తొమ్మిదేండ్లలో పోలీస్‌శాఖకు రూ.59,200 కోట్లు

– శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యం
– నేటి ‘దశాబ్ది’లో ‘సురక్షా’ దినోత్సవం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 9 ఏండ్లలో పోలీసుశాఖకు ప్రభుత్వం రూ.59,200 కోట్ల నిధుల్ని కేటాయించింది. ఆ శాఖను పూర్తిగా ఆధునీకరిం చడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. రూ.775 కోట్లతో 551 కొత్త పోలీస్‌ స్టేషన్‌ భవనాలు నిర్మాణమయ్యాయి. అలాగే అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చు కుంటూ పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని పోలీస్‌ స్టేష న్లన్నింటినీ ఈ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానం చేశారు.
తెలంగాణ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ ద్వారా 48,096 పోస్టులు భర్తీ చేశారు. మహిళల భద్రతకు 331 షీ టీమ్స్‌, 12 భరోసా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు పలు వేదికలపై చెప్పారు. ఫలితంగా నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఏదైనా నేరం జరిగినా నిందితులను పట్టుకోవడం సులభతరమైంది. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల్లో కల్తీలు, నకిలీలపై కఠినంగా వ్యవహరిస్తూ నేరస్తులపై పీడీ యాక్టు పెట్టి జైలుకు పంపేలా ఆర్డినెన్స్‌ తెచ్చిన మొట్ట మొదటి రాష్ట్రం తెలంగాణానే. మాదక ద్రవ్యాల నియంత్రణ, మహిళల అక్రమ రవాణాపై పోలీసుశాఖకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. ఫలితంగా ఆయా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. అలాగే పాస్‌పోర్ట్‌ దరఖాస్తుదారులకు వేగవంత మైన సేవలందించేందుకు ఆధునిక సాంకేతికతనువ వినియోగంలోకి తెచ్చారు. రాష్ట్ర పోలీసుల సాంకేతిక ఆధారిత కార్యక్రమాల్లో 60కి పైగా జాతీయ, అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్నారు. అలాగే హౌంగార్డుల డ్యూటీ అలవెన్స్‌ను రోజుకు రూ.300 నుంచి రూ.921కి పెంచారు. ట్రాఫిక్‌ నియంత్రణలోనూ రాష్ట్ర పోలీసు శాఖ సమర్థవంతంగా పనిచేస్తుంది. హైదరాబాద్‌లో రూ.100 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ పనులు పూర్తయితే ట్రాఫిక్‌ నిర్వహణలో విప్లవాత్మక మార్పులు వస్తాయని ప్రభుత్వం చెప్తున్నది.