కుల ద్రువపత్రాలు ఇవ్వండి

– గిరిజన బిడ్డల ఉన్నతికి దోహదపడండి
– మా గ్రామాలను రెవెన్యూ గ్రామాలుగా గుర్తించండి
– ఆదివాసీల అభివృద్ధికి చేయూతనివ్వండి
– మొరపెట్టుకుంటున్న వలస ఆదివాసీలు
నవతెలంగాణ-చర్ల
ఆదివాసీల అభివృద్ధి కోసం అధికారులు చేయుతనివ్వాలని, ఆదివాసీ బిడ్డలు ఉన్నత చదువులు చదువుకోవడానికి అవసరమయ్యే కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని వలస ఆదివాసీలు మొరపెట్టుకుంటున్నారు. బుధవారం మండల వ్యాప్తంగా ఉన్న 20 వలస ఆదివాసీ గ్రామాల ఆదివాసీలు సుమారు 300 మంది తాసిల్దార్‌ ఆఫీసును ముట్టడించారు. తొలుత తమ గ్రామాలను రెవెన్యూ గ్రామాలుగా గుర్తించాలని, త్రీఫేస్‌ కరెంట్‌ ఇవ్వాలని, పోడు పట్టాలు ఇవ్వాలని, చదువుకున్న మా పిల్లలకు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని తాసీల్దార్‌ రంగు రమేష్‌, డిప్యూటీ తాసిల్దార్‌ బీరవెల్లి భరణి బాబులకు దరఖాస్తు సమర్పించి ఆదివాసీలు మాట్లాడారు. మండల పరిధిలో గల చెన్నాపురం, ఎర్రంపాడు, గోరుకొండ, భట్టి గూడెం,రాలాపురం, కొండవాయి, కృష్ణారంపాడు, తిమ్మిరి గూడెం, వీరాపురం, కోర్కట్పాడు అన్ని ఆదివాసీ వలస గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తాసిల్దార్‌ కార్యాలయం చేరుకొని తమ తమ సమస్యలను మొరపెట్టుకున్నారు. తాము సుమారు మూడు దశాబ్దాలుగా ఆయా ఆదివాసీ గ్రామాలలో నివసిస్తున్నామని మాకు తెలంగాణ రాష్ట్రం నుండి ఆధార్‌ కార్డు, ఓటు గుర్తింపు కార్డు ఉన్నాయని మా పిల్లలకు 2021 వరకు కుల ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం జరిగిందని ఇప్పుడు కులం ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఇమ్మంటే ప్రభుత్వం ఇవ్వద్దని అధికారులు చెప్పడం ఏమిటని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు సమన్వయం చేసుకొని మాకు అన్ని వసతులను ఇచ్చి మా జీవనోపాధికి తోడ్పడాలని వారు కోరుతున్నారు.
నా కొడుకుకి కల, ఆదాయ ధ్రువపత్రాలు ఇవ్వండి: ముష్కి జోగయ్య, రాలాపురం గ్రామ పెద్ద
నా కొడుకు పెద్ద చదువు కోసం కుల ఆదాయ ధ్రువపత్రాలు ఇవ్వండి. మేము గత 30 సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్రం ఎర్రంపాడు గ్రామంలో నివసిస్తున్నాం. మా ఓట్లు వేపించుకుంటూ మాకు కావాల్సిన సర్టిఫికెట్లు త్రీఫేస్‌ కరెంటు విద్యా వైద్యం, సక్రమమైన రోడ్లు, పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా అధికారులు నానా అవస్థలు పెడుతున్నారు. జిల్లా కలెక్టర్‌, భద్రాచలం ఐటీడీఏ పీవో మాపై దృష్టి పెట్టి మా సమస్యలకు పరిష్కార మార్గం చూపాలి.
-యువత అధోగతి పాలవుతున్నారు : కూడం ఉంగయ్య
రాల్లాపురం గ్రామ యువకుడు
పదవ తరగతి వరకు చదివిన తర్వాత ఇంటర్మీడియట్‌ చదువుల కోసం కుల, ఆదాయ ధ్రువపత్రాలు అవసరమై ఉన్నాయి. ఆ సర్టిఫికెట్లు లేకపోవడం వల్ల యువత అధోగతి పాలవుతున్నారు. సర్టిఫికెట్‌ లేక చదువు లేక యువత నానా అవస్థలు పడుతూ చెడు మార్గాల వైపు చూస్తున్నారు. అధికారులు మండల వ్యాప్తంగా ఉన్న 20 వలస ఆదివాసీ గ్రామాలపై దృష్టి సారించి మాకు తగిన న్యాయం చేయాలి. వలస ఆదివాసీ గ్రామాలలో విద్య, వైద్యం అత్యంత దారుణంగా ఉంది.
-ఎంక్వయిరీ చేసి కుల ఆదాయ ధ్రువపత్రాలు ఇస్తాను : రంగు రమేష్‌, చర్ల మండల తాసీల్దార్‌
సమగ్రమైన ఎంక్వయిరీ చేసిన తర్వాత వలస ఆదివాసీలకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే కుల, ఆదాయ దృవపత్రాలు ఇవ్వడం కుదురుతుంది. రెవెన్యూ గ్రామాల విషయం గెజిట్‌ పరిధిలో కలదు. కాబట్టి ఉన్నతాధికారుల సలహా మేరకు రెవెన్యూ గ్రామాలైన, పోడు పట్టాలైన ఇవ్వవలసి ఉంటుంది. ఇతర సమస్యల ఆయా శాఖల ద్వారా పరిష్కరించే మార్గం చేస్తాము.