అలవిగానిదేదో

Something unusualకరుగనితనం అనుకుంటుందిగానీ
శూన్యంలోనుంచి కురిసేదేముంటుంది
దట్టంగా కమ్ముకున్న నల్లని మేఘపటలం
నిండా విస్తరించి అలజడిగా కదిలించేవరకు

పచ్చదనాలు అలుముకున్న ఆనందాలు
విస్మయ వినిర్మాణాలు
గోచార అగోచర ప్రపంచాలు
అన్నీ స్థిరమనుకున్న సాత్వికతను
లోలోపలి ఒక ఆశ రెండు కలలు
అధిక శక్తి చలనాలై కుదుపు కుదిపినపుడు
ఉపరితలపు కంపనాలను ఆపే క్షణమేది

వడి సవ్వడి లేని నిదానమే స్వభావం
అనే అనుకుంటుంది ప్రవాహం
అగాధమొకటి ఎదురైనపుడే
జలపాతం తానని ఎరుక కలిగేది

సారూప్యమైనది
కన్నీరై జారేవరకు
నిండా ప్రేమ ఉందని తెలుసుకోలేని మనసొకటే
– డా కాచాపురం దుర్గాదేవి, 7893093495