దీపావళి… అంటే అందమైన రంగవల్లికలు, పూల తోరణాలు, వాటితో పోటీపడే దీపకాంతులు, విరిసే టపాసుల వెలుగులు అందరి కళ్లలో కాంతులు విరిసేలా చేస్తాయి. ఆ ఆనందంలో తియ్యతియ్యని మిఠాయిలూ నోరూరించేస్తుంటాయి. మరి ఈ దీపావళికి కొన్ని మిఠాయిలను వెరైటీగా ట్రై చేద్దామా..!
బొప్పాయి హల్వా
కావాల్సిన పదార్థాలు : దోర బొప్పాయి పండు ముక్కలు – నాలుగు కప్పులు, నెయ్యి – మూడు చెంచాలు, చెక్కెర – రెండు కప్పులు, యాలకులు – మూడు, బాదంపొడి – రెండు చెంచాలు, జీడిపప్పు – పదిహేను
తయారుచేసే విధానం : కడాయిలో నెయ్యి వేసి సిమ్‌లో పెట్టి బొప్పాయి ముక్కలు వేసి, పదిహేను నిమిషాలు వేయించాలి. ముక్కల్లో నుంచి రసం బయటకు వస్తుంది. ఇప్పుడు చెక్కెర కూడా వేసి కలపాలి. ఇరవై నిమిషాల తర్వాత పాకం నుంచి నెయ్యి బయటకు వస్తుంది. ఇప్పుడు బాదంపొడి వేసి ఐదారు నిమిషాలు ఉడికించాలి. తర్వాత జీడిపప్పు కూడా వేసి రెండు నిమిషాలు ఉడికించి దించి వేడిగా లేదా చల్లగా వడ్డించాలి.
దియా ఔర్ బాతి
కావాల్సిన పదార్థాలు : కొబ్బరిపొడి – కప్పు, చెక్కెర – అర కప్పు, కోవా – ఒకటిన్నర కప్పు, కకోవా పొడి – మూడు చెంచాలు, బాదం – ఎనిమిది, లెమన్ కలర్ – మూడు చుక్కలు, రోజ్ వాటర్ – అరటీస్పూను, పాలు – కొద్దిగా
తయారుచేసే విధానం : కడాయిలో కప్పు కోవా వేసి రెండు నిమిషాలు ఉడికించాలి. కొబ్బరిపొడి, చెక్కెర వేసి కలిపి దించాలి. ఇప్పుడు కకోవా పొడి వేసి కలపాలి. మిశ్రమం మరీ పొడిపొడిగా ఉంటే, అది కాస్త ముద్దలా కలిసేవరకూ కాసిని గోరువెచ్చని పాలతో కలపాలి. మిగిలిన కోవాలో లెమన్ కలర్, రోజ్ వాటర్ వేసి కలపాలి. కకోవా కలిపిన కోవా మిశ్రమాన్ని దీపాల్లా చేయాలి. మధ్యలో లెమన్ కలర్ కలిపిన కోవా మిశ్రమాన్ని పెట్టి అందులో ఓ జీడిపప్పు లేదా బాదం ను ఒత్తిలా అమర్చితే సరి.
డ్రైఫ్రూట్ లడ్డు
కావాల్సిన పదార్థాలు : ఖర్జూరాల తురుము – కప్పు, బాదం పలుకులు – రెండు చెంచాలు, ఎండుద్రాక్ష (కిస్‌మిస్‌లు) – రెండు చెంచాలు, జీడిపప్పు – రెండు చెంచాలు, అంజీర్ (ఎండువి) – పది, డెసికేటెడ్ (తురిమి డ్రైగా చేసినది) కొబ్బరి – రెండు చెంచాలు, యాలకులు: రెండు
తయారుచేసే విధానం : బాదం వేయించి పెట్టుకోవాలి. అంజీర్ సన్నగా తరగాలి. మిక్సీ జార్‌లో యాలకులు వేసి పొడి చేయాలి. తర్వాత ఖర్జూరం, అంజీర్, జీడిపప్పు, బాదం, ఎండుకొబ్బరి అన్నీ వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని గిన్నెలో వేసి కావాల్సిన సైజులో ఉండలుగా చేసుకోవాలి. అంతే డ్రై ఫ్రూట్ లడ్డూలు రెడీ.
ఫైవ్ స్టార్ బర్ఫీ
కావాల్సిన పదార్థాలు : మైదా – రెండు కప్పులు, పాలు – రెండు కప్పులు, శెనగపిండి – రెండు కప్పులు, చెక్కెర – రెండు కప్పులు, కొబ్బరి తురుము – రెండు కప్పులు, నెయ్యి – కప్పు
తయారుచేసే విధానం : పాన్‌లో నెయ్యి వేసి, శెనగపిండి, మైదా వేసి సన్న మంట మీద వేయిం చాలి. మాడకుండా కలుపుకుంటూ మంచి వాసన వచ్చే వరకు వేయించాలి. ఇందులో ఉండలు కట్టకుండా పాలు పోసి కలపాలి. చెక్కెర, కొబ్బరి తురుము కూడా వేసి మధ్యస్తంగా ఉండే మంట మీద సుమారు అరగంటసేపు కలుపుతూ ఉడికించాలి. మిశ్రమం దగ్గరగా ఉడికి, అంచులనుంచి వేరవుతుండగా నెయ్యి రాసిన ప్లేటులో వేసి సమంగా సర్ది, ఆరాక ముక్కలుగా కోసి, డ్రైఫ్రూట్ ముక్కలు చల్లితే సరి.
నిప్పట్లు
కావాల్సిన పదార్థాలు : బియ్యప్పిండి – అరకప్పు, మైదా – కప్పు, వేయించిన శెనగపప్పు – కప్పు, పల్లీలు – పావు కప్పు, నువ్వులు – రెండు చెంచాలు, కారం – చెంచా, ఉప్పు – తగినంత, నూనె – వేయించడానికి సరిపడా
తయారుచేసే విధానం : పల్లీలు పచ్చివాసన పోయే వరకు సన్న మంట మీద వేయించాలి. తర్వాత శెనగపప్పును కూడా వేయించుకోవాలి. రెండింటినీ కచ్చాపచ్చాగా పొడి చేయాలి. బియ్యప్పిండి, మైదా, నువ్వులు, పల్లీలు, వేయించిన శెనగపప్పు, పల్లీల మిశ్రమం, ఉప్పు, కారం అన్నీ కలపాలి. తర్వాత రెండు చెంచాల కాగిన నూనె వేసి కలపాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా నీళ్లు పోసి కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. వీటిని ప్లాస్టిక్ కాగితం మీద చెక్కల మాదిరిగా కొంచెం మందంగా వత్తి, మీడియం మంట మీద కాగిన నూనెలో వేయించి తీయాలి.