విలక్షణ నటుడు

విలక్షణ నటుడు సినీ పరిశ్రమలో లక్కీ హీరోగా పేరున్న ప్రముఖ నటుడు చంద్రమోహన్‌ ఇకలేరు. తనదైన నటనతో దాదాపు ఐదు దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించిన చంద్రమోహన్‌ నవంబర్‌ 11 వ తేది శనివారం ఉదయం కన్నుమూశారు. చంద్రమోహన్‌ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర రావు. తెలుగు సినిమా రంగంలో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించిన ఆయన సరసన నటించిన ఎందరో నటీమణులు తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర తారలుగా వెలుగొందారు. 1966లో రంగులరాట్నం సినిమాతో సినీ ప్రస్థానం ఆరంభించిన చంద్రమోహన్‌ దాదాపు 175 సినిమాల్లో హీరోగా నటించిన ఆయన.. సినీకెరీర్‌లో మొత్తం 932 సినిమాల్లో నటించారు. ఆయన సహనాయకుడిగా, కథనాయకుడుగా,హాస్యనటునిగా, క్యారెక్టర్‌ యాక్టర్‌గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. ప్రధానంగా కామెడీ పాత్రల ద్వారా మెప్పించిన చంద్రమోహన్‌ ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండిపోతారు.
చంద్రమోహన్‌ కష్ణాజిల్లా పమిడి ముక్కలలో 1945 మే 23న జన్మించాడు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో బి.యస్‌.సి. పూర్తిచేసి, కొంతకాలం ఏలూరులో పనిచేశాడు. ఈయన దివంగత దర్శకుడు కె.విశ్వనాథ్‌కి దగ్గరి బంధువు. చంద్ర మోహన్‌ భార్య పేరు జలంధర. ఈమె రచయిత్రి. వీరికి మధుర మీనాక్షి, మాధవి అని ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మధుర మీనాక్షి సైకాలజిస్ట్‌గా అమెరికాలో స్థిరడ్డారు. రెండో కుమార్తె మాధవి చెన్నైలో వైద్యవత్తిలో సేవలందిస్తున్నారు
సినిరంగ ప్రవేశం
చంద్రమోహన్‌ సినిమాలలో నటించాలనే ఉత్సాహంతో మద్రాసు చేరి ప్రయత్నాలు ఫలించి 1966లో ‘రంగుల రాట్నం’ సినిమాతో సినీపరిశ్రమకి పరిచయం అయ్యారు. 1987లో చందమామ రావే చిత్రానికి ఉత్తమ హాస్యనటుడిగా, 2005లో అతనొక్కడే సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. పదహారేళ్ల వయసు సినిమాకుగానూ ఫిలిం ఫేర్‌ అవార్డు గెలుచుకున్నారు. రంగుల రాట్నం, పదహారేళ్ల వయసు, సీతామహాలక్ష్మి, రాధాకల్యాణం, రెండు రెళ్ల ఆరు, చందమామ రావే, రామ్‌ రాబర్ట్‌ రహీమ్‌ చిత్రాలతో ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యారు. 55 ఏళ్ల సినీ కెరీర్‌లో దాదాపు 932 సినిమాలలో నటించారు.
ఆ సినిమాలు కెరీర్‌లోనే స్పెషల్‌
సినిమాల్లోకి రాకపోయి ఉంటే డబ్బులు లెక్కపెట్టే ఉద్యోగం చేసుకుని ఉండేవాడినన్న చంద్రమోహన్‌ ఫస్ట్‌ సినిమా సక్సెస్‌ అయిన తర్వాత కూడా ప్రభుత్వోద్యోగానికి వెళ్లాలా? వద్దా? అని ఒకటికి రెండుసార్లు ఆలోచించారు. అంతిమంగా సినిమావైపే అడుగులు వేశారు. తన కెరీర్‌లో సిరిసిరిమువ్వ, శుభోదయం, సీతామహాలక్ష్మి, పదహారేళ్ల వయసు చిత్రాలను ఎన్నటికీ మర్చిపోలేనని చెప్తూ ఉండేవారు. చంద్రమోహన్‌ నటించిన సుఖదుఃఖాలు, ‘ఇంటింటి రామాయణం’, ‘ప్రాణం ఖరీదు’, ‘పక్కింటి అమ్మాయి’, ‘గోపాలరావుగారి అమ్మాయి’, ‘అమ్మాయిమనసు’, ‘శ్రీమతి ఒక బహుమతి, ‘స్వర్గం’, ‘కలికాలం’, ఒకటేమిటి ఎన్నో సినిమాలు అద్భుతమై చిత్రాలుగా నిలిచాయి. చంద్రమోహన్‌ హీరోగా రంగులరాట్నం చిత్రంతో మొదలుపెట్టి, హాస్యనటుడిగా మారి తర్వాత కాలంలో కారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా చిత్రసీమలో స్థిరపడ్డారు.
