జన ప్రభంజనం…

– పార్టీ శ్రేణుల్లో జోష్‌ నింపిన కేసీఆర్‌
– సభ సక్సెస్‌తో వనమా గెలుపు ఖాయమంటున్న పార్టీ శ్రేణులు
– కళాకారులతో పురవీధుల్లో నృత్యాలు
నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగూడెంలో జనసంద్రమైంది. ఎక్కడ చూసినా గులాబీ జెండాలే… జై కేసీఆర్‌… జై వనమా నినాదాలతో పట్టణం దద్దరిల్లింది. డప్పు వాయిద్యాలు, కోలాటాలు, బంజారా నృత్యాలు దూం..దాంలతో గూడెం దద్దరిల్లింది. ఊరు వాడ తేడా లేకుండా సభకు కదిలారు ప్రజలు.. వేలాదిగా తరలివచ్చిన బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు ప్రజలతో కొత్తగూడెం కోలాహాలంగా మారింది. పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ అదే తరహాలో ప్రజల్లో జోష్‌ నింపారు. సీఎం కేసీఆర్‌ ప్రసంగంవిన్న ప్రజలు వనమా గెలుపే లక్ష్యంగా ముందుకు కదిలారు. భారీ బహిరంగ సభ సక్సెస్‌ కావడంతో వనమా గెలుపు నల్లేరు పై నడికేనని పార్టీ శ్రేణులు నూతన ఉత్తేజంతో ముందుకు సాగుతున్నారు. మధుప్రియ మిత్ర బృందం నిర్వహించిన ధూంధాం సబికులను ఆకట్టుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రసంగిస్తున్నంతసేపు వనమా అభిమానులు, నాయకులు కార్యకర్తలు జై కేసీఆర్‌ జై వనమా అంటూ నినాదాలు చేశారు. సభకు వచ్చిన ప్రజలు ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా 150 మంది వాలెంటీర్లతో రెండు లక్షల మజ్జిగ ప్యాకెట్లతో పాటు రెండు లక్షల మంచినీటి ప్యాకెట్లను పంపిణీ చేయించారు ఎమ్మెల్యే వనమా. అనుకున్న స్థాయి కంటే వేలాది సంఖ్యలో ప్రజలు సింగరేణి కార్మికులు కార్మిక కుటుంబాలు కార్యకర్తలు మనం అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. సింగరేణి ప్రకాశం మైదానం కిక్కిరిసిన ప్రజానికంతో సీఎం సభ విజయ వంతంగా ముగిసింది.