పోరాడి నిధులు సాధించిన చరిత్ర సీపీఐ(ఎం) దే..!

– రోజుకో పార్టీ మార్చే అవకాశ వాదులు తాత మధు, తెల్లంకు సీపీఐ(ఎం)ను విమర్శించే అర్హత లేదు
– నియోజకవర్గ అభివృద్ధి సీపీఐ(ఎం)తోనే సాధ్యం
– పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు, నియోజకవర్గ కన్వీనర్‌ మచ్చా
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి అంతా సీపీఐ(ఎం) ఎమ్మెల్యేలు ముర్ల ఎర్రయ్య రెడ్డి, కుంజా బొజ్జీ, సున్నం రాజయ్య ఉన్నప్పుడు జరిగిందేనని, ఏ పార్టీ అధికారంలో ఉన్న పోరాడి నిధులు సాధించిన చరిత్ర సీపీఐ(ఎం) దేనని, రోజుకో పార్టీ మార్చే అవకాశవాదులు తాత మధు, తెల్లం వెంకటరావులకు సీపీఐ(ఎం) విమర్శించే అర్హత లేదని పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు, నియోజకవర్గ కన్వీనర్‌ మచ్చా వెంకటేశ్వర్లు అన్నారు. భద్రాచలంలో సోమవారం జరిగిన పార్టీ సమావేశం యం.బి.నర్సారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఏ పార్టీ ఉన్న భద్రాచలం అభివృద్ధికి కావాల్సిన నిధులు సాధించిన ఘనత సీపీఐ(ఎం) ఎమ్మెల్యేలది అని అన్నారు. భద్రాచలం నియోజకవర్గంలో విద్య, వైద్యం, సాగునీరు, తాగునీరు, రోడ్లు, విద్యుత్తు మొదలగు రంగాలలో సమగ్రమైన అధ్యయనం చేసి ప్రభుత్వాల ముందు ప్రతిపాదన నుంచి వాటి సాధన కోసం చట్టసభలో పోరాటంతో పాటు ప్రజలను సమీకరించి ప్రజా పోరాటాలు నిర్వహించింది సీపీఐ(ఎం) అన్నారు. నేడు భద్రాచలంకు రక్షణ కవచంగా ఉన్న గోదావరి కరకట్ట నిర్మాణం నాటి తెలుగుదేశం ప్రభుత్వంలో భద్రాచలం ఎమ్మెల్యేగా కుంజా బొజ్జి ఉండగా నిర్మించిందే అని అన్నారు. మారుమూల గిరిజన గ్రామాలకు సైతం రోడ్లు, కరెంటు సౌకర్యం అందించిన ఘనత సీపీఐ(ఎం) దేనని అన్నారు. మండల కేంద్రాలతో పాటు అవసరం ఉన్న ప్రతి చోటా పిహెచ్సి సెంటర్లు నిర్మాణం ద్వారా గిరిజన, గిరిజనేతర పేద ప్రజలకు వైద్యం అందుబాటులో తెచ్చింది పార్టీ ప్రజాప్రతినిధులేనని గుర్తు చేశారు. నేడు భద్రాచలంలోని సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చెందింది సున్నం రాజయ్య ఎమ్మెల్యేగా ఉన్నప్పుడేనని గుర్తు చేశారు. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ చదువుకు దగ్గరయ్యే విధంగా సంక్షేమ హాస్టల్‌లు, ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసే విధంగా పార్టీ కృషి చేసిందని తెలిపారు. నియోజకవర్గంలో వ్యవసాయ అభివృద్ధి కోసం మారుమూల గ్రామాలకు సైతం చెక్‌ డ్యాములు, చెరువులు, లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులు సాధించడంతో పాటు సాగునీటి ప్రాజెక్టుల సాధన కోసం పోరాడింది పార్టీయేనని అన్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం భద్రాచలం కేంద్రంగా ఐటీడీఏ ఏర్పాటు చేయాలని పోరాడి సాధించింది సీపీఐ(ఎం), నాటి శాసనసభ్యులేనని అన్నారు. భద్రాచలం పట్టణంలో గోదావరి మంచినీరు అందించడం కోసం అన్ని పార్టీల సహకారంతో మంచినీటి సాధన పోరాట కమిటీ పేరుతో నిర్వహించిన ఉద్యమ ఫలితంగా మొదటి, రెండవ, మూడవ వాటర్‌ ట్యాంకుల నిర్మాణం జరిగిందని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మిషన్‌ భగీరథ పథకం భద్రాచలం పట్టణాన్ని మినహాయిస్తే భద్రాచలం పట్టణాన్ని సైతం మిషన్‌ భగీరథలో చేర్చాలని నాటి ఎమ్మెల్యే సున్నం రాజయ్య శాసనసభలో పోరాడారని దాని ఫలితంగానే నేడు ప్రతి ఇంటికి మిషన్‌ భగీరథ నీరు అందుతుందని అన్నారు. గత తొమ్మిదిన్నర ఏళ్లలో భద్రాచలం పట్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్య ధోరణి వివక్షతను కప్పిపుచ్చుకోవడానికి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్నారని అందుకే అభివృద్ధి జరగలేదని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఎంపీ, ఎంఎల్సి, జడ్పీ చైర్మెన్‌, జిల్లా మంత్రి వీరందరూ అధికారపక్షం అయినప్పుడు నిధులు ఎందుకు రాబట్ట లేకపోయారు అని ప్రశ్నించారు. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే సీపీఐ(ఎం) తోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని నేడు నియోజకవర్గంలోనీ ప్రజలు పార్టీ వైపు చూస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, జిల్లా కమిటీ సభ్యులు ఎం.రేణుక, సున్నం గంగా, పార్టీ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు బి.వెంకటరెడ్డి, వై.వెంకట రామారావు తదితరులు పాల్గొన్నారు.