సంక్రాంతిలోగా ‘దళితబంధు’ అందించి రుణం తీర్చుకుంటా

– లేకుంటే వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓట్లడగం
– కిష్టారం నుంచే దళితబంధుకు శ్రీకారం
– సింగరేణి నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తాం
– సత్తుపల్లి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య
నవతెలంగాణ-సత్తుపల్లి
రాజకీయాలకు అతీతంగా సత్తుపల్లి నియోజకవర్గంలోని ప్రతి దళిత కుటుంబానికి సంక్రాంతిలోగా దళితబంధును అందించి రుణం తీర్చుకుంటానని, లేకుంటే వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓట్లడగమని సత్తుపల్లి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు. మంగళవారం సండ్ర తన ఎన్నికల ప్రచారాన్ని సత్తుపల్లి మండలం కిష్టారం నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి చెరుకుపల్లి, యాతాలకుంట, రేగళ్లపాడు, బుగ్గపాడు, బాచారం, రుద్రాక్షపల్లి, కాకర్లపల్లి గ్రామాల మీదుగా ఎన్నికల ప్రచారం సాగింది. ఈ సందర్భంగా జరిగిన ప్రచార సభల్లో సండ్ర మాట్లాడారు. సింగరేణి ప్రభావిత ప్రాంతమైన కిష్టారం ప్రజల సమస్యల పరిష్కారానికి బాధ్యతను తీసుకుంటానన్నారు. తెలంగాణ ఏర్పడి కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాకే అనేక ప్రజారంజక సంక్షేమాభివృద్ధి పథకాలను తీసుకొచ్చారన్నారు. 55 యేండ్లు పాలన సాగించిన కాంగ్రెస్‌ ఇప్పుడమలవుతున్న పథకాలను తీసుకురావాలనే సోయి ఎందుకు రాలేదన్నారు.
చివరి వరకు టీడీపీలోనే ఉన్నా… అందరూ వెళ్లాకే ప్రాంత అభివృద్ధి కోసం తప్పనిసరై
ముందుగా టీడీపీలోకి వెళ్లింది వారేనని, టీడీపీని కాపాడుకొనేందుకు చివరి వరకు కొనసాగింది నేనేనని సండ్ర అన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో నియోజకవర్గ అభివృద్ధి కోసం టీడీపీని వీడక తప్పలేదన్నారు. ఈ నేపధ్యంలో నియోజకవర్గంలో రూ. వెయ్యి కోట్లకు పైగా అభివృద్ధి కేసీఆర్‌, కేటీఆర్‌ సహకారంతో జరిగిందన్నారు. టీడీపీని నడిసంద్రాన వదిలిపోయిన నాయకులే ఇప్పుడు ఓట్ల రాజకీయం చేస్తున్నారన్నారు. ఈ విషయాన్ని టీడీపీ శ్రేణులు కూడా మనసుపెట్టి ఆలోచన చేయాలన్నారు. ఈ ప్రచార కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్‌ కొత్తూరు ఉమామహేశ్వరరావు, జెడ్పీటీసీ సభ్యులు కూసంపూడి రామారావు, కిష్టారం సొసైటీ అధ్యక్షులు మామిళ్లపల్లి కృష్ణయ్య, నాయకులు శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, ఎంపీటీసీ సభ్యులు పాలకుర్తి సునీతారాజు, మోదుగు పుల్లారావు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.