బాలోత్సవం… భలే ఉత్తేజం

Balotsavam... very excitingపిల్లలు స్వయం ప్రకాశితులు నేలకు అందాల్ని మోసుకొచ్చేలా..ఆడుతారు గాలికి సుగంధాన్ని అద్దేలా.. పాడుతారుb కలగన్న ప్రపంచాన్ని, చూసిన దృశ్యాన్ని రంగురంగుల బొమ్మలుగా ఆవిష్కరిస్తారు. చూసిన జీవితాలను కథలుగా అల్లుతారు. చిక్కని కవితలుగా మలుస్తారు వారు చేయలేనిదంటూ ఉండనే ఉండదు. అవకాశం ఇచ్చి చూడండి ఆకాశం అంచులు తాకుతారు.
వారిని వారుగా ఎదగనివ్వండి.. అంతే
పిల్లల గురించి ఆలోచించడం అంటేనే.. దేశ భవిష్యత్తు గురించి ఆలోచించడం.
మార్పు ఎదైనా.. మొదట పిల్లలనుండే రావాలి.
ఈ ఆలోచన నుండి అంకురించి, కాలం ఒక ఆశాదీపంగా.. మోసుకొచ్చిందే.. ‘తెలంగాణ బాలోత్సవం’. 3వ పిల్లల జాతర 2023 త్వరలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనుంది. ఈ వేడుకకు బాలబాలికలందరినీ హైదరాబాద్‌, బాగ్‌లింగంపల్లికి ఆహ్వానిస్తోంది 3 వ తెలంగాణ బాలోత్సవం’. పిల్లలందరినీ అనందంలో ముంచెత్తేలా.. అద్భుత పిల్లల కార్యక్రమాలు అలరిస్తాయి.
ఉపాధ్యాయులే ఊపిరిగా.. విద్యార్థులే భావిభారత వారసులుగా భావించి, విద్యార్థుల విజ్ఞానం, వినోదం, వికాసం కోసం పరిశ్రమిస్తున్నది తెలంగాణ బాలోత్సవం.
నవంబర్‌ వచ్చిందంటే చాలు.. పిల్లల సందడి మొదలైనట్లే.. పిల్లలజాతరలో పోటాపోటీగా అంతులేని సంతోషం సొంతం చేసుకుంటారు చిన్నారులు.
ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఆలోచనలు పదునెక్కించి, తీరొక్క ఆట పాటలు, స్వేచ్ఛా స్వరాలు సాంస్కృతికోత్సవాలతో బాలోత్సాహం.. భలే ఉత్తేజాన్ని కలిగిస్తుంది.
పిల్లలను బోన్సారు మొక్కలుగా పెంచకండి, జ్ఞానంలో మరుగుజ్జులుగా ఉంచకండి. వారికి 4(వి) వినోదం, విజ్ఞానం, విహారం, విశ్రాంతి అవసరం. అందుకే తెలంగాణ బాలోత్సవం వ్యయ ప్రయాసలకోర్చి ఎన్నో కార్యక్రమాల ద్వారా చిన్నారుల్లో సరికొత్త సంతోషాన్ని నింపుతుంది. ఆట పాటలకు దూరంగా ఉంచడం అంటే ఆరోగ్యానికి దూరంగా ఉంచడమే. పిల్లల జీవితంపై పెద్దల ఇగో ప్రభావం డామినేట్‌ చేస్తుంది. ఆనందానికి ప్రాధాన్యమిచ్చేలా పిల్లలు గువ్వలై రెక్కలు కట్టుకొని ఎగురుతారిక్కడ. ఆ మూడు రోజులు పిల్లల ముఖాలు చూడాలి… ఏదో ఒక బహుమతి సాధించాలన్నంత పట్టుదల, ప్రతిభను ప్రదర్శించాలన్న దృఢ సంకల్పం కనిపిస్తుంది.
”ప్రతి మనిషిది ఖాళీ బుర్రే. అందులో ఏది నింపితే అదే నిండుతుంది” అంటారు అరిస్టాటిల్‌.
ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఏది చెబితే అది మనసుకు ఎక్కించుకునే స్వచ్ఛమైన తెల్ల కాగితాలాంటి మనసులు వాళ్ళవి. అలాంటి చిన్నారులకు విజ్ఞానం, వినోదం, వికాసం, ప్రశ్నించే తత్వం, సోదరత్వం, మానవత్వం మంచి విషయాలు నేర్పి, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దటం వల్లనే ఇంత ఆదరణ పొందింది తెలంగాణ బాలోత్సవ్‌. అనేక మంది కొత్త స్నేహితులను సంపాదించుకుంది. బిడ్డలలో సరికొత్త విజ్ఞానాన్ని, భవిష్యత్తు పై కొత్త ఆశలు మోసులేత్తిస్తుంది.
