దళితబంధులో రాజకీయ జోక్యాన్ని నివారించాలి : సీపీఐ(ఎం)

నవతెలంగాణ- నేలకొండపల్లి
దళితులు, బీసీల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన దళిత బంధు, బీసీ బందు పథకాలలో అధికార పార్టీ నాయకుల రాజకీయ జోక్యాన్ని నివారించి అర్హులైన ప్రతి ఒక్కరికి దళిత, బిసి యూనిట్‌లు మంజూరు చేయాలని సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలేరు నియోజకవర్గ ఇన్చార్జ్‌ బండి రమేష్‌ డిమాండ్‌ చేశారు. శనివారం స్థానిక సిపిఐ(ఎం) కార్యాలయం రావెళ్ల సత్యనారాయణ భవనంలో పార్టీ మండల జనరల్‌ బాడీ సమావేశం రచ్చ నరసింహారావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితబంధు, బీసీబందు పథకాలలో అధికార పార్టీ నాయకుల జోక్యంతో పార్టీ కార్యకర్తలకు మాత్రమే యూనిట్లు మంజూరు చేస్తూ అర్హులైన లబ్ధిదారులను విస్మరిస్తున్నారని విమర్శించారు. పార్టీ నాయకులు కమీషన్లకు కక్కుర్తిపడి ప్రజా సంక్షేమ పథకాలను అర్హులకు దక్కకుండా వారి కార్యకర్తలకు పంపిణీ చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. సంక్షేమ పథకాల అమలుతీరులో పారదర్శకతకు పాతరేసిన అధికారులు సైతం అధికార పార్టీకి వంత పలుకుతూ అర్హులైన వారికి అన్యాయం చేస్తున్నారన్నారు. లక్ష రూపాయల రైతు రుణమాఫీలో కేవలం పాతికవేల రూపాయల అప్పు కలిగిన రైతులకు మాత్రమే మాఫీ చేసి మిగతా లక్ష రూపాయల వరకు అప్పు కలిగిన రైతులను విస్మరించడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు రుణాలు పూర్తిస్థాయిలో మాఫీ కాక తిరిగి రుణాలు ఇవ్వక పోవడంతో వ్యవసాయ పెట్టుబడులకు రైతులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారన్నారు. గృహలక్ష్మి పథకంలో అర్హులైన లబ్ధిదారులను గుర్తించి 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని, ఇళ్ల స్థలాలు, రేషన్‌ కార్డులు, పింఛన్లు అందించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన చేస్తున్న ఆశా వర్కర్లు, అంగన్వాడీలకు పార్టీ తరఫున సంపూర్ణ సంఘీభావం, మద్దతు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రజలు, రైతులు, కార్మికులు, కూలీలు, అన్ని వర్గాల ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేనియెడల పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి ఆందోళనలకు పూనుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా నాయకులు గుడవర్తి నాగేశ్వరరావు, మండల కార్యదర్శి కె.వి.రామిరెడ్డి, బెల్లం లక్ష్మి, దుగ్గి వెంకటేశ్వర్లు, భూక్య కృష్ణ, పగిడికత్తుల నాగేశ్వరరావు, కట్టెకోల వెంకన్న, సిరికొండ ఉమామహేశ్వరి, మారుతి కొండలరావు, డేగల వెంకటేశ్వరరావు, మందడపు మురళీకృష్ణ, బండి రామమూర్తి, శీలం అప్పారావు, పెద్దిరాజు నరసయ్య, శివరాజు, దండ సూర్యనారాయణ, మున్నంగి లక్ష్మీ, కె.వి చారి, మారుతి సూర్యనారాయణ, చింతలపాటి భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.
హామీలను వెంటనే అమలు చేయాలి
సీపీఐ(ఎం) పాలేరు డివిజన్‌ ఇన్‌చార్జి బండి రమేష్‌
నవతెలంగాణ- కూసుమంచి
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని, ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, ఇంకా అలసత్వం వహిస్తే సహించేది లేదని, పాలేరు నియోజకవర్గం వ్యాప్తంగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మిస్తామని పార్టీ పాలేరు డివిజన్‌ ఇంచార్జీ బండి రమేష్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శనివారం మండలంలోని మల్లేపల్లి గ్రామంలో గల పార్టీ కార్యాలయంలో ఆ గ్రామ సర్పంచ్‌ పొట్ట పెంజర నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన మల్లేపల్లి జోన్‌ కమిటీ సమావేశంలో బండి రమేష్‌ మాట్లాడుతూ రుణమాఫీ పూర్తిస్థాయిలో అమలు చేయలేదని, ప్రతి గ్రామంలో ఒకటి లేదా ముగ్గురు రైతులకు మినహాయిస్తే ఎక్కడా రుణమాఫీ అమలు కాలేదన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా రైతులు రుణమాఫీ కోసం ప్రతిరోజు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని, రుణమాఫీ ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తున్నారని అనానరు. నియోజకవర్గ వ్యాప్తంగా కల్లుగీత కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని అన్నారు. గొర్రెల పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తుందని, కురుమ, యాదవులకు ఆయా గ్రామాలలో గొర్రెల పథకానికి వడ్డీల తీసుకువచ్చి మరి యాదవులు డీడీలు కట్టారని, కానీ ఇంతవరకు గ్రామాలలో ఒకటి రెండు యూనిట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని రాష్ట్ర ప్రభుత్వం యాదవులను తీవ్రంగా మోసం చేసిందని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం యాదవులకు వెంటనే గొర్రెలను కానీ లేదా నగదు రూపాయల నగదును కురుమ యాదవులకు ఇచ్చి వారిని ఆదుకోవాలన్నారు. సమావేశంలో మల్లెపల్లి జూన్‌ కన్వీనర్‌ తోటకూరి రాజు, ముకుందా రెడ్డి, వీరస్వామి, రాధాకృష్ణ, మాజీ సర్పంచ్‌ తాళ్ళురి రవి, ప్రతాప్‌, శ్రీను తదితరులు పాల్గొన్నారు.