– పగిలిన నీటి ట్యాంకులు
– పట్టించుకోని అధికారులు
– ఆదివాసీల విన్నపాలు అరణ్య రోదనలు
– ఒక కోటి 30 లక్షల ప్రజాధనం వృథా
నవతెలంగాణ-చర్ల
ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తానంటూ ప్రలాభాలు పలుకుతున్న బీఆర్‌ఎస్ పార్టీకి మారుమూల ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీలు శుద్ధ జలానికి దూరమైన దుస్థితి కనపడటం లేదా అని పలువురు బాహాటంగా విమర్శిస్తున్నారు. దానికి ప్రత్యక్ష నిదర్శనం మండల పరిధిలోని చెన్నాపురం, ఎర్రంపాడు గ్రామాలలో మిషన్ భగీరథ తాగునీరు ఇవ్వకపోగా సోలార్ శక్తి ఆధారిత నీటి సరఫరా పంపు మరమ్మతులకు గురైనా అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడమే.గడిచిన 5 నెలలుగా ఎర్రపాడు గ్రామంలో సోలార్ శక్తి ఆధారిత నీటి సరఫరా పంపు ద్వారా ఏర్పాటు చేసిన నీటి ట్యాంకు పగిలి తాగునీరు అంతా వృథా అవుతున్న సంబంధిత అధికారులు కానీ, కార్యదర్శి కానీ, ప్రజా పాలకులు సర్పంచ్ కానీ అటువైపు చూడకపోవడంపై గిరి పుత్రులు మండిపడుతున్నారు.
2020 సంవత్సరంలో మండల వ్యాప్తంగా సుమారు 16 హ్యాపీటేషన్లో సోలార్ శక్తి ఆధారిత నీటి సరఫరా పంపులను సుమారు ఒక కోటి 30 లక్షల రూపాయల వ్యయంతో ఎర్రంపాడు, చెన్నాపురం, బత్తెనపల్లి, గోరుకొండ, కమలాపురం, కృష్ణారాంపాడు మొదలగు ఆదివాసీ గ్రామాలలో నిర్మించారు. ప్రభుత్వ లక్ష్యం ఉన్నతమైనదైనప్పటికిని సంబంధిత అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆ పథకం ఆదిలోనే హంసపాదుల నీరుకారుతోందని పలువురు విమర్శిస్తున్నారు. శుద్ధ జలం మాట దేవుడెరుగు కానీ కనీసం తాగునీరు లేక వర్షాభావ పరిస్థితులలో బోరు బావుల నుండి కిలుము వాసన వచ్చే అపరిశుభ్రమైన నీరు తాగి రోగాల భారీన వస్తుందని నిరుపేద ఆదివాసీలు ఆందోళన చెందుతున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి ఆదివాసీ గ్రామాలలో ఉన్న తాగునీటి వసతులను మరమ్మతులు చేయించి వచ్చే వేసవిలో నీటి కష్టాలు తీర్చాలని పలువురు గిరిజనులు వేడుకుంటున్నారు.
-మంచినీళ్లకు ఇబ్బంద వుతుంది : అడమయ్య, చెన్నాపురం గ్రామ యువకుడు
మా గ్రామానికి మిషన్ భగీరథ నీరు రావడం లేదు. గ్రామంలో ఏర్పాటు చేసిన సోలార్ శక్తి పంపు పని చేయడం లేదు. మంచినీళ్లకు తెగ ఇబ్బంది అవుతుంది. బోర్లలో నీళ్లు తాగితే జబ్బులు వస్తున్నాయి. సెక్రటరీకి, సర్పంచ్ కి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. మా ఓట్లు కావాలి కానీ మాకు మంచి నీళ్లు పోసే దిక్కులేదు. ఉన్నతాధికారులు మా సమస్యలను పట్టించుకోవాలి
-నీటి ట్యాంకు పగిలిపోయింది : కొవ్వాసి ఉంగయ్య, ఎర్రంపాడు గ్రామ యువకుడు
మా గ్రామంలో ఉన్న రెండు సౌరశక్తి తాగునీటి పంపులు పాడైపోయాయి. అందులో ఒకటి మంచినీ ట్యాంకు పగిలిపోయింది. తాగునీటికి బాగా ఇబ్బంది అవుతుంది. కరెంటు పోయినప్పుడు తాగడానికి మంచినీళ్లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. ఉన్నతాధికారులు దృష్టి పెట్టి కొత్త ట్యాంకు బిగించాలి. కూలీ నాలి చేసుకొని బతికే మాకు తాగే మంచినీరు లేక చాలా ఇబ్బంది అవుతుంది. సెక్రెటరీ అసలు మా గ్రామంలోకి రానే రావడం లేదు. మా గ్రామ సమస్యలు పట్టించుకోవడం లేదు ఎన్నిసార్లు మేము వెళ్లి చెప్పిన చేద్దాం అనే, మాటే తప్ప గ్రామాల్లోకి వచ్చి మాకు కావాల్సిన వసతులు అందించడం లేదు పై అధికారులు మా గ్రామం పై దష్టి చారించి మా సమస్యలు తీర్చాలి.