ఇప్పపూల పరిమళం

The fragrance of flowersపైరగాలిలా స్వేచ్ఛగా, సెలయేటి నీళ్లలా స్వచ్ఛంగా, వెన్నెలలా చల్లగా గిరిజన ఆదివాసీలు అడవుల్లో బతుకుతున్నారని కవి కుమారులు ఊహిస్తుంటారు. కాని జీవన్‌ శ్రమపడి సంకలనం చేసిన ‘ఇప్పపూలు’ సంకలనంలోని కథలను చదివితే వాళ్లు సంఘర్షణాయుతమైన పరిస్థితుల్లో, ప్రాణాంతకమైన పరిస్థితుల్లో బతుకుతున్నారని తెలుస్తుంది.
మైదాన ప్రాంతం నుండి వెళ్లి అడవిలో స్థిరపడ్డ షావుకారు ఇచ్చిన నాలుగు వందలు కొద్దికాలం తర్వాత ఏడు వేలవుతాయి. అదీ ప్రతి సంవత్సరం వడ్డీ చెల్లిస్తూ వచ్చినా! ఇది 1950కి ముందు తెలంగాణ పల్లెల్లో జమిందారులు, షావుకార్లు బడుగు బలహీన వర్గాల వారికి చిన్నచిన్న అప్పులిచ్చి వాళ్ల పొలాలను కబళించి, ఇళ్లను కబ్జా చేసి, పిల్లలను కట్టుబానిసలను చేసుకున్నప్పటి దారుణాలను గుర్తు చేస్తుంది. సవర తెగకు చెందిన మల్లిపురం జగదీష్‌ రాసిన ‘దారి’ కథలో ఇదొక పార్శ్వం. రెండో పార్శ్వంలో వాళ్ల తెగకే చెందిన తెలివైన యువకుడు చిన్నచిన్న సహాయాలు చేసి విశ్వాసం చూరగొని వాళ్ల భూములను తన పేరిట మార్చేసుకున్నాడు. ఆ భూముల మీద బ్యాంకుల నుండి అప్పులు తీసుకున్నాడు. ఆ అప్పులు సర్కారు మాఫీ చేసింది. అయినా అతడు ఎవరి భూమిని వాళ్లకు బదలాయించడానికి ఇష్టపడక దౌర్జన్యపూరితంగా వ్యవహరిస్తాడు. అప్పుడు అతని సొంత తాత ‘ఇన్నాళ్లూ మాతోటి నడిసినట్టుగా నడిసి నీదారినీవు చూసుకున్నావు. మాకూ ఒక దారుంటాది’ అంటాడు. అది విప్లవమార్గమని ధ్వని. ఈ యువకుడు అంచెలంచెలుగా రాజకీయంగా ఎదిగి దౌర్జన్య స్వభావాన్ని, పెట్టుబడిదారీ దోపిడీ స్వభావాన్ని అలవరచుకున్నాడు. ఈ కథలో రెండు వస్తువులున్నాయి. బయటివాడు ఆదివాసీలను మోసం చేయడం, తమవాడే విశ్వాసం పునాదిగా ఆదివాసీలకు ద్రోహం చేయడం. ఇందుకు విరుగుడుగా వాళ్లు తిరుగుబాటు చేస్తారు. దీంతో కథకు తమతుల్యత, తాత్వికత సిద్ధించాయి.
కోయ వర్గానికి చెందిన పద్దం అనసూయ ‘మూగబోయిన శబ్దం’ ఆదివాసీలకు మతమార్పిడుల మూలంగా ఎదురవుతున్న సవాలుకు సంబంధించిన కథ. చనిపోయిన పెద్ద కొడుకు కర్మకాండకు రమ్మని పిలవడానికి కథానాయిక ఇంటికి వచ్చాడు ఎనభై ఏండ్ల పెదనాయిన. వాళ్ల కోయ సంప్రదాయం ప్రకారం ఇట్లాంటి కార్యక్రమాలకు డోలోళ్లు వచ్చి డోళ్లు మోగిస్తారు. కోయజాతి పుట్టుపూర్వోత్తరాలు తెలిపే ‘పూర్భం’ గానం చేస్తారు. ఈ సంప్రదాయాలు చూసి వున్న రచయిత్రి తన పెదనాయిన ఇంట్లో కూడా వాటికోసం చూస్తుంది. కనిపించవు. ఆయనను అడుగుతుంది, డోలోళ్లు లేరేమని. చిన్నన్నను అడగమంటాడు. చిన్నన్నను