డిసెంబర్‌ 4న ఛలో ఢిల్లీ

– కోటి సంతకాల సేకరణ
– ఏఐఏడబ్ల్యూ-బికేఎంయూ-డిహెచ్‌పిఎస్‌-కెవిపీఎస్‌
నవతెలంగాణ-కొత్తగూడెం
దళితుల హక్కులు, రాజ్యాంగ పరిరక్షణ కోసం డిసెంబర్‌ 4న ఛలో డిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం కేంద్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బందెల నర్సయ్యలు పిలుపు నిచ్చారు. శుక్రవారం కొత్తగూడెం మంచికంటి భవన్‌లో రేపాకుల శ్రీనివాస్‌ అద్యక్షతన రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల మీద దాడులు, అత్యాచారాలు విపరీతంగా పెరిగాయన్నారు. మనువాదాన్ని పెంచడం కోసం ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి పనిచేస్తున్నాయని, రాజ్యాంగం కల్పించిన దళిత హక్కులు కాలరాస్తున్నారని విమర్శించారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు కాపాడుకోవడం కోసం డిల్లీకి తరలి రావాలని కోరారు. దేశంలో ఉన్న మొత్తం దళితులతో కోటి సంతకాల సేకరణ చేసి భారత రాష్ట్రపతికి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేస్తామని తెలిపారు. కోటి సంతకాల కార్యక్రమంలో విద్యార్థులు, యువజనులు, విద్యావంతులు, మేదావులు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. ఈ రౌండ్‌ టేబుల్‌ పలు తీర్మానాలు చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ చట్టాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయాలి.జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయించి వారి అభ్యున్నతికి ఖర్చు చేయాలి. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలి. దళిత, గిరిజనులపై దాడులు, అత్యాచారాలు అరికట్టాలి. అంటరానితనం, కులవివక్ష నిర్మూలించాలి. కులాంతర వివాహాలు చేసుకున్న వారికి రక్షణ కల్పించాలి. దాడులు, హత్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. విద్య, వైద్యం కార్పోరేట్‌ ఆసుపత్రులలో రిజర్వేషన్‌ కల్పించాలి. భూమి లేని దళితులందరికీ 3ఎకరాల సాగు భూమి, ఇండ్లు ఇవ్వాలి. దళిత బందు దళితులందరికీ ఇవ్వాలి. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలి. ఉన్నత విద్యా సంస్థల్లో కుల వివక్ష నిర్మూలనకు రోహిత్‌ వేముల చట్టాన్ని తీసుకురావాలి. విదేశీ చదువులకు అపరిమిత ఆర్థిక సాయం చేయాలి. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా 14 రకాల సరుకులు పంపిణీ చేయాలని పలు తీర్మాణాలు చేశారు. ఈ కార్యక్రమంలో డీహెచ్‌ పీఎస్‌ జిల్లా కార్యదర్శి సలిగంటి శ్రీనివాస్‌, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు అన్నవరపు కనకయ్య, డీహెచ్‌ పీఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కర్నె రత్న కుమారి, కేవీపీఎస్‌ జిల్లా నాయకులు కొడిశాల రాములు, సీఐటీయూ నాయకులు భూక్యా రమేష్‌, రైతు సంఘం నాయకులు యు, నాగేశ్వరరావు, బి.చిరంజీవి, మామిడాల ధనలక్ష్మి, బరిగెల భూపేష్‌, మద్దెల విజయలక్ష్మి, బత్తుల వెంకటేశ్వర్లు, గడ్డం స్వామి, బాలకృష్ణ, సిద్దెల రాములు, రఘు తదితరులు పాల్గొన్నారు.