యాలయం (శామీర్‌పేట), ఎంఎన్‌ఆర్ విశ్వవిద్యాలయం (సంగారెడ్డి), కావేరి విశ్వవిద్యాలయం (గౌరారం)లో ప్రయివేటు విశ్వవిద్యాలయాలను నెలకొల్పుతూ గతేడాది సెప్టెంబర్ 13న ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే గవర్నర్ ఆ బిల్లును ఆమోదించకుండా ఇటీవల వెనక్కి తిప్పిపంపారు. గతనెల 31న నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ఐదు ప్రయివేటు వర్సిటీల బిల్లును మళ్లీ అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్ ఆమోదానికి పంపించాలని నిర్ణయించింది. అయితే రాజ్యాంగం ప్రకారం ఒకసారి వెనక్కి పంపిన బిల్లును రెండోసారి గవర్నర్ వాటిని తప్పనిసరిగా ఆమోదించాల్సి ఉంటుంది. వెనక్కి పంపే అవకాశం లేదు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆ బిల్లును ఆమోదించి పంపిస్తే తప్పకుండా గవర్నర్ ఆమోదిస్తారని భావిస్తున్నది. రాష్ట్రంలో 2021-22 విద్యాసంవత్సరంలో మహీంద్రా, మల్లారెడ్డి, వాక్సన్, అనురాగ్, ఎస్‌ఆర్ విద్యాసంస్థలు ప్రయివేటు విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.