బాలోత్సవంలో… కథ చెప్తా నువ్వు కొడతావా అంటూ.. బోలెడు కథలు చెప్తారు. పేపర్‌ పెన్ను ఇస్తే చాలు.. అద్భుత విన్యాసాలు చేస్తారు. తెలుగు పద్యాలు వల్లె వేస్తారు. తెలుగు భాషా మాధుర్యం, భాష ప్రాధాన్యతను నొక్కి చెప్తారు. మతసామరస్య సహజీవన సంస్కృతిని వివరిస్తారు. స్పోకెన్‌ ఇంగ్లీష్‌ నేర్చుకుంటారు. శాస్త్ర విజ్ఞాన విషయాలు సైన్స్‌ ప్రయోగాలు చేసి చూపిస్తారు. మూఢనమ్మకాల గుట్టును బట్టబయలు చేస్తారు. రంగురంగు కాగితాలతో ఎగిరే పక్షుల్ని ఏనుగు బొమ్మల్ని తయారు చేసి, పేపర్‌ బొకేలు ఇచ్చి వావ్‌ అనిపిస్తారు. పిల్లలే రాసి, దర్శకత్వం వహించిన లఘనాటికలను ప్రదర్శించి, వీక్షకులచేత అద్భుత: అన్పిస్తారు. కళలను కాపాడుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెపుతారు. రేపటి పౌరులను సంస్కారవంతులుగా తీర్చిదిద్దే తోవలో నడుస్తామని నాటికలు వేసి ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంటారు.
మహనీయుల చిత్రపటాలు, బాల సాహస వీరులు గాధలు చెప్పి ఉత్తేజాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. ర్యాంకులు పరుగులు మాత్రమే కాదు విలువలు నేర్పుతారు. కూసింత శాస్త్రీయ ఆలోచనను రేకెత్తించే ఉత్సాహాన్ని నింపి మానసిక ఉల్లాసాన్నిచ్చి, శారీరక వ్యాయామాన్ని కల్పించే ఆటపాటలను పరిచయం చేస్తారు.
ఈ స్పందన కేవలం పిల్లలనుంచే మాత్రమే కాదు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల నుంచి కూడా చక్కటి ఆదరణ లభిస్తుంది. వాళ్లు ఆడుతూ పాడుతుంటే తమ బాల్యాన్ని గుర్తు చేసుకుంటున్నారు పెద్దలు. పిల్లలను చూసి భళా అంటూ భరోసా ఇస్తున్నారు పెద్దలు.
నిత్యం కలం చేతబట్టే ఆ చేతులు కాళ్లకు గజ్జలు కడుతున్నాయి. పాఠాలు చదివే పిల్లల నోటి వెంట పంచ్‌ డైలాగులు వస్తాయి. మహనీయుల వేషాధారణలతో మైమరిపిస్తారు. తరగతి గదిలో ఉండే ఆ చిట్టి బుర్రలు కళావేదికపై తమ ప్రతిభలకు పదును పెడుతారు. ఇప్పటికే వందలాది పాఠశాలలో ఆట పాటల ప్రాక్టీస్‌, రిహార్సల్స్‌లో బిజీగా ఉన్నారు. చూపరులను ఆకట్టుకుని, ఆలోచింపజేసేలా పోటీ పడుతున్నారు.
శాస్త్రీయ నృత్యాలు, విచిత్ర వేషాధారణలు, ఏకపాత్రాభినయాలు ఒకటేమిటి… ప్రతిభకు హద్దేముంది అన్నట్టు చిన్నారులు తమ ప్రత్యేకతను చాటుకుంటారు. వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు చూడడానికి ప్రేక్షకులు కిక్కిరిసిపోతారు. నిజంగా వైజ్ఞానిక ప్రదర్శనలు; ప్రభోదకరమైన, ఆదర్శ యుతమైన జీవిత చరిత్రలు, దేశ చరిత్రలు విజ్ఞానదాయక విషయాలతో పాటు ఆసక్తికరమైన విషయాలుంటాయి ఈ వేదికలో. ఆ చిన్నారి హృదయాలలో వైజ్ఞానిక ముద్రలు శిలాక్షరాలవుతాయి. చక్కటి నీతిని సమధర్మాన్ని బోధిస్తాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మన పంచతంత్ర కథలు ప్రాపంచిక విజ్ఞానాన్ని, లౌకిక నీతిని తెలుపుతూ తెలివిగా బతకడానికి బాటలు చూపిస్తాయి, బిడ్డల నడవడిని తీర్చిదిద్దడానికి కథలు చెబుతుంటే అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్టుగా ఆసక్తికరంగా ఉంటాయి.
