బొద్దింకలు ప్రతి ఇంట్లో సర్వసాధారణంగా వస్తూనే ఉంటాయి. వాటిని తరిమేసేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తూనే ఉంటాం. అయినా వాటి బెడద తగ్గదు. పైగా వాటిని తరిమేందుకు ఉపయోగించే రసాయనాల నుంచి జాగ్రత్తగా ఉండకపోతే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే రసాయనాల స్థానంలో ఇంట్లో ఉండే వాటితో సులువుగా వాటిని తరిమేయవచ్చు. అనారోగ్య సమస్యలూ ఉండవు. అవేంటంటే…
పులావులో వేసే బే ఆకులతో తేలిగ్గా బొద్దింకల్ని తరిమికొట్టొచ్చు. కిచెన్‌లోని వేర్వేరు ప్రదేశాల్లో బే ఆకుల్ని చల్లాలి. వాటి వాసన చూస్తే చాలు బొద్దింకలు పారిపోతాయి.
లవంగాలను వంటగదిలోని మూలలు, డ్రాయర్లు, ర్యాకులు, షెల్ఫులలో అక్కడక్కడా ఉంచండి. లవంగాల వాసన బొద్దింకలకు అస్సలు పడదు. వారానికోసారి పాత లవంగాలను తీసేసి… కొత్త లవంగాలను పెడుతూ ఉంటే… ఇక బొద్దింకలు రానే రావు.
బోరిక్ పౌడర్, పంచదారను సమాన మోతాదులో తీసుకొని కలపాలి. ఆ పొడిని వంటగదిలోని మూలల్లో చల్లాలి. అప్పుడు బొద్దింకలు ఆ దరికి రానేరావు. చీకటిగా, ఇరుకుగా ఉండే ప్రదేశాల్లో ఈ పొడి చల్లితే మంచి ప్రయోజనం ఉంటుంది.
వేప ఆకుల వల్ల ఎన్నో ప్రయోజనాలు. బొద్దింకలను తరిమేసేందుకు వేప నూనె, వేప ఆకుల్ని వాడొచ్చు. వేప నూనె, వేప పొడిని కిచెన్‌లో చల్లితే చాలు… ముఖ్యంగా రాత్రివేళ తడిగా ఉండే ప్రదేశాల్లో చల్లితే… బొద్దింకలు పారిపోతాయి. ఇలా కంటిన్యూగా చేస్తూ ఉంటే బొద్దింకల సమస్య పరిష్కారమవుతుంది.