ఆరోగ్యదాయిని జయమ్మ

Jayamma is a healthy midwife             క్యాన్సర్‌ ఆమెను కుంగదీసే ప్రయత్నం చేసింది. కానీ దాన్నే ఆమె జయించింది. చికిత్స సమయంలో ఆహారం విషయంలో తాను ఎదుర్కొన్న సమస్యలు ఎవరికీ రాకూడదని భావించింది. నూనెల్లో కల్తీని అరికట్టి స్వచ్ఛమైన నూనెను ప్రజలకు అందించడం తన లక్ష్యంగా పెట్టుకుంది. మంచి ఆరోగ్యాన్ని అందరికీ అందించాలనే తపనతో ఆరోగ్యదాయిని అనే సంస్థను స్థాపించింది. మంచి ఆరోగ్యంతో అందరూ ఉండేలా చూడటమే తన సామాజిక బాధ్యతగా భావించిన ఆమె విజయగాథ నేటి మానవిలో…
మహబూబ్‌నగర్‌ జిల్లా జక్లపల్లి గ్రామంలోని వ్యవసాయక కుటుంబం జయమ్మది. ఇల్లే ప్రపంచం అనుకునే మహిళ. ఇల్లు చూసుకుంటూ, వ్యవసాయక పనులను చేసుకుంటూ, నలుగురికి సహాయపడుతూ అందరికీ తలలో నాలుకలా ఉండే జయమ్మపై కళ్ళు కుట్టిన కాలం వేసిన శిక్ష బ్రెస్ట్‌ క్యాన్సర్‌. 2018, మార్చి నెలలో ఆమెకు బ్రెస్ట్‌ క్యాన్సర్‌ అని నిర్ధారణ అయింది. తాను నిర్మించుకున్న ఆశల సౌధం కళ్ళముందు కూలిపోతున్నట్లుగా అనిపించింది జయమ్మకు. అన్ని రకాల టెస్టులను చేయించుకుని డాక్టర్ల సలహా మేరకు కీమోథెరపీ తీసుకుంది. సైడ్‌ ఎఫెక్ట్స్‌కు శరీరం పూర్తిగా లొంగిపోయింది. కుటుంబం అందించిన ఆత్మస్థైర్యం, ఆప్యాయత, అనురాగాలతో కీమోథెరపీ, సర్జరీల తర్వాత శరీరంలో కలిగే అనేక మార్పుల నుండి ఉపశమనం పొందగలిగింది.
డాక్టర్‌ సలహాతో…
చికిత్స చేయించుకుంటున్న జయమ్మకు తెలిసిన డాక్టర్లు ఎన్నో సలహాలు ఇస్తుండేవారు. అందులో భాగంగా మైసూర్‌లోని ఖాదరవలి అనే హౌమియోపతి డాక్టర్‌ డైట్‌ మార్చుకోమని సలహా చెప్పారు. మందులు వాడుతూ వంటల్లో పల్లీ, కుసుమ, నువ్వులు, కొబ్బరి నూనెలు వాడమని చెప్పారు. ఈ నూనెలు కొనకుండా గింజలు కొని మరపట్టించి వాడేవారు. అయితే అలా కాకుండా గానుకనూనె వాడమని డాక్టర్‌ సలహా ఇచ్చారు. దాంతో మహబూబ్‌నగర్‌లో కరెంటు గానుగ నుండి తయారుచేసిన నూనె కొద్ది రోజులు వాడారు. కానీ డాక్టర్‌ ఎడ్ల గానుగ నూనె అయితే బాగుంటుందని చెప్పారు. ఎడ్లతో నడిచే గానుగ నూనె కొరకు వెదకడం మొదలుపెట్టారు. ఆ నూనె చిత్తూరులో దొరుకుతుందని తెలుసుకొని అక్కడ నుండి తెప్పించుకునేవారు. దీన్ని వాడిన తర్వాత ఆమె ఆరోగ్యంలో మార్పులు గమనించింది. అయితే చిత్తూరు నుండి నూనె తెచ్చుకోవడం చాలా కష్టంగా ఉండేది. దాంతో ఆ ఎడ్ల గానుగను తామే పెట్టి నూనె తయారు చేసుకుంటే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనే నేటి ఆరోగ్య దాయని ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.