గొప్ప నటుడు
చంద్రమోహన్‌ ఎటువంటి పాత్ర అయినా చాలా సునాయాసంగా చెయ్యడమే కాకుండా, ఆ పాత్రకి గొప్ప ఔన్నిత్యాని తెచ్చేవాడు. అతను ఒక అద్భుత నటుడు. సెట్స్‌ లో ఎంతో సరదాగా ఉండేవాడు. ఎప్పుడూ తన పని తాను చేసుకు పోయేవాడ. వేరే వాళ్ళ జీవితంలోకి ఎప్పుడూ కలుగచేసుకోలేదు. వేరేవాళ్లకి సలహాలు ఇవ్వడం కానీ, తీసుకోవటం కానీ ఎప్పుడూ చేసేవాడు కాదు. ఎందుకంటే అతను ఎప్పుడూ తన పని మీదే దష్టి పెట్టేవాడు. వేరే వాళ్ళ విషయాలు పట్టించుకునేవాడు కాదు. అతను మంచి భోజన ప్రియుడు. సెట్‌ లో చంద్రమోహన్‌ కి ఏది ఇష్టమో అడిగి, అతను ఏది కావాలంటే అది చెయ్యమని నిర్మాతలు చెప్పేవాళ్ళు. అలాగే తన సహ నటీమణులను మీరు వంట బాగా చేస్తారు కదా, ఇంటిదగ్గర చేసినవి తీసుకు రండి అని చెపుతూ ఉండేవారు.
లక్కీ హీరోగా క్రెడిట్‌
ఒకప్పుడు హీరోయిన్లకు ఈయన లక్కీ హీరో. చంద్రమోహన్‌తో నటిస్తే సినిమా హిట్‌ అవ్వాల్సిందే. అలా కెరీర్‌ ప్రారంభంలో శ్రీదేవి, జయసుధ, జయప్రద.. ఈయనతో కలిసి నటించి హిట్స్‌ అందుకున్నారు. చంద్రమోహన్‌- సుధ కాంబినేషన్‌ అయితే సూపర్‌హిట్‌ అయింది. ఈయన క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చాలా చిత్రాలు చేశారు. తెలుగులోనే కాకుండా తమిళంలోనూ నటించారు. ఈయన నటించిన చివరి చిత్రం ‘ఆక్సిజన్‌’.
