హీరో ధనుష్ ముఖ్యపాత్రధారిగా మ్యాస్ట్రో ఇళయ రాజా బయోపిక్‌కి శ్రీకారం చుట్టారు. భారతీయ సినీ పరిశ్రమలో సంగీత జ్ఞానిగా తనదైన ముద్ర వేసిన ఇళయరాజాపై సినిమా రావడం అనేది సంగీతాభి మానులతో పాటు ఇళయరాజా అభిమానులను, సినీ ప్రేక్షకులను ఆనందోత్సాహాల్లో ముంచెత్తింది.
ఈ చిత్రాన్ని కనెక్ట్ మీడియా, మెర్క్యూరీ గ్రూప్ సంస్థలు కలిసి రూపొందించనున్నాయి. ఈ నిర్మాణ సంస్థల కలయికలో తొలి చిత్రంగా రూపొందనున్న ఈ బయోపిక్ షూటింగ్ అక్టోబర్ 2024లో ప్రారంభమై 2025 మధ్యలో విడుదల కానుంది. రాబోయే మూడు సంవత్సరాలలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా అనేక మెగా-బడ్జెట్ చిత్రాలను కనెక్ట్ మీడియా, మెర్క్యూరీ గ్రూప్ కలిసి సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. ఈ నేపథ్యంలో కనెక్ట్ మీడియా నుంచి వరుణ్ మాథుర్ మాట్లాడుతూ, ‘మెర్క్యురి అనేది ప్రపంచ వినోద ప్రదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన పేర్లలో ఒకటి. మెగా-బడ్జెట్ చిత్రాలను నిర్మించడానికి వారితో చేతులు కలపడం పట్ల మేము సంతోషిస్తున్నాం. ఒక జాతీయ స్టూడియోగా మెర్క్యురీతో మా భాగస్వామ్యం గొప్పగా ఉంటుంది’ అని తెలిపారు.
మెర్క్యూరీ గ్రూప్ సీఈవో, ఎండీ శ్రీరామ్ భక్తిశరణ్ మాట్లాడుతూ, ‘లోకల్, ప్రాంతీయ కథలను అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కిస్తాం. కనెక్ట్ మీడియాతో చేస్తున్న ఈ వెంచర్ మీద మాకు ఎంతో నమ్మకం ఉంది’ అని చెప్పారు.