డయోగస్టిక్స్‌లో నవ్య కేతనం డాక్టర్‌ దివ్య

In diogastics Navya Ketan Dr. Divyaచదువు సంస్కారాలు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుస్తాయి. అనుకున్నది సాధిస్తారు. విజయం ధరహాసమై తొణికిసలాడుతుంది. ఇంకా ఇంకా కృషి చేస్తూ అందరి మన్ననలు అందుకుంటారు. అలాంటి కోవకే చెందుతారు డాక్టర్‌ దివ్య శ్రీరామ్‌ డయాగస్టిక్‌ సెంటర్‌ స్థాపించి అందులో ఆమె సాధించిన విజయాలను తెలుసుకుందాం.
క్యాన్సర్‌ డిసీజ్‌పై పరిశోధనలు
చదువును కష్టంగా చదివే వాళ్ళకి పూర్తి చేయడం కష్టం కానీ, ఇష్టంగా చదివే వాళ్ళకి ఏం కష్టం? తను చేసే పని మీద శ్రద్ధ, భక్తి ఉన్నవాళ్లు తప్పకుండా విజయం సాధిస్తారు. ఒక ధ్యేయంతో చదువును పూర్తి చేసుకున్నది కాబట్టే దివ్య తొందరలోనే సొంతంగా ఒక డయాగటిక్‌ సెంటర్‌ ప్రారంభించాలని అనుకుంది. ఆ సెంటర్‌ పేరే డినోమ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌. ఇది హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఉన్నది. ఎంటర్ప్రినర్‌ లండన్‌ బేస్డ్‌ టాలెంట్‌ ఇన్వెస్టర్స్‌లో మూడు నెలల ప్రోగ్రాంలో పాల్గొన్న దివ్య ఇక్కడ ఆఫీస్‌లో వర్కింగ్‌ పార్టనర్‌ను సెలెక్ట్‌ చేసుకుని ఇద్దరూ కలిసి బిజినెస్‌ చేస్తున్నారు. క్యాన్సర్‌ డిసీజ్‌పై వీరి పరిశోధనలు, ఫలితాలను చూసి ఇండియా ప్రభుత్వం 50 లక్షల గ్రాంట్‌ మంజూరు చేసింది. బి.ఐ.జి. బిరాక్‌ గ్రాంట్‌ దీన్నే బయోటెక్నాలజీ ఇన్నోవేట్‌ గ్రాంట్‌ అని అంటారు. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా నుండి ఈ మొత్తాన్ని తీసుకున్న దివ్య శ్రీరామ్‌, సూయజ్‌ డెబ్‌ సహకారంతో క్యాన్సర్‌పై పరిశోధనలు చేస్తున్నది. ఇవి సాధికారికంగా జరుగుతున్నాయి. ఇన్వెస్టర్స్‌గా లండన్‌ బేస్డ్‌ టాలెంటెడ్‌ వారు ఉన్నారు.
దివ్య తండ్రి శ్రీరామ్‌ దివాకరన్‌. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో వింగ్‌ కమాండర్‌ (రిటైర్డ్‌). ఉద్యోగ రీత్యా దేశంలోని అన్ని ప్రదేశాలకు తిరగవలసి వచ్చేది. దాంతో విభిన్నమైన సంస్కృతి సంప్రదాయాలు దివ్యకు పరిచయమయ్యాయి. పదవ తరగతి వరకు తమిళనాడులోని తిరునల్వేలిలో చదువుకుంది. దివ్య కేంద్రీయ విద్యాలయ విద్యార్థిగా దేశవ్యాప్తంగా చదువుకోగలిగింది. దివ్య తల్లి భాగ్యలక్ష్మి శ్రీరామ్‌, సైన్స్‌ టీచర్‌. దివ్య చిన్ననాటి నుండి తల్లిని ఎప్పుడు ఏవో ప్రశ్నలు అడుగుతూ ఉండేది. సైన్స్‌ బయోలాజికల్‌ ఎక్స్పరిమెంట్స్‌ బాగా నేర్పించేది. తాత(తండ్రి తండ్రి) ఆమెకు ఎన్‌సైక్లోపీడియా ఆఫ్‌ సైన్స్‌ పుస్తకాలను బహుమతిగా ఇచ్చేవారు. వీరు ఎలక్ట్రికల్‌ ఇంజనీర్‌గా ఉద్యోగం చేసేవారు. ఇంట్లో వారి గదిలో మూడు గోడలకు పుస్తకాలుండేవట. దివ్య నాన్నమ్మ, విద్యావతి దివాకరన్‌. వీరు బిజినెస్‌ వుమెన్‌, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో స్వతంత్రంగా నిలదొక్కుకున్న మహిళ. దివ్య అమ్మమ్మ, బాల స్వామినాథన్‌. వీరు ఇంగ్లీష్‌ టీచర్‌గా చేశారు. తాత ఇ.ఎస్‌.స్వామినాథన్‌ ఇండియా సిమెంట్స్‌లో మేనేజర్‌గా చేశారు.
