– దేశం మొత్తం మణిపూర్‌లా మారుతుంది.
– మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలి
– అక్టోబర్ 5న ఢిల్లీలో బిజెపి వ్యతిరేక ర్యాలీ.
– ఐద్వా నాయకులు మాచర్ల భారతి, బుగ్గవీటి సరళ
నవతెలంగాణ-వైరాటౌన్
బీజేపీ పాలనలో మహిళలకు రక్షణ కరువైందని, మహిళల పైన అత్యాచారాలు, హింస పెరిగిందని, ప్రజల దృష్టిని మరల్చేందుకు, రానున్న ఎన్నికలలో మరలా గద్దెనెక్కడానికి బిజెపి ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చిందని, బిజెపిని గద్దె దించకపోతే మహిళలకు భవిష్యత్తు ఉండదని, దేశం మొత్తం మణిపూర్‌లా మారుతుందని ఐద్వా జిల్లా కార్యదర్శి మాచర్ల భారతి విమర్శించారు. బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న మహిళా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఐద్వా ఆధ్వర్యంలో అక్టోబర్ 5న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన భారీ నిరసన ర్యాలీని జయప్రదం చేయాలని కోరుతూ ఐద్వా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రచార జాత సోమవారం రాత్రి వైరా పట్టణానికి చేరుకుంది. ప్రచార జాతా బృందానికి పూలమాలలు వేసి, పూల బొకేలు, బతుకమ్మను ఇచ్చి ఐద్వా వైరా పట్టణ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వైరా, లాలాపురంలో ఐద్వా వైరా పట్టణ కార్యదర్శి గుడిమెట్ల రజిత అధ్యక్షతన జరిగిన సభలలో మాచర్ల భారతి మాట్లాడుతూ మహిళల ఓట్లను దండుకొని లబ్ది పొందేందుకు, మరోసారి దేశ ప్రజలను మోసం చేసేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని విమర్శించారు. గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా అనేక బిల్లులను ఏకపక్షంగా ఆమోదించుకున్న బిజెపి ప్రభుత్వం చివరి దశలో మహిళా బిల్లు తీసుకురావడం, జనగణన, నియోజకవర్గాల పునర్విభజన తర్వాత అమలు చేస్తామనడం వెనుక ఉన్న బిజెపి కుట్రను, దురుద్దేశాన్ని మహిళలు, ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బుగ్గవీటి సరళ మాట్లాడుతూ దేశంలో మత ఘర్షణలు పెరిగాయని, మనుషుల మధ్య కులాలు, మతాలు అడ్డుగోడలు పెట్టి హిందుత్వం పేరుతో మతోన్మాదాన్ని బిజెపి రెచ్చగొడుతుందని, ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు కారు చౌకగా అమ్ముతున్నారని ద్వజమెత్తారు. మహిళల సమస్యల పైన నిర్విరామంగా పోరాడుతున్న ఐద్వాకు అండగా ఉండాలని, మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణమే అమలు చేయాలని, మహిళల హక్కుల రక్షణ, భద్రతకు భరోసా కల్పించాలని, రేషన్ షాపుల్లో 14 రకాల సరుకులు అందించాలని, నిత్యావసరాల ధరలను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 5 ఢిల్లీలో జరిగే బీజేపీ వ్యతిరేక నిరసన ర్యాలీకి భారీ సంఖ్యలో మహిళలు కదిలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు బండి పద్మ, జిల్లా నాయకులు మెరుగు రమణ, బేగం, బీబీ, ఖమ్మం టు టౌన్, ఖమ్మం రూరల్, హవేలి, కొణిజర్ల, వైరా రూరల్ మండలాల కార్యదర్శులు బాగం అజిత, పెండ్యాల సుమతి, కత్తుల అమరావతి, తాళ్ళపల్లి విజయ, షేక్ షైనాబి, వైరా మాజీ ఎంపీపీ బొంతు సమత, భుక్యా విజయ, బత్తుల ప్రమీల, బందెల అమతమ్మ, చావా కళావతి, తాటి కృష్ణకుమారి, మాదినేని రజినీ, తోట పద్మావతి, గుమ్మా వెంకట సాయి లక్ష్మీ, తోట కృష్ణవేణి, బత్తుల కరుణ, దెవబత్తిని లక్ష్మీతులసి, బందెల సంధ్య , రాణి, భారతి తదితరులు పాల్గొన్నారు.