– మీ భాషా, ప్రవర్తన ఇకనైనా మార్చుకోండి
– విలేకరుల సమావేశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
నవతెలంగాణ-ఖమ్మం
‘కేటీఆర్ మీ కంటే నేను భాషను ఎక్కువగా ప్రయోగం చేయగలను. కానీ నాకు ఖమ్మం జిల్లా సభ్యత సంస్కారం అడ్డు వస్తుందని’ అని మధిర శాసనసభ్యులు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ఖమ్మం లోని సంజీవరెడ్డిభవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేటీఆర్ చదువుకున్న వ్యక్తి, కొంచెం ప్రపంచ జ్ఞానం తెలిసిన వారు, సంస్కారయుక్తంగా మాట్లాడుతారని అనుకున్నానని, ఖమ్మం వచ్చినప్పుడు ఆశించాం కానీ ఆయన భాషా, సంస్కార యుక్తంగా లేకపోవడం విచారకరమన్నారు. 150 సంవత్సరాలు నిండిన కాంగ్రెస్ పార్టీకి వారంటీ లేదంట, ముసలి నక్క ఏం చేస్తుందని కేటీఆర్ మాట్లాడటం ఏం భాష? ఖమ్మం వచ్చి మీటింగ్ పెట్టిన మీరు ప్రజలకు ఏం చేస్తారు? మీ విధానాలు ఏంటి? ఏం చేయబోతున్నారు? చెప్పకుండా అనవసర భాషను ప్రయోగించి సంస్కారం పోగొట్టుకున్నారని అన్నారు. ఖమ్మం పర్యటన చేయడానికి మీకు భయం పట్టుకున్నదని, అందుకనే విపక్ష పార్టీల నాయకులను పోలీసు లతో ముందస్తు గృహనిర్బంధం చేయించి, నువ్వు ఒక్కడివే పోలీసుల మధ్యన పర్యటన చేయడం నీకు ఎంత భయం ఉందో కనిపించిందని అన్నారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం వరకు వచ్చిన రోడ్డును అడిగితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసిందో… ఏంటో చెప్పేది. మీరు పాలనలో ఇన్నాళ్లు ఉండి ఉంటే నువ్వు ఖమ్మం రావడానికి ఎద్దుల బండిలో నెల రోజులు పట్టేదని, పదేళ్లలో ఒక్క రోడ్డునైనా మీరు బాగు చేశారా అని ప్రశ్నించారు. ఈ పది సంవత్సరాల పాలనలో వ్యవస్థలు కూల్చారని, సంస్థలను నాశనం చేస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని, ప్రజల ఆస్తులను అప్పనంగా అమ్మేస్తున్నారని,. హైదరాబాద్ చుట్టూ ఉన్న వేలాది ఎకరాలు అమ్ముతున్నారని, అడిగితే కేసులు. ప్రశ్నిస్తే వేధింపులు. ఇదేనా మీ బంగారు పాలన అని ప్రశ్నించారు. తెలంగాణలోని 80 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ ను ప్రజలు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు భయపడిపోయి వారంటీ లేదంటున్న కేటీఆర్, బీఆర్‌ఎస్ పాలకులకే రాష్ట్రంలో ఇక వారంటీ లేకుండా ప్రజలు చేస్తారని అన్నారు. ఎన్ని మీటింగ్లు పెట్టిన పోలీసులతో ఎంత నిర్బంధం చేసిన ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేసి గెలిపిస్తారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం భావజాలం నమ్మి సేవ చేసిన వారిని ఎవరిని పార్టీ వదులుకోదని, వారిని గౌరవిస్తాం. సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు. దేశంలో మతతత్వ బిజెపికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఏర్పాటు చేసిన కూటమిలో ఉన్న వామపక్షాలతో రాష్ట్రంలో ఎన్నికల పొత్తుల గురించి చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. బావ సారూప్యత కలిగిన పార్టీలు కాంగ్రెస్తో కలిసి వచ్చే పార్టీలతో కచ్చితంగా పొత్తులు పెట్టుకుంటామని తెలిపారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఇతర పార్టీలోకి వెళ్లకుండా ఉండటానికి సీఎం కేసీఆర్ ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించారని, కానీ కాంగ్రెస్కు అలాంటి సమస్య లేదని, ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే కాంగ్రెస్ పార్టీ ముందస్తుగానే అభ్యర్థుల ఎంపిక కసరత్తు చేస్తున్నదని తెలిపారు. ఈ విలేఖరుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పిసిసి సభ్యులు మహ్మద్ జావేద్, పిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు, పుచ్చకాయల వీరభద్రం, రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బాలాజి నాయక్, జిల్లా కిసాన్ కాంగ్రెస్, మైనారిటీ అద్యక్షులు మొక్కా శేఖర్ గౌడ్, సయ్యద్ హుస్సేన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు చోటా బాబా, మద్ది వీరారెడ్డి పాల్గొన్నారు.