జంపన్నవాగులో 8 మృతదేహాలు లభ్యం

నవ తెలంగాణ – ఏటూరు నాగారం ఐడిఏ
ములుగు జిల్లా ఏటూర్‌నాగారం జంపన్న వాగు శాంతించడంతో వరద ముంపు ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. రెండు రోజులుగా కొండాయి, మల్యాల గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో ఉండగా కొంతమంది మల్యాలకు తరలివెళ్లి అడవిలో తలదాచుకున్నారు. మరికొంతమంది పక్క భవనాలు ఎక్కి రాత్రంతా ఆపన్న హస్తం కోసం ఎదురు చూశారు. జలదిగ్బంధంలో చిక్కుకొని సురక్షిత ప్రాంతానికి వెళ్లేందుకు గురువారం సుమారు 15 మంది కల్వర్టును దాటి వెళ్తుండగా ఒక్కసారిగా వరద వారిని తోసేయడంతో వారంతా గల్లంతయ్యారు. శుక్రవారం జంపన్న వాగు తగ్గుముఖం కట్టడంతో శుక్రవారం సాయంత్రానికి ఎనిమిది మృతదేహాలు లభ్యమయ్యాయి. వీరిలో దెబ్బకట్ల సమ్మక్క, మహమ్మద్‌ అజ్జు, షరీఫ్‌, మహబూబ్‌ ఖాన్‌, మజీద్‌ ఖాన్‌, రషీద్‌, కరీమా, లాల్‌ బీ ఉన్నారు. మిగతా ఏడుగురి కోసం బృందాలు గాలిస్తున్నాయి. వరద ఉధృతి తగ్గితే తప్ప మృతదేహాలు దొరికే పరిస్థితి లేదని అధికారులు చెబుతున్నారు. జంపన్న వాగు వరద ఉధృతికి పూర్తిగా జలమయమైన గ్రామాలు ఇప్పుడిప్పుడే వరద నుంచి తేరుకుంటున్నాయి. ఎన్ట్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలను వేగవంతం చేశాయి. గర్బిణీలు, రోగులు, పూర్తిగా ఆరోగ్యం క్షీణించిన వారిని ముందస్తుగా మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే సీతక్క సహాయక బృందాల సహాయంతో కొండాయి గ్రామంలోకి చేరుకుని గిరిజనుల దీన పరిస్థితి చూసి కన్నీరు పెట్టుకున్నారు. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలను ఓదార్చారు. ఒక్కో కుటుంబానికి రూ. 25 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అనంతరం జిల్లా ఎస్పీ గౌస్‌ ఆలం, ఓఎస్‌డీ అశోక్‌ కుమార్‌, ఎస్‌ఐ ప్రసాద్‌ కొండాయి, మల్యాలకు చేరుకొని ప్రజలను పలకరించారు. కొంతమంది పరిస్థితి క్షీణించడంతో వారిని పునరావాసకేంద్రాలకు తరలించారు. ఆహారపు పొట్లాలను అందించారు.