93.42 శాతం ఉత్తీర్ణత

– పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్షలో
– ఉత్తీర్ణులైన వారిలో 67 శాతం అమ్మాయిలే
– సీపీగెట్‌ 2023 ఫలితాలు విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలు, వాటి అనుబంధ కళాశాలల్లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష(సీపీగెట్‌ 2023)లో 93.42 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ పరీక్షకు మొత్తం 68,543 మంది దరఖాస్తు చేసుకోగా, 59,665 మంది హాజరయ్యారు. అందులో 55,739 (93.42 శాతం) మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. ఉస్మానియా యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ డి.రవీందర్‌, సీపీగెట్‌ కన్వీనర్‌ ఐ.పాండురంగారెడ్డితో కలిసి మంగళవారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ ఆర్‌.లింబాద్రి ఆ పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా చైర్మెన్‌ ఆర్‌.లింబాద్రి మాట్లాడుతూ, ఉత్తీర్ణులైన విద్యార్థులు ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మా గాంధీ, శాత వాహన, మహిళా యూనివర్సిటీ, జెఎన్‌టియుహెచ్‌ వర్సిటీలతో పాటు వాటి అనుబంధ కాలేజీల్లో ఎంఎ, ఎం.కాం, ఎమ్మెస్సీ తదితర పీజీ కోర్సులతో పాటు ఇంటిగ్రేటెడ్‌ పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చని అన్నారు.
ఓయూ వీసీ డి.రవీందర్‌ మాట్లాడుతూ, అన్ని యూనివర్సిటీల్లో మొత్తం 44,756 పిజి సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న మహిళలు క్రమంగా పెరుగుతున్నారని చెప్పారు. సిపిగెట్‌ ఉత్తీర్ణులైన వారిలో 67.39 శాతం మంది అమ్మాయిలే ఉన్నారని వెల్లడించారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారిలో 37,567 మంది అమ్మాయిలుంటే, 18,172 మంది మాత్రమే అబ్బాయిలున్నారని చెప్పారు. రాష్ట్రంలో బాలికల విద్యను ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్‌ చేపడుతున్న కార్యక్రమాలతో ఉన్నత విద్యను అభ్యసించే అమ్మాయిల సంఖ్య ఏటా గణనీయంగా పెరుగుతున్నదని అభిప్రాయపడ్డారు. ఇతర కోర్సులు చదివిన విద్యార్థులకూ అవకాశం కల్పించడంతో ఇంజనీరింగ్‌, ఇతర డిగ్రీలు చదివిన విద్యార్థులు ఎం.ఎ కోర్సుల్లో చేరుతున్నారని చెప్పారు. ఈ విద్యాసంవత్సరంలో 849 మంది ఇంజనీరింగ్‌ విద్యార్థులు ఎం.ఎ కోర్సుల్లో చేరేందుకు అర్హత సాధించారని తెలిపారు.
31న ఎం.ఏ జర్నలిజం పరీక్ష
సీపీగెట్‌ పరీక్షల్లో ఎం.ఏ జర్నలిజం పరీక్ష ప్రశ్నాపత్రంలో కొంత గందరగోళం తలెత్తడంతో ఆ పరీక్షను మళ్లీ నిర్వహించాలని నిర్ణయించినట్టు కన్వీనర్‌ ఐ.పాండురంగారెడ్డి వెల్లడించారు. ఈ నెల 31న ఎం.ఏ జర్నలిజం పరీక్షను నిర్వహిస్తామని అన్నారు. జూన్‌ 30 నుంచి జులై 10వ తేదీ వరకు రోజు మూడు సెషన్లలో సిపిగెట్‌ పరీక్ష నిర్వహించామని చెప్పారు. ఈ పరీక్షలు విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన అందరికీ కన్వీనర్‌ కృతజ్ఞతలు తెలిపారు.