– కాంగ్రెస్ పార్టీ జోన్ కమిటీ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే భట్టి
నవతెలంగాణ-ముదిగొండ
కేసీఆర్ హయాంలో రాష్ట్రం దివాలా తీసిందని సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మూడో జోన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం వనంవారికిష్టాపురంలో ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదలకు ఇల్లు, రైతులకు రుణమాఫీ ఇవ్వలేకపోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇండ్లు, పింఛన్లు రైతులకు ఉచిత కరెంటు, రుణమాఫీ అందించిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కెసిఆర్ లక్షల కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు. మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టి కెసిఆర్ దోపిడీ పాలన చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు ప్రజా పథకాలను అమలు చేసి తీరుతామన్నారు. కాంగ్రెస్ పార్టీ పథకాలను ప్రతి ఓటరుకు, తెలియజేస్తూ గడపగడపకు కార్యకర్తలు ప్రచారం చేయాలన్నారు. మధిర నియోజకవర్గంలోపాటు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతుందన్నారు. పాదయాత్ర నిర్వహిస్తుండగా అనేక ప్రజా సమస్యలను నాదృష్టికి వచ్చాయని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లేవన్నారు. రైతులు అప్పుల పాలై ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, మధిర నియోజకవర్గ బిబ్లాక్ అధ్యక్షులు కందిమల్ల వీరబాబు, మండల అధ్యక్షులు కొమ్మినేని రమేష్ బాబు, మండల ప్రధాన కార్యదర్శి, జోన్ ఇంచార్జ్ పందిరి అంజయ్య, నాయకులు పసుపులేటి దేవేంద్రం, వల్లూరి భద్రారెడ్డి, సామినేని పాల్గొన్నారు.