కొత్త హీరోయిన్‌ లకు లక్కీ హీరో
కొత్త హీరోయన్‌లకు లక్కీ హీరో చంద్రమోహన్‌ అని చెబుతారు. చంద్రమోహన్‌ పక్కన మొదటి సినిమాలో నటిస్తే ఆ హీరోయిన్‌ దశ తిరిగిపోతుందని చెబుతారు. సిరిసిరిమువ్వలో జయప్రద, పదహారేళ్ళ వయసులో శ్రీదేవి తమ నటజీవితం ప్రారంభంలో చంద్రమోహన్‌తో నటించి తరువాత తారాపథంలో ఉన్నత స్థాయికి చేరుకున్నారు చంద్రమోహన్‌. 1983లో వచ్చిన పెళ్లి చూపులు సినిమాలో చంద్రమోహన్‌ -విజయశాంతి కలిసి నటించారు. ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసింది. ఆ తరువాత వీరి కాంబోలో వచ్చిన ప్రతిఘటన కూడా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ సాధించింది. ఇక చంద్ర మోహన్‌తో నటించిన తర్వాతే విజయశాంతి శోభన్‌బాబు, నాగేశ్వరరావు, చిరంజీవి లాంటి స్టార్‌ హీరోలతో నటించింది. రోజారమణి, ప్రభ, రాధిక, ఒకరేంటి చాలామంది ముందుగా చంద్రమోహన్‌ తో నటించి తరువాత చాలా పెద్ద స్థాయికి ఎదిగారు. అందులో సీనియర్‌ నటి జయసుధ చంద్రమోహన్‌ తో చాలా సినిమాల్లో నటించింది. జయసుధ అతన్ని తమ కుటుంబలో ఒకరుగా భావించేవారు. చంద్రమోహన్‌ తన ఫేవరెట్‌ నటుడు అని కూడా చెప్పేది, అలాగే జయసుధ నిర్మాతగా ఏడు సినిమాలు చేస్తే, అందులో ఐదు సినిమాల్లో చంద్రమోహన్‌ నటించారు.
చంద్రమోహన్‌ పెదనాన్న కుమారుడే విశ్వనాథ్‌!
చంద్రమోహన్‌ కు కె విశ్వనాథ్‌కి ఫ్యామిలీ రిలేషన్స్‌ ఉన్నాయి. చంద్రమోహన్‌ పెదనాన్న రెండో భార్య కొడుకు కె.విశ్వనాథ్‌ కాగా.. చంద్రమోహన్‌ తల్లి, కె.విశ్వనాథ్‌ తండ్రి మొదటి భార్య అక్కా చెల్లెల్లు కావడంతో వీరద్దరు అన్నదమ్ములు అవుతారు. శంకరాభరణం చిత్రానికి విశ్వనాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కించగా.. చంద్రమోహన్‌ అందులో కీలపాత్ర పోషించారు. ఈ చిత్రం తెలుగు సినీ చరిత్రలోనే సూపర్‌ హిట్‌గా నిలిచి.. జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. వీరిద్దరి కాంబినేషన్‌లో సిరిసిరిమువ్వ, సీతామహాలక్ష్మి, శంకరాభరణం, సీతకథ చిత్రాలు వచ్చాయి. నాలో ఉన్న ప్రతిభను బయటికి తీసి అద్భుతమైన నటుడిగా తీర్చిదిద్దింది ఆయనేనని చంద్రమోహన్‌ గతంలో వెల్లడించారు. గతంలో కె. విశ్వనాథ్‌ గురించి చంద్రమోహన్‌ మాట్లాడుతూ..’సినిమా బంధం కంటే మా ఇద్దరి మధ్య కుటుంబ బాంధవ్యమే ఎక్కువ. అందరికంటే నేను ఆయనకు చాలా దగ్గరివాడిని. మద్రాసులో ఉన్నప్పుడు ఒకేచోట స్థలం కొనుకున్నాం. పక్క పక్కనే ఇళ్లు కూడా కట్టుకుని 25 ఏళ్ల ఉన్నాం. అంతటి అనుబంధం మాది’ అని చెప్పారు.
ఎస్పీ బాలుతోనూ బంధుత్వం
సంగీత దిగ్గజం ఎస్పీ బాలసుబ్రమణ్యంతోనూ వీరిద్దరి బంధుత్వం ఉంది. చంద్రమోహన్‌ బావమరిది చెల్లిని ఎస్పీ బాలసుబ్రమణ్యం అన్నయ్య పెళ్లి చేసుకున్నారు. అలా వీరి మధ్య కూడా అన్నదమ్ముల అనుబంధం ఏర్పడింది. ఇలా అనుకోకుండా ముగ్గురికి కుటుంబాల పరంగా మంచి అనుబంధం ఉంది. వరుసకు ముగ్గురు అన్నదమ్ములు కావడం మరో విశేషం. వీరి ముగ్గురి కాంబినేషన్‌లో వచ్చిన శంకరాభరణం సినిమా ఇండిస్టీలోనే చిరస్థాయిగా నిలిచిపోయింది

– పొన్నం రవిచంద్ర, 9440077499