చిన్నతనం నుండే… 
దివ్యకు చిన్ననాటి నుంచి సైంటిస్ట్‌ కావాలనే కోరిక ఉండేది. చదువులోనే కాదు ఆటపాటల్లోనూ చురుగ్గా ఉండేది. పాఠశాలలో ఉన్నప్పుడు బాస్కెట్‌ బాల్‌ టీం కెప్టెన్‌ ఈమె. టైం దొరికినప్పుడల్లా లైబ్రరీకి వెళ్లి చదువుకొనే దివ్య ఫిజిక్స్‌, బయాలజీని ఇష్టంగా చదివేది. బేసిక్‌ ఫిజిక్స్‌ వంటివి వాళ్ళ నాన్న కూర్చోబెట్టుకుని చెప్పేవారు. అమ్మ చదవడం పరిచయం చేసింది. దాంతో ఏడెనిమిదేండ్లకే కథలు, పిల్లల నవలలు చదివింది. ఆరవ తరగతి నాటికే అన్ని ఎన్సైక్లోపీడియాలూ చదివేసింది. దివ్య నాన్న కజిన్‌ ఒకరు మ్యాథమెటిక్స్‌ సైంటిస్ట్‌, పీహెచ్డీ. గేమ్‌ థియరీ, మ్యాథమెటిక్స్‌ గేమ్‌ కంప్యూటేషనల్‌ సైన్స్‌ ఇన్‌ మ్యాథమెటిక్స్‌ వంటి పుస్తకాలు, గేమ్స్‌ కాంప్లెక్స్‌ క్యాలిక్యులేషన్స్‌ వంటి వాటిపై పనిచేశారు. ఆయన తరచూ అమెరికాకు వెళ్లేవారు. అక్కడి నుండి దివ్య కోసం బయాలజీకి సంబంధించిన పుస్తకాలను తెచ్చి బహుమతిగా ఇచ్చేవారు. అవన్నీ దివ్య బాగా చదివేది. ఈ ఉత్సాహం, ఈ ఆసక్తి చదువులోనూ కనబరిచి అందరి మెప్పును పొందిన దివ్య డాక్టర్‌ లేదా ఇంజనీరింగ్‌ కావాలని అనుకోలేదు.
టాప్‌ 30 మందిలో స్థానం 
ఇంటర్‌లో మ్యాథ్స్‌ బయో కాంబినేషన్స్‌తో చదివినా బిట్స్‌ పిలానీలో బీ.ఎస్‌.సి, ఎంఎస్సీ ఫిజిక్స్‌తో చదవాలనుకున్నది. కాని ఇంటిగ్రేటెడ్‌ బయోటెక్నాలజీ కోర్స్‌ ఎం.ఎస్‌.సి., వి.ఐ.టి.యూనివర్సిటీ, వెల్లూరులో ఐదేండ్లు డ్యూయల్‌ డిగ్రీ కోర్సుతో పూర్తిచేసింది. సి.ఎస్‌.ఐ.ఆర్‌.ఎన్‌.ఈ.టి.సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (గవర్నమెంట్‌), ఆల్‌ ఓవర్‌ ఇండియా నుంచి లక్ష మంది హాజరైన ఈ పరీక్షలో టాప్‌ 30 మంది స్టూడెంట్స్‌లో స్థానం సంపాదించింది. హైదరాబాదులో హబ్సిగూడలో ఉన్న సి.ఎస్‌.ఐ.ఆర్‌.ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ బయోటెక్‌, సి.సి.ఎమ్‌.బి.లో క్యాన్సర్‌ సెల్‌ బయోలజీలో పి.హెచ్‌ డి. చేసింది.