పిల్లలకు మాటలు రావాలే గాని వారి నోరు ఊరుకోదు, పాడేస్తారు బుచ్చి బుచ్చి అచ్చి రాని మాటలతో. సులభగణితం, పేపర్‌ క్రాఫ్టింగ్‌, తెలుగు భాషా ప్రాధాన్యత, సైన్స్‌తో సరదాలు… ఇలా ఎన్నో ఎన్నెన్నో సృజన దీపాలు వెలిగిస్తారు. ఈ వేడుకకు వేదికైన తెలంగాణ బాలోత్సవం బృందం వీరిని నిరంతరం ప్రోత్సాహిస్తోంది. జుంబారే అంటూ జానపద నృత్యాలు, వందలాది బతుకమ్మలు, కోలాటం, దాండియా బృందాలు తరలివస్తున్నాయి.
ఈ యేడాది జరుగనున్న 3 వ పిల్లల జాతర
మన శాస్త్రవేత్తల సత్తా చాటిన, సత్యమేవ సైన్స్‌ అంటూ ఇస్రో చంద్రయాన్‌ ప్రాంగణంలో మూడు శాంతి పావురాలు ఎగరేస్తారు. పిల్లలంతా బెలూన్లు ఆకాశ దీపాలు వదులుతారు. విజ్ఞానజ్యోతులు వెలిగించుకుని కవాతులతో, బ్యాండ్‌ బాజాతో విద్యార్థులు తెరలు తెరలుగా తరలి వస్తారు.
ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ రాసిన ప్రార్థనాగీతంతో ప్రారంభం కానుంది. జాతీయ పతాకాన్ని, బాలోత్సవ జెండాను పిల్లలే ఎగరేస్తారు.
బాలోత్సవ బాలలం – భావిభారత నిర్మాతలం, కుల వద్దు మతం వదు , సమత మా సరిహద్దు అంటూ.. ప్రణామం, ప్రమాణం చేస్తారు. 300 పాఠశాలల నుండి సుమారు 10 వేల మంది విద్యార్థులు పాల్గొననున్నారు.
ఇంత మంది పాల్గొన్నడానికి ప్రదాన కారణం:
శాస్త్ర విజ్ఞానంపై సైన్స్‌ వండర్‌ షోలు, ఉపాధ్యాయ దినోత్సవం వేళ ఆట పాటల మేళాలు, పిల్లలకు వేసవి సెలవుల్లో 16 రోజుల సమ్మర్‌ క్యాంపులు, స్క్రీన్‌ సైన్స్‌ డాక్యుమెంటరీలు, పిల్లల లఘు చిత్రాలు, శాస్త్రీయ దృక్పథం సరైన మార్గదర్శకాలతో పిల్లల కోసం నిరంతరం పనిచేస్తున్న ఎకైక సంస్థ, పిల్లల స్నేహహస్తం తెలంగాణ బాలోత్సవం.
మనకు ఎంతో ఇస్తున్న సమాజానికి కొంతైనా తిరిగి ఇవ్వాలన్నా సామాజిక చైతన్యం పెంచుతుంది. కులమత తారతమ్యాలు పోయి మనుషులంతా ఒక్కటనే భావనలు తెస్తుంది. విద్యార్థుల్లో.. మార్కులు, ర్యాంకులు, ఉరుకులు పరుగుల జీవితంలో బలహీన పడుతున్న మానవ సంబందాలు, పొరుగు వారికి తోడ్పడాలన్న కనీస భావన కొరవడుతుంది.
విద్య విజయాల కోసం కాదు, విలువల కోసం. కథలు. కబుర్లు, మహనీయుల ధైర్యం, శౌర్యం, సేవా గుణం వంటి విషయాలు వినే అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఇష్టపడి చదివే వాతావరణం లేదు. పిల్లల ఆసక్తులు అభిరుచులు సృజనను, జ్ఞాన తృష్ణను ప్రోత్సహించే వేదికలు, వేడుకలు ఇప్పుడు కావాలి. అదే తెలంగాణ బాలోత్సవం చేస్తుంది. ఏడంతస్తుల మేడల్లో చదువు, ఆట స్థలాలు లేని పాఠశాలలు, అక్వేరియం చేపల్లా.. పిల్లల్ని పెంచుతున్నారు.