అడిగితే, ‘వాళ్లు రారు’ అంటాడు. ‘కర్మకాండ ఎవరు చేస్తారని’ అడిగితే, తాను మతం తీసుకున్నానంటూ మెడలోని శిలువను చూపిస్తాడు. ఇది కథను అనుకోని మలుపు తిప్పే ఘట్టం. ఆ తర్వాత కొనసాగించటానికి కథంటూ మిగలలేదు. కేవలం సుళ్లు తిరిగే మనోవ్యధను కలిగించే ఆలోచనలు తప్ప. తమ తెగ చరిత్రను గానం చేసేవాళ్లే ఇక వుండరన్న భావన నాయికకు విద్యుద్ఘాతమవుతుంది. క్రైస్తవ మతాధికారి చదువబోయే బైబిల్‌ కోయ భాషలో వుండదు. ఆ నిబంధనలు కోయజాతికి నైసర్గికమైనవి కావు. ఇక మీదట వాళ్లు ప్రేమించే ఆదివాసీ సంగీత వాయిద్యాలు నశించిపోవచ్చు. వెరసి తమ సంస్కృతి కూకటివేళ్లతో కూలిపోయే రోజు వచ్చిందన్న భావన ఆమెకు కలుగుతుంది. చనిపోయినవారి ఆత్మశాంతికి ఉద్దేశించిన కర్మకాండ సాంప్రదాయకంగా జరగకపోవడం వల్ల పెద్ద కొడుకు ఆత్మశాంతి ప్రశ్నార్ధకం కావడం పెదనాయినను ఎక్కువగా కలచివేస్తుంది. ఇది విశ్వాసానికి సంబంధించిన కోణం. ఎనభై ఏళ్ల ముది వయసులో పెదనాయినకు ఎదురవుతున్న సమస్యల పరిష్కారం విషయంలో ఏమీ చేయలేని నిస్సహాయత కూడా నాయికలో వ్యక్తమవుతుంది. ఆయనకు పెద్దకొడుకు ఎట్లాగూ లేడు. చిన్నకొడుకు వుండీ లేకుండా పోయాడు. అస్తిత్వ వేదనతోపాటు పెదనాయిన మానసిక వేదనను కూడా తీవ్రస్థాయికి చేర్చి పాఠకులలో సహానుభూతిని కలిగించటంలో రచయిత సఫలమయ్యాడు. ఉత్తమ పురుష కథనంలో స్త్రీ కంఠస్వరంతో సాగిన కథ ఇది.
బంజారా వర్గానికి చెందిన సూర్యాధనంజరు రాసిన ‘అంబాలి’, భూక్యా తిరుపతి రాసిన ‘కాక్లా’ కథలు రెండూ విశ్వాసానికి సంబంధించినవి. అంబాలి తన తెగ వాడినే పెళ్లిచేసుకుంటుంది. పైగా అది ప్రేమవివాహం. భర్త చనిపోయాడు. అత్తామామా, కులపెద్దలు ఆమెను ఆమె మరిదికిచ్చి రెండవ పెళ్లి చేయటానికి ఏకపక్షంగా నిర్ణయిస్తారు. దీన్ని అంబాలి ఎదిరిస్తుంది. అంతేకాదు, ఊరినీ, కుటుంబాన్నీ వదులుకుని తన వర్గానికే చెందిన ఉన్నత విద్యావంతురాలు అరుణతో పాటు నగరానికి వెళ్లిపోతుంది. ఒక మారుమూల తాండాకు చెందిన యువతి నగరవాతావరణంలో ఉన్నత విద్య అందుబాటులోకి వచ్చే వాతావరణం ఏర్పడినట్లయింది. ఈ కథలో తెగపెద్దలు దేవర న్యాయాన్ని అమలు పరచాలని చూస్తారు. నిజానికి ఇది ఆస్తిపాస్తులను కాపాడుకోవటానికి, తమ వంశం, రక్తాన్ని పంచుకుని పుట్టే పిల్లలను పొందటానికి ఉద్దేశించింది. ఈ విశ్వాసాన్ని ఎదిరించడం ఒక విధంగా సంస్కరణవాదమే. దీనికి అదనంగా సూర్యాధనంజరు స్త్రీ స్వేచ్ఛను కూడా జోడించారు. దీంతో స్త్రీ వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేసినట్లయింది.
