వరదలకు 6 వేల ఎకరాలు నీట మునక

– హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం
హైదరాబాద్‌ : భారీ వర్షాలు, వరదలతో ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం కంట్రోల్‌ రూమ్స్‌ ఎందుకు ఏర్పాటు చేయడం లేదని, గత విచారణలో హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అతి భారీ వర్షాల కారణంగా గోదావరి పరీవాహక ప్రాంతంలో ఇప్పటివరకు ఏం సహాయక చర్యలు చేపట్టారో చెప్పాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక సమర్పించింది. వరదలకు 41 మంది చనిపోయారని, 5 ఇండ్లు పాక్షికంగా, 250 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని చెప్పింది. ఆరు వేల ఎకరాల్లో పంట భూములు నీట మునిగాయని, సర్వే తర్వాతే పంట నష్టం తెలుస్తుందని చెప్పింది. సర్వే జరుగుతోందని, రిపోర్టు వచ్చాక అర్హులైన బాధితులను ఆదుకుంటామని స్పష్టం చేసింది.జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం కింద ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడంలేదంటూ డాక్టర్‌ చెరుకు సుధాకర్‌ 2020లో దాఖలు చేసిన పిల్‌లో అత్యవసర మధ్యంత పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిని చీఫ్‌ జస్టిస్‌ ఆలోక్‌ రాదే, జస్టిస్‌ టి.వినోద్‌ కుమార్‌ లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ సోమవారం విచారించింది.