విద్యావనాలు విజ్ఞాన నిలయాలుగా పరిఢవిల్లాలి. విద్యను ఒక శాస్త్రంగా అభివృద్ధి చేయాలని, పిల్లలను మానవతామూర్తులుగా అన్ని రంగాల్లో మేధావులుగా, సృజనశీలురుగా పాఠశాల సర్వతోముఖ విజ్ఞాన వికాస కేంద్రాలుగా తీర్చిదిద్దాలి.
కానీ.. కేంద్రం ఏలుబడిలో ఉన్న ఉత్తర ప్రదేశ్‌లో తరచూ విద్యావనాలు విషవలయాలుగా వార్తలకెక్కుతున్నాయి పిల్లల మధ్య సమానత్వం, సౌబ్రాతృత్వం వెల్లివిరిసేలా పాటలు, పాఠాలు వల్లే వేయించాల్సిన ఉపాధ్యాయుల్లో కొందరు వక్ర రీతిన వివక్ష బీజాలు నాటుతున్నారు.
చెట్టాపట్టాలేసుకుని సమైక్య గీతాలు పాడుకోవలసిన పిల్లల మధ్య కులమత ఉన్మాదాలను చూపిస్తున్నారు. యూపీలోని ముజఫర్‌ నగర్‌లో ఖుబ్బాపూర్‌ నేహా పబ్లిక్‌ పాఠశాలల్లో తాజాగా ఇలాంటి లజ్జాకరమైన సంఘటన చోటు చేసుకోవడం దేశాన్ని నివ్వెరపరిచింది. ఎక్కాలు సరిగ్గా అప్పగించలేదని రెండో తరగతిలో ఒక ముస్లిం బాలుడిని తోటి హిందూ బాలురతో రెచ్చగొట్టి మరీ కొట్టించిన ఉపాధ్యాయుని మతతత్వ చేష్టలు క్షమించరానివి. ఆ సమయంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం. ముస్లిం పిల్లలు బాగా చదవరని, వారి తల్లులు అసలే పట్టించుకోరని ఇష్టారీతిన ఆమె వ్యాఖ్యానించడం పిల్లల హృదయాల్లో మత వివక్షను నాటడమే అవుతుంది. ఇది ఒక్క పాఠశాలకో.. ఒక్క ఉపాధ్యాయునికో.. పరిమితమైన సంఘటనగా చూడలేం. యూపీ విద్యాసంస్థలు అనేక సందర్భాల్లో అనేక రూపాల్లో ఇలాంటి వివక్షపూరిత ఆచరణలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి.
చాలా పాఠశాలల్లో చత్రపతి శివాజీ ఏకపాత్రాభినయం, నాటికల పేరిట ముస్లిం వ్యతిరేక భావాలు బలంగా ప్రచారం చేస్తున్నారు. పాఠ్యపుస్తకాల్లో ముస్లిం పాలకులు, స్వాతంత్ర సమరయోధుల పాఠాలు తొలగించబడ్డాయి. పసి హృదయాల్లో, పౌరులుగా వికసించే విద్యావనాల్లోకి ప్రవేశించి విద్వేషం చిమ్ముతున్నారు, విష బీజాలు నాటుతున్నారు.
బాల్యానికి భరోసాగా నిలబడే భుజం ఒక్కటి కావాలి. సోదరత్వం మానవత్వం మనిషి తనమే మాయమవుతున్నప్పుడు మనిషిగా హత్తుకుని, ఓదార్పునిచ్చే హృదయాలు కావాలి. అది మొబైల్‌ టచ్‌లో కాదు.
మనుషులందరికి వినిపించే మాటలు, కనిపించే పరుగులు, సత్యమేవ సైన్స్‌ అంటూ.. నిగ్గుదేలిన భారత శాస్త్రవేత్తల సత్తా చాటిన ఇస్రో చంద్రయాన్‌ కాలంలోలో మనం ఉన్నాం. బాలలు కూడా భవిష్యత్తు పై భరోసా పెట్టి ముందుకు సాగుతున్నారు. ”భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు” అనే ప్రతిజ్ఞ కు ప్రాణం పోయాలి. భారతీయ లౌకికతత్వం వెల్లివిరియాలి అని పిల్లలు ‘మనచరిత్ర’ నాటిక ద్వారా తెలియజేశారు.