‘కాక్లా’ కథ మొదలు కావటమే మరణవార్తతో మొదలై ఉత్కంఠభరితంగా సాగుతుంది. చనిపోయింది మేనత్త. రాయలసీమలో ఉద్యోగరీత్యా ఉన్న కథానాయకుడు సుదీర్ఘప్రయాణం తర్వాత మేనత్త ఊరు చేరుకుంటాడు. తనను చూడగానే ఆడామగా దు:ఖిస్తారు. అతను కూడా మేనత్తను తలచుకుని దు:ఖిస్తాడు. ఆశ్చర్యకరంగా చనిపోయిందనుకున్న మేనత్త కూడా ఏడుస్తూ కనిపిస్తుంది. ఇదే కథలో కీలకాంశం. ఆమె గొడ్లను కాయటానికి అడవికి పోతే పై నుండి కాకి వచ్చి తల తన్ని పోయింది. ఇది కీడు కలుగజేస్తుందన్నది తండా పెద్దల విశ్వాసం. ఈ కీడు తొలగిపోవాలంటే ఆమె మరణించిందన్న అబద్దం చెప్పి బంధువులందరిని రప్పించాలి. ఇప్పుడు జరిగిందదే. ఇది విద్యాధికుడైన నాయకుడికి కోపం తెప్పిస్తుంది. చివరకు ఇది కల్లుతాగి, యాట మాంసం ఆరగించడంతో మంచి విందుగా ముగిసింది. ఇది తండా దృష్ట్యా విశ్వాసం, విద్యాధికుల దృష్ట్యా అభాసవిశ్వాసం. అందుకే వ్యంగ్యం కూడా. బతికివుండగానే తనను చంపేశారన్న భావన మేనత్తలోనుంచి తొలగించటానికి ఈ మత్తు ఒక మానసిక చికిత్స. ఆద్యంతాలలో తగు మాత్రం వ్యంగ్యం జోడించి రచయిత కథనం చేశాడు. మేనత్త బతికివున్నా, చనిపోయిందన్న భ్రమను కల్పించుకుని దు:ఖించిన వారిలో ఒక అతిశయ నాటకీయతను సృష్టించటంలో రచయిత సఫలమయ్యాడు.
తిమ్మక రాంప్రసాద్‌ (జాతావుతెగ) రాసిన ‘పిన్లగర్ర’ కథ భావుకమైన ప్రేమకు, విషాదాంతానికి సంబంధించింది. నాయకుడు మంచి పిల్లనగ్రోవి కళాకారుడు. జానకి ఆ సంగీతాన్ని, సంగీతకారుల్ని పిచ్చిగా ప్రేమిస్తుంది. నాలుగురాళ్లు సంపాదించుకుని వచ్చి, పెళ్లిచేసుకుందామని ఊరిని విడిచి సిమెంట్‌ ఫ్యాక్టరీలో కూలీగా పనిచేసి, రొయ్యల చెరువులు, కోళ్లఫారాలలో క్రిమిసంహారక మందులు చల్లే పనులు చేసి, అల్పకాలంలోనే అనారోగ్యం పాలై జీవచ్ఛవంగా మారి ఊరికి తిరిగి వస్తాడు. పిల్లనగ్రోవి బస్సు టైర్లకింద పడి నలిగిపోవటం వాళ్ల ప్రేమ విషాదాంతమైందన్నదానికి ప్రతీక. రచయితకు వాతావరణ చిత్రణలో మంచి నేర్పు వుంది. కవితాత్మకమైన వచనం ద్వారా ప్రణయాన్ని సృష్టించగలిగాడు. కథానాయకుడు ‘గాలికి ధ్వని రంగులద్దగల పిన్లకర్ర పాటగాడ’ట! డప్పుల హోరుకు ‘కొండలు కదిలి ఊగుతున్నాయ’ట! కాని ఫ్యాక్టరీలు, రొయ్యల చెరువులు ఈ కొండను ధ్వంసం చేశాయి. ప్రపంచీకరణ ప్రభావంతో నగరాలు, గ్రామాలను విషపూరితం చేశాయి. ప్రేమలు, స్నేహాలు, బంధుత్వాలు బలైపోవడం కండ్లముందు జరుగుతున్న విపరిణామం. ఈ విశాల దృశ్యంలో ఈ విషాదాంత ప్రణయగాథ ఒక వికృత ఛాయ.
చింతా దీక్షితుల వంటి అగ్రశ్రేణి సాహితీవేత్త రాసిన కథ కూడా ‘ఇప్పపూలు’ సంకలనంలో వుంది. వామపక్ష రచయితలు రాసిన కథలన్నీ ఆలోచింపజేసేవిగా వున్నాయి. గిరిజన ఆదివాసీలకు మైదాన ప్రాంతాల చిన్న పెద్ద పెట్టుబడిదార్లకు మధ్య సాగుతున్న నిరంతర సంఘర్ణణను వర్గపోరాటంగా చిత్రించడంలో వీరు సఫలమయ్యారు. దీంతో మైదాన ప్రాంతపు రచయితలు సంచార జాతి ప్రజల కష్టసుఖాలతో మమేకమై వున్నారన్న అంశం కూడా రుజువైంది. సుమారు వంద సంవత్సరాలుగా అప్పుడప్పుడు పత్రికల్లో అచ్చవుతూ వస్తున్న కథలలో నుండి ఓపికగా నలభై మంచి కథలను ఎంపిక చేసి ప్రచురించిన జీవన్‌గారికి అభినందనలు.
– అమ్మంగి వేణుగోపాల్‌ 9441054637