ఎన్నో ప్రయత్నాలు చేసి 
ఇప్పుడు ఉత్పత్తి క్రమం ఒక్కటే చరిత్రను నడిపిస్తున్నది. ప్రజోత్పత్తి విషయాలే మౌలికమైన అంశాలు, అవసరాలు. ఇందులో భాగమైనవే ఆరోగ్యం.. అనారోగ్యం అనేవి. మంచిగా ఉన్నంత వరకు మనుషులను పట్టలేము. ఏదైనా అనారోగ్యం వచ్చిందంటే చాలు ఇక మొదలవుతాయి అవస్థలు. ఏమయిందో తెలుసుకోడానికి ముందు పరీక్షలు చేయాలి. డయోగస్టిక్‌ సెంటర్స్‌లో పరీక్షలు చేస్తేనే జబ్బును కనుగొనగలరు. మారుతున్న జీవన ప్రమాణాల వల్ల ఎన్నో కొత్త కొత్త జబ్బులు వచ్చి పడుతున్నవి. ఆయా ఇన్ఫెక్షన్స్‌ ఎట్లా వచ్చాయో, పర్యవసానం ఏమిటో అనేది డయాగస్‌ చేస్తే గాని డాక్టర్లు సరైన చికిత్స ఇవ్వగలరు. ఈ టెక్నిక్స్‌ గురించిన సబ్జెక్టులన్నీ చది, ఎన్నో ప్రయత్నాలు చేసి దివ్య ఈరోజు డినోమ్‌ సంస్థకు సీఈఓ అయింది.
మంచి గౌరవం పొందారు 
దివ్య పరిశోధనా అంశాలపై చాలా పత్ర సమర్పణలు చేసింది. ఏ విషయంలో అయినా మనస్ఫూర్తిగా చదివి, శోధించి, పరిశోధన చేస్తే మంచి ఫలితాలు వస్తాయి అనడానికి దివ్య చక్కటి ఉదాహరణ. 2019లో ఇండియాలో జరిగిన ఎంబీసీ కాన్ఫరెన్స్‌, దీఱశీషశీఅలో కూడా ఈమె పాల్గొన్నది. దేశవ్యాప్తంగా పాల్గొన్న 50 మందిలో ఒకరుగా మంచి గౌరవం పొందారు. భర్త, అత్తమామలు దివ్యకు తోడునీడగా ఉంటున్నారు. తమ్ముడు కూడా ఆమెకు ఎంతో సపోర్ట్‌ చేస్తున్నాడు. బయో ఏషియా కాన్ఫరెన్స్‌ అప్పుడు బయోటెక్‌ సెంటర్లో ఒక ప్రెస్‌ పర్సన్‌ లాగా కొందరు ప్రముఖులను ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ఐటి మంత్రి కేటీఆర్‌ని కూడా ఇంటర్వ్యూ తీసుకుంది ఈమె. ఇండియా బయో సైన్స్‌ పత్రికలో ఈమె ఆర్టికల్స్‌, జర్నల్స్‌ కూడా వస్తుంటాయి. కొందరు ఏమీ చేయకుండానే ఎన్నో చేశామని, కొంతచేసే కొండంత చేశామని చెప్పుకుని గర్వపడుతుంటారు. కానీ వివేకవంతులు ఎంతో చేసి కొంతే చేశామని చెప్తుంటారు. వీళ్ళే నిగర్వులు. ఆశయ సాధనలో అడుగులు ముందుకు వేస్తూ సమాజానికి ఉపయోగపడేలా క్యాన్సర్‌ వంటి భయంకర వ్యాధులను డయాగస్‌ చేస్తూ సమాజానికి అండగా నిలబడుతున్న డాక్టర్‌ దివ్య ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు.

– డాక్టర్‌ కొండపల్లి నీహారిణి