కాంగ్రెస్‌ వస్తే కలెంట్‌ 3 గంటలే…

– మెచ్చా చాలా మంచి వ్యక్తి
– పేటలో బీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయం : సీఎం కేసీఆర్‌
నవతెలంగాణ-దమ్మపేట
కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చుడూ లేదు, చచ్చుడూ లేదు అని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు అహంకారంతో అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి కెసిఆర్‌ స్పష్టం చేశారు. వందకు వంద శాతం బిఆర్‌యస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అశ్వారావుపేట బిఆర్‌ఎస్‌ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు గెలుపు ఖాయమని కెసిఆర్‌ తెలిపారు. సోమవారం దమ్మపేట మల్లారంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన సీఎల్‌పీ నాయకుడు భట్టి విక్రమార్క ధరణిని బంగాళాఖాతంలో కలపాలని అంటున్నారని ధరణి వలన యజమానికి తప్ప వేరెవ్వరికీ భూమిని మార్చే అధికారంలేదని ధరణి ఉండటం వల్లనే రైతులకు రైతు బంధు ముందుగా వారి వారి ఎకౌంట్లలోకి జమ అవుతుందని కాంగ్రెస్‌ పార్టీ రైతుల యెడల బాధ్యత లేకుండా మాట్లాడుతుందని తెలిపారు. టీపీసీసీ ప్రసిడెంట్‌ రేవంత్‌రెడ్డి మాజీ టీపీసీసీ ప్రెసిడెంట్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి రైతులకు 24 గం||లు కరెంటు ఇవ్వడం దండగని ప్రజా సొమ్మును రైతులకు ఇచ్చి కెసిఆర్‌ దుబారా చేస్తున్నారని వారు ఒకటికి 10 సార్లు చెప్పటమే కాకుండా రైతులకు 3 గం||లు కరెంటు సరిపోతుందని అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని తాను ఒక రైతునేనని కాంగ్రెస్‌ నాయకుల కల్లబొల్లి మాటలు నమ్మి ప్రజలు ఆగం కావద్దని 3 గం||ల కరెంటు కావాలా? 24 గం||ల ఉచిత కరెంటు కావాలా? ప్రజలే నిర్ణయించాలని రైతు బంధు కావాలా? ధరణి కావాలా ? ప్రజలు, రైతులు చర్చించాలని తెలిపారు. విడిగా ఉన్న హైదరాబాద్‌ స్టేట్‌ను కాంగ్రెస్‌ పార్టీ బలవంతంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కలిపిందని లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఏనాడో అభివృద్ధి చెందేదని అన్నారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ 100 పడకల ఆసుపత్రి, డయాలసిస్‌ కేంద్రం సెంట్రల్‌ లైటింగ్‌ ఇప్పటికే రెండు పామాయిల్‌ ఫ్యాక్టరీలు మూడవ పామాయిల్‌ ఫ్యాక్టరీ నిర్మాణ దశలో ఉందని పదివేల కుటుంబాలకు 26 వేల ఎకరాల పోడుభూములకు పట్టాలు ఇవ్వడం జరిగిందని, వారిపై ఉన్న కేసులు ఎత్తివేయడం జరిగిందని, వారికి సైతం రైతు బంధు ఇవ్వటం జరుగుతుందని చెప్పారు. త్వరలో సీతారామా ప్రాజెక్టు పూర్తవుతుందని దీని ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం అవుతుందని చెప్పారు. మెచ్చా నాగేశ్వరరావు చాలా మంచి వ్యక్తి అని హైదరాబాద్‌ వచ్చినా ఒకటి రెండు రోజులు మాత్రమే ఉంటారని మిగతా సమయం అంతా నియోజకవర్గంలో గడుపుతారని వివరించారు. తాటి – మెచ్చా కలిస్తే అశ్వారావుపేటలో బిఆర్‌ఎస్‌ విజయం ఖాయమని 100కి 100 శాతం బిఆర్‌ఎస్‌ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని దానికోసం ప్రజలంతా బిఆర్‌ఎస్‌ పార్టీని ఆశీర్వదించాలని కెసిఆర్‌ కోరారు. తొలుత కేసీఆర్‌ సమక్షంలో తాటి వెంకటేశ్వర్లు, వగ్గెల పూజ, సున్నం నాగమణి, బిఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ సభలో ఎంపీలు నామా నాగేశ్వరరావు, బండి పార్థసారథిరెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధు, హైదరాబాద్‌ మాజీ మేయర్‌ బొంతు రామ్మోహనరావు, అశ్వారావుపేట బిఆర్‌యస్‌ పార్టీ ఎన్నికల ఇంచార్జ్‌ ఉప్పల వెంకటరమణ, జిల్లా రైతుబంధు అధ్యక్షుడు రావు జోగేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షుడు దొడ్డాకుల రాజేశ్వరరావు, దమ్మపేట జడ్పీటిసి పైడి వెంకటేశ్వరరావు, నియోజకవర్గ సమన్వయకర్త దారాయుగంధర్‌, పర్వతనేని రామకృష్ణ, దొడ్డా రమేష్‌, యువజన నాయకుడు పైడి సాయికుమార్‌, ఐదు మండలాల జడ్పీటిసిలు, ఎంపిపిలు, పార్టీ అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.