నన్ను, రేవంత్‌రెడ్డిని ఓడించేందుకు కేసీఆర్‌ కుట్రలు

– పదవులు ఉన్నా లేకున్నా మీ మధ్యనే ఉన్నా
– అవకాశం ఇచ్చి చూడండి పాలేరును అభివృద్ధి చేస్తా
– తిరుమలాయపాలెంలో పొంగులేటి విస్తృత ప్రచారం
నవతెలంగాణ-తిరుమలాయపాలెం
వచ్చే ఎన్నికల్లో నన్ను, రేవంత్‌రెడ్డిని ఓడించేందుకు కేసీఆర్‌ సర్వశక్తులు ఒడ్డుతున్నాడని, కోట్లాది రూపాయలు పంపి ఓట్లు కొనే కార్యక్రమానికి తెరలేపారని పాలేరు కాంగ్రెస్‌ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. తిరుమలాయపాలెం, కొక్కిరేణి, యర్రగడ్డ, గోపాలపురం, తిమ్మక్కపేట, తాళ్ల చెర్వు, దమ్మాయిగూడెం గ్రామాల్లో పొంగులేటి మంగళవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ తనను ఓడించేందుకు కందాళ ఉపేందర్‌రెడ్డికి కేసీఆర్‌ రూ.200 కోట్లు పంపించాడని ఆరోపించారు. ఆ డబ్బులు తీసుకొని హస్తం గుర్తుకు ఓటేయండి అని కోరారు. పదవులు ఉన్నా లేకపోయినా ప్రజల మధ్యనే మీ శ్రీనన్న కావాలో… పదవి ఉండి కూడా ఏమీ చేయలేని వారు కావాలా మీరే నిర్ణయించుకుని ఓటేయాలని కోరారు. కొంతమంది నాయకులు తిరుమలాయపాలెం మండలాన్ని దత్తత తీసుకోవాలని కోరుతున్నారని… కానీ మీ అందరికీ మాట ఇస్తున్నా ఒక్క తిరుమలాయపాలెం కాదు పాలేరు నియోజకవర్గంలోని అన్ని మండలాలను దత్తత తీసుకుని అభివృద్ధిలో ప్రథమస్థానంలో ఉంచుతానని అన్నారు. అనంతరం బీఆర్‌ఎస్‌ పార్టీ యర్రగడ్డ గ్రామ శాఖ అధ్యక్షుడు బెల్లం రాము, మాజీ ఎంపీటీసీ పాలకుర్తి వీరభద్రం, వైఎస్సాఆర్‌ టీపీ నుంచి నర్సింహారావు, కొత్త బాలాజీ తదితరులు పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలోకి చేరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్‌, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు రాయల నాగేశ్వరరావు, మద్దినేని బేబి స్వర్ణకుమారి, మద్ది శ్రీనివాస రెడ్డి, మండల అధ్యక్షుడు బెల్లం శ్రీను, ఎంపీపీ మంగీలాల్‌, రామసహాయం నరేష్‌రెడ్డి. పాలేరు నియోజకవర్గ నాయకులు చావా శివరామకృష్ణ, మాజీ ఎంపీపీ కొప్పుల అశోక్‌, తాటికొండ కిరణ్‌, పోట్ల కిరణ్‌, ఎంపీటీసీలు అంబేద్కర్‌, చుంచు వెంకటేశ్వర్లు, సైపుద్దీన్‌, బత్తుల రవికుమార్‌, కర్నాటి రాజేంద్ర ప్రసాద్‌ సీపీఐ మండల బాధ్యులు బత్తుల రాధాకృష్ణ తదితరులు ఉన్నారు.