– 18 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
– దళిత బంధుతో సత్తుపల్లిలో 30 వేల కుటుంబాలకు లబ్ది
– రెండు గంటల్లోనే జీవో విడుదల చేసిన ఘనత కేటీఆర్‌ది
– సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య
నవతెలంగాణ-కల్లూరు
రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ పథకం ప్రారంభించిన మానవతా కోణంతోనే ఆలోచించి ప్రారంభిస్తారని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య అన్నారు. ఆదివారం మండలంలో 18 కోట్ల రూపాయలతో సిసి రోడ్లు, బిటి రోడ్లు, జిబి బిల్డింగులు, కమ్యూనిటీ హాల్స్‌కు ఎమ్మెల్యే కొన్ని శంకుస్థాపన చేయగా కొన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్న కోరుకొండి, పోచారం, పెద్ద కోరుకొండి, వెన్నవల్లి తెల్లగారం, మర్లపాడు, తాళ్లూరు వెంకటాపురం చెన్నూరు గ్రామాల్లో ఎమ్మెల్యేకు ప్రజలు పూలు చల్లి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశాల్లో ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ అట్టడుగునున్న వారిని ఆదుకోవడం కోసం, ఆర్థికంగా బలోపేతం చేయడం కోసమే దళిత బంధు పథకం ప్రవేశపెట్టినట్లు తెలిపారు. సత్తుపల్లి నియోజకవర్గం పర్యటనకు వచ్చిన కేటీఆర్ సత్తుపల్లిలోని ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు అమలు చేస్తానని చెప్పిన రెండు గంటల్లోనే జీవో నెంబర్ ఎంఎస్ 16ను విడుదల చేసిన ఘనత కేటీఆర్ కే దక్కిందన్నారు. వెంటనే కలెక్టర్ తో మాట్లాడి సర్వే కోసం ప్రత్యేక అధికారులు ఏర్పాటు చేసి త్వరితంగా దళిత బంధు పథకాన్ని అందరికీ అందించాలని ఆదేశించడం జరిగింది. దీంతో సర్వే పనులు ప్రారంభమయ్యాయి మాటలు చెప్పేది కాదు పనులు చేసి చూపించేదే కేసీఆర్ ప్రభుత్వం అన్నారు. నియోజకవర్గంలో 30 వేల దళిత కుటుంబాలు ఉన్నాయని, వారికి 450 కోట్ల రూపాయలు ఈ పథకానికి సంబంధించిన నిధులు సత్తుపల్లికి రానున్నాయన్నారు. అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తూ పేదరికం గీటురాయిగా పనిచేస్తున్న కెసిఆర్ ప్రభుత్వానికి మద్దతు తెలిపి మూడోసారి ముఖ్యమంత్రి చేయాల్సిన బాధ్యత మన మీద ఉందని ఆ విధంగా ప్రజలు ఆశీర్వదిస్తారని కోరారు. ఈ కార్యక్రమంలో పిఆర్డి ఈ.రాంబాబు, ఏఈలు కే.వెంకటేశ్వరరావు, సాంబశివరావు, ఎండిఓ బి.రవికుమార్, ఎంపీపీ బి.రవల్లి రఘు, జడ్పిటిసి కట్టా అజరు కుమార్, సొసైటీ చైర్మన్ చావా వెంకటేశ్వరరావు, నర్వనేని పెద్ద అంజయ్య, పాలెపు రామారావు, డిసిసిబి డైరెక్టర్ బోబోలు లక్ష్మణరావు, సర్పంచులు నామ రాధమ్మ, యశోద, కస్తాల సీతామహాలక్ష్మి, సండ్రు అన్నపూర్ణ, మోదుగు యశోద, వెన్నవల్లి ఎంపీటీసీ ఉప్పు సుబ్బారావు, మండల నాయకులు ప్రజలు పాల్గొన్నారు.