– ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి
– కళారూపాలతో ప్రజా చైతన్యం
నవతెలంగాణ-కొత్తగూడెం
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఆయుధం అని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కళారూపాలతో ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంక అల ఆదేశానుసారం జిల్లా పౌర సంబంధాల సమాచార శాఖ అధికారి శీలం శ్రీనివాస్ పర్యవేక్షణలో ఓటు వినియోగంపై కళాజాత బృందాలు శనివారం కొత్తగూడెం మున్సిపల్ పరిధిలో, చుంచుపల్లి మండలం పరిధిలోని వివిధ వార్డులు, గ్రామాలóలో కళారూపాల ద్వారా ఓటు హక్కు వినియోగం, ఓటు వేసే సమయం గురించి ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొత్తగూడెం తాసిల్దార్ ఎన్నికల అధికారి త్రినాథ్ కార్యక్రమంలో పాల్గొంటూ ఓటు పోలింగ్ సమయం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అని తెలిపారు. ఓటింగ్ తక్కువగా జరుగుతున్న ప్రాంతాలలో కళారూపాల ద్వారా ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఓటు గురించి ప్రజలు ప్రలోభాలకు గురి కాకుండా ఉండాలని, సి-విజిల్ యాప్ ద్వారా, ఎవరైనా రహస్యంగా డబ్బులు పంపిణీ చేస్తుంటే అధికారులకు సమాచారం ఇచ్చి పట్టించవచ్చని తెలిపారు. భారత రాజ్యాంగం కల్పించిన అవకాశం ప్రకారం ప్రతి ఒక్కరు ఓటు వినియోగించుకోవాలని తెలిపారు. ఈ ప్రాంతంలో ఓటింగ్ శాతం తక్కువ ఉన్నదని, కావున తప్పకుండా సాయంత్రం 4 గంటలలోపు ఓటు వినియోగించుకోవాలని కోరారు. మీకు నచ్చని నాయకులు ఎవరైనా ఉంటే ‘నోటా’ మీటా ఓటు వేసే అవకాశం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి లీడర్ పాగి వెంకన్న, సభ్యులు యంగల కుమారి, పమ్మి రవి, గోవింద, గురవయ్య, నకిరేకంటి వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.