ఈ రోజుల్లో పది మందిలో ఆరుగురు ఎదుర్కొనే సమస్య చుండ్రు… ఇందుకు ప్రధాన కారణం జుట్టుకు సరైన పోషణ లేకపోవడం.. నూనె సరిగా అప్లై చేయకపోవడం వల్ల మాడుపై ఎండినట్లు అయి ఫంగస్ ఏర్పడుతుంది. దీంతో చుండ్రు మస్యలు మొదలవుతాయి. దీనికి కొన్ని చిట్కాలు క్రమం తప్పకుండా పాటిస్తే సమస్యను పరిష్కరించుకోవచ్చు. అవేంటంటే…
నాలుగు చెంచాల హెన్నా పౌడర్, నిమ్మకాయ ఒకటి, పెరుగు తీసుకోవాలి. హెన్నా పౌడర్‌లో పెరుగు, నిమ్మరసం వేసి ఉండలు లేకుండా కలపాలి. ఈ మిశ్రమాన్ని మాడుకు అప్లై చేసుకోవాలి. అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. తల పూర్తిగా ఆరిన.. తర్వాత కండిషనర్ రాసుకోవాలి. నిమ్మరసం వల్ల ఈ ప్యాక్ వేసుకొన్నప్పుడు కాస్త మంట పెట్టే అవకాశం ఉంది. అయినప్పటికీ చుండ్రు సమస్యకు ఇది చక్కటి పరిష్కారం.
హెన్నా పౌడర్ నాలుగు చెంచాలు, కుంకుడుకాయల పొడి రెండు చెంచాలు, పెరుగు రెండు చెంచాలు తీసుకోవాలి. ఓ గిన్నెలో హెన్నా పౌడర్, కుంకుడు కాయల పొడి కలిపి మిశ్రమంగా చేయాలి. దీనిలో పెరుగు కూడా వేసి బాగా కలపాలి. ఈ ప్యాక్ తలకు అప్లై చేసి అరగంట తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. ఈ ప్యాక్ వారానికోసారి అప్లై చేసుకుంటే చుండ్రు తగ్గిపోతుంది. ఈ ప్యాక్‌లో ఉపయోగించిన కుంకుడు కాయలు.. మాడును మొత్తం శుభ్రం చేసి చుండ్రు రావడానికి కారణమైన ఫంగస్‌ను నాశనం చేస్తుంది.
హెన్నా నాలుగు చెంచాలు, నిమ్మరసం చెంచా, ఆలివ్ నూనె చెంచా, వైట్ వెనిగర్ చెంచా, మెంతుల పొడి చెంచా, పెరుగు రెండు చెంచాలు తీసుకోవాలి. శుభ్రమైన గిన్నెలో అన్నీ వేసి ఉండలు కట్టకుండా బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని 12 గంటల పాటు పక్కన పెట్టి ఉంచేయాలి. దీనిని రాత్రి సమయంలో నానబెట్టుకొని ఉదయం ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి రెండు నుంచి మూడు గంటల తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. డ్రై హెయిర్ కలిగిన వాళ్లు తలస్నానం తర్వాత కండిషనర్ రాసుకోవాల్సి ఉంటుంది. వారానికి ఒకసారి ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల చుండ్రు సమస్య తగ్గుముఖం పడుతుంది.
హెన్నా మూడు చెంచాలు, ఆలివ్ నూనె చెంచా, ఎగ్ వైట్ రెండు చెంచాలు, నీరు తీసుకోవాలి. ఓ గిన్నెలో హెన్నా, ఆలివ్ నూనె, ఎగ్ వైట్ వేసి తగినంత నీరు పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేసి అరగంట నుంచి 45 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. వారానికోసారి ఈ హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది. పైగా కోడిగుడ్డులో ఉండే ప్రొటీన్ వల్ల జుట్టు బలంగా తయారవుతుంది.