జాతీయ ప్రకృతి వైద్య దినోత్సవం సందర్భంగా ఉపన్యాస పోటీలు

నవతెలంగాణ – బోనకల్‌
జాతీయ ప్రకృతి వైద్య దినోత్సవం సందర్భంగా గాంధీ గ్లోబల్‌ ఫ్యామిలీ, సిద్ధార్థ యోగ విద్యాలయం రామచంద్ర చారిటబుల్‌ ట్రస్ట్‌, గాంధీ జ్ఞాన యోగ, సోషల్‌ ఫోరం ఆధ్వర్యంలో మండల స్థాయి ఉపన్యాస పోటీలను మానవ జీవితంలో ప్రకృతి పాత్ర అనే అంశంపై రావినూతల ఉన్నత పాఠశాలలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు దామల్ల పుల్లయ్య మాట్లాడుతూ విద్యార్థులు ఇటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకొని ప్రకృతి ప్రాధాన్యతను సమాజానికి తెలియజేయాలని కోరారు. ఈ పోటీల్లో బ్రాహ్మణపల్లి ఉన్నత పాఠశాలకు చెందిన వెంకట స్వాతి ప్రథమ బహుమతి, రావినూతల ఉన్నత పాఠశాలకు చెందిన యశ్వంత్‌ ద్వితీయ బహుమతి సాధించారు. ప్రథమ బహుమతి సాధించిన వారిని జిల్లా స్థాయి పోటీలకు పంపనున్నట్లు నిర్వాహకులు పి. పుల్లారావు తెలిపారు. ఈ ఉపన్యాస పోటీలకు న్యాయ నిర్ణీత గా బోనకల్‌ జూనియర్‌ కాలేజ్‌ హిస్టరీ లెక్చరర్‌ అంతోటి తిరుపతిరావు వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి మండలంలోని ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు విజయలక్ష్మి, వీరరాజు, జుబెదా, గిరిధర్‌, అనిత పాల్గొన్నారు. మండల స్థాయిలో ప్రథమ స్థానాన్ని సాధించిన బ్రాహ్మణపల్లి విద్యార్థి స్వాతిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస రెడ్డి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుగులోతు రామకృష్ణ ఉపాధ్యాయ సిబ్బంది, గ్రామ సర్పంచ్‌, ఎస్‌ఎంసి చైర్మన్‌ తదితరులు అభినందించారు.