అక్షరాల అమ్మ! చదువుల తల్లి సావిత్రి భాయి ఫూలే స్కిట్‌ వేసి అనాటి పీష్వాలు, మనువాదుల దుర్మార్గాలను ఎండగట్టారు. మంచి విషయాలు బోదిస్తే.. మంచి సుగుణాలు నేర్చుకుంటారు.
బాల్యం అమూల్యమైన వరం. అభం శుభం తెలియని పసి మనసుల పూతోటలో పరిమళించిన పువ్వులు అందుకే.. నెహ్రూ అంటాడు ”బాల్యం ప్రకృతి ఇచ్చిన వరం. ఏ పవిత్ర స్థలంలోనూ అంతటి శాంతి, సంతృప్తి లభించవు నాకు. విద్వేషం, విషం పొంగించే పెద్దలకన్నా ప్రేమ రసం కురిపించే పిల్లలేమిన్న..” అంటారు.
శ్రీశ్రీ ”మెరుపు మెరిస్తే.. వాన కురిస్తే.. ఆకాశాన హరివిల్లు విరిస్తే.. అది తమ కోసమేనని మురిసిపోయే బాల్యం అమూల్యం తిరిగి చేరలేని తీరం. ఆట పాటలకు ఓటేద్దాం! చిన్నారుల కలలు పండిద్దాం!”! అంటారు
పిల్లల ఆనందం ఆకాశమంత. ఇదంతా నాణానికి ఒకవైపు. ఉత్తుంగ తరంగాలై.. ఉప్పొంగే ఆ చిన్నారి లోకానికి ఎన్నో కలలుంటాయి. మనసు విప్పి చెప్పుకోలేని మాటలుంటాయి. ఈ రోజు తెలంగాణలో 62 లక్షల మంది పిల్లలు చదువుతుంటే 34 లక్షల మంది ప్రైవేటు స్కూల్లోనే చదువుతున్నారు. అంటే ప్రభుత్వం విద్యావ్యవస్థని రోజురోజుకు ఎలా వదులుకుంటుదో విదితమవుతుంది.
విద్యకు కేటాయించే బడ్జెట్‌ ఏ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చలేదు. పిల్లలకు ఓటు లేదు కదా!? భావి భారత పౌరుల పట్ల నాయకులకు ఎంత శ్రద్ధ ఉందో అర్థం చేసుకోవాలి. పిల్లల బరువు కంటే.. మా స్కూల్‌ బ్యాగ్‌ బరువే ఎక్కువై, ఆ బరువును మా తల్లిదండ్రులు మోసుకొచ్చి బడి దగ్గర దింపి వెళుతున్నారు. ఇదెప్పుడైనా మీరు ఆలోచించారా? అంటూ.. పిల్లలు ప్రశ్నించారు.
ఆట స్థలాలు లేని బడులకు అనుమతులు ఎందుకు ఇస్తారు అని అడుగుతున్నారు. చదువులంటే బస్తాడు బరువా? వామ్మో అంటున్నారు. పోని ఇవన్నీ చదువుతామా? ఇవన్నీ నేర్పుతారా? సంచులు మోసి మోసి మాకు గూని వచ్చిందని వాపోయారు.
శాస్త్రీయ ఆలోచనలను అభివృద్ధి చేయాలని భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు నిర్దేశించాయి. పౌరుల ప్రాథమిక కర్తవ్యాల్లో భాగంగా శాస్త్రీయ ఆలోచనలను, మానవత్వాన్ని, ప్రశ్నించే తత్వాన్ని, సంస్కరణ స్వభావాన్ని అభివృద్ధి చేయాలని భారత రాజ్యాంగం లోని 51A(ష్ట్ర) అధికరణం నిర్దేశిస్తుంది. దిని గురించి పట్టించుకోవడం లేదేందుకు?
”ఇతిహాస్‌ బచావో” ఇతిహాసాలను పురాణాలను రక్షించాలని బోధనలు చేస్తూ పిల్లల మెదళ్ళను అయెమాయానికి గురి చేస్తున్నారు. పాఠ్యపుస్తకాలను, చరిత్రను తిరగ రాస్తున్నారు. చరిత్ర అక్కర్లేదు అంటున్నారు. భారత రాజ్యాంగంలోని పిల్లల హక్కులు చెరిపేస్తున్నారు. ఇవన్నీ పిల్లలకు అర్థం అవుతున్నాయి. ఎవరి చేష్టల వెనుక ఎంత విద్వేషం ఉందో.. తెలుసుకుంటున్నారు.
