– మాస్టర్ ప్రశ్నాపత్రం, ప్రాథమిక కీ విడుదల
– 26 వరకు అభ్యంతరాల స్వీకరణ
– ప్రశాంతంగా ముగిసిన పరీక్షలు
– ట్రిబ్ కన్వీనర్ మల్లయ్య బట్టు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గురుకుల విద్యాసంస్థల్లో 9,210 పోస్టుల భర్తీ కోసం ఈనెల ఒకటి నుంచి 23 వరకు నిర్వహించిన పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ట్రిబ్) కన్వీనర్ డాక్టర్ మల్లయ్య బట్టు తెలిపారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) విధానంలో నిర్వహించిన పరీక్షలకు మొత్తం 75.68 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీతో కూడిన మాస్టర్ ప్రశ్నాపత్రాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని తెలిపారు. అభ్యర్థులు వారి లాగిన్ ద్వారా సమాధాన పత్రంతో కీ తీసుకొని, ఏమైనా అభ్యంతరాలుంటే ఈనెల 26 వరకు తెలియ చేయాలని ఆయన కోరారు. ట్రిబ్ ఆధ్వర్యంలో 9,210 పోస్టుల భర్తీకి తొమ్మిది నోటిఫికేషన్లను విడుదల చేసి పరీక్షలను ఈనెల ఒకటి నుంచి 23 వరకు నిర్వహించామని గుర్తు చేశారు. అభ్యంతరాలను ఈమెయిల్, పిటిషన్లను స్వీకరించబోమని ఆయన స్పష్టం చేశారు. పరీక్షలు సజావుగా నిర్వహించడంలో సహకరించిన జిల్లా కలెక్టర్లు, అధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.