ఎవరు జాతీయ జెండా చేతికిచ్చినా దేశభక్తుల్లా.. ‘జై బోలో స్వాతంత్ర భారత్‌ కి, జై ..జై జవాన్‌ జై కిసాన్‌’ అని రోడ్లమ్మటి అరుస్తున్నాం. ఏ నినాదం అందించినా జాతీయ సమైక్యత అని ముందుకు సాగుతున్నాం.
కొన్ని చోట్ల గురువులే.. ‘భారతమాత కి జై, జై శ్రీరామ్‌, హిందూ బందువ’ంటూ పక్కనున్న ముస్లిం సోదరులపై విషం చిమ్మడం విచారకరం.
కుండలో నీళ్లు తాగితే మేఘ్వాల్‌ను చితక బాదిన సరస్వతీ పుత్రులున్నారు. మాంసం తినలేదు కోడికూరే నన్ను ఆక్లాక్‌ ను అంతం చేసిన నోళ్లు ఇప్పుడు విమోచన గీతం ఆలపిస్తుంటే వాళ్ల గురించి ఏమి చెప్పను అమ్మ ..! ఎలా చెప్పను మమ్మీ అని కవిత్వకరించారు
వాళ్ళకేం తెలుసు పాపం పసిపిల్లలే కదా..! అని పిల్లలపై విద్వేషపు బీజాలు విద్వాంసులు బోదిస్తున్నారు. ఇప్పటికైనా బిడ్డల మెదళ్ళలో విష బీజాలు నాటకండి. మత విద్వేషపు రాజకీయాలకు భవిష్యత్తు తరాల్ని జండా కర్రలుగా మార్చకండి. గంగా జమున తెలంగాణ సహజీవన సంస్కృతిని విలసిల్లేలా చేయడానికి బాల్యాన్ని ముద్దాడిన తెలంగాణ బాలోత్సవం అపూర్వ ఘట్టం మన ముందు ఆవిష్కతమైంది.
”ఎడారిలో.. ఒయాసిస్‌ బాలోత్సవ్‌
ఒక భవిష్యత్తు
ఒక స్వప్నం
ఇది బాలల కుటుంబం
విజ్ఞాన చోటాభీమ్‌ లు
మరో బాలల ప్రపంచం
ఎగురుతున్న పతంగులు
దూసుకెళ్లిన తారాజువ్వలు
మన ఆశా దీపాలు
తొలకరి జల్లులు
వెన్నెల వెలుగులు
పురివిప్పిన నెమళ్లు
ఎటు చూసినా పిడుగులే…
నలు దిశల వేదికలే..
ఈ నేల నడిపేనా..
తెలంగాణ బాలోత్సవ్‌
అది తిలకించిన
సుందరయ్యతాత మురిసేనా..”
అన్న రీతిలో…
తెలంగాణ బాలోత్సవం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రతి సంవత్సరం ఒక యజ్ఞం లా నిర్వహిస్తున్నది.
పిల్లలకోసం కాస్త టైం కేటాయించండి. ఈ ప్రపంచం ఎంత అందంగా కనబడుతుందో. రండి, భావితరాల ప్రతిభా పాఠవాలు ప్రపంచానికి పరిచయం చేస్తారు.
చిన్నపిల్లలకు సహాయం చేసే పెద్ద హృదయాలను, బాలోత్సవ కుటుంబ సభ్యులు, పిల్లల నేస్తాలు, పిల్లలకే నా హృదయం అంకితం, అనే బాలసాహితీ వేత్తల, రేపటి పౌరుల ఉత్సాహ వేదిక… పిల్లల పండుగను తిలకించడానికి రాష్ట్ర వ్యాప్తంగా తరలి వస్తున్నారు.
అదే జోరు.. అదే హోరు… చిరుతలు అదరహో… ప్రగతి ప్రతిభా గీతాలు, పిల్లలు చేప్పే కథలు విందాం! వాళ్ళ కళ్ళలో వెలుగులు చుద్దాం! బాలోత్సవ వేడుకలు ఆనందాల పండుగలు.
– భూపతి వెంకటేశ్వర్లు, 9490098343