నేటి యువతకు మార్గదర్శకురాలు
చాలా మంది జయమ్మ సహకారంతో ఆరోగ్యదాయని గానుగ కేంద్రాలను వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేసుకున్నారు. గనుక నుండి నూనె ఎలా తీయాలో 170 మందికి ఆమె శిక్షణ కూడా ఇచ్చింది. ఆరోగ్యదాయని ద్వారా కల్తీ లేని నూనె తయారుచేసి అందరికీ సరసమైన ధరలకు అందిస్తున్న జయమ్మ సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటారు. పాఠశాలలో కరెంటును ఏర్పాటు చేయడం, విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్‌లు, షూ, బెల్డులు పంచడం ఇలా పేద విద్యార్థులకు కావలసిన వాటిని ఆరోగ్యదాయని సంస్థ ద్వారా అందిస్తున్నారు.
ఇతర దేశాలకు ఎగుమతి
వి హబ్‌ ద్వారా నూనెను ఇతర దేశాలకు ఎగుమతి చేయడం, వ్యాపారం చేయడంలోని అనేక మెలకువలను తెలుసుకుంది. వారి సహకారంతో గానుగలను ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేసి దుబారు, సింగపూర్‌, మలేషియా దేశాలకు సైతం కల్తీ లేని స్వచ్ఛమైన నూనె ఎగుమతి చేస్తున్నారు. కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్‌, పంజాబ్‌ రాష్ట్రాలకు కూడా నూనెను పంపిస్తున్నారు. ఆరోగ్యదాయని నూనెకు మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ మంచి గిరాకీ ఉంది. నూనె తయారు చేసినప్పుడు వ్యర్థ పదార్థంగా మిగిలిపోయే పిప్పిని కూడా పశువుల దానాగా వాడుతున్నారు. ఇతర ప్రాంతాలకు సప్లై చేస్తున్నారు.
ఆమె ఆశయాలు ముందుకు తీసుకెళతాం
‘అనారోగ్యంతో బాధపడుతూ కూడా స్వయంగా గానుగ నడపడం దగ్గర నుంచి నూనె బాటిల్స్‌లో నింపడం వరకు తానే దగ్గరుండి పర్యవేక్షణ జర్యవేక్షించే వారు. అలాంటి మనిషి ఈ ఏడాది మమ్మల్ని అందరినీ వదిలి వెళ్లారు. కల్తీ నూనె అరికట్టి స్వచ్ఛమైన నూనెను ప్రజలకు అందించడమే నా లక్ష్యం అంటూ ఎప్పుడూ అంటుంటారు. కష్టాలకు కుంగిపోకుండా జీవితంలో ఎదురయ్యే ఆటంకాలను ఎదుర్కొంటూ ధైర్యంగా ముందుకు వెళ్లే ప్రతి మహిళలో మా అత్తమ్మ జ్ఞాపకాలు పదిలంగా ఉంటాయి. ఆమె ప్రారంభించిన ఈ సేవా సంస్థను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. అత్తమ్మ ఆశయాలకు అనుగుణంగా ఆరోగ్యదాయని నడిపిస్తాం’ అంటున్నారు జయమ్మ కొడుకులు శ్రీధర్‌ రెడ్డి, శ్రీనివాస్‌ రెడ్డి, కోడలు రాధిక శ్రీనివాస్‌రెడ్డి.
స్వయంగా శిక్షణ తీసుకుని
మైసూర్‌లోని డే సిరీ నేచురల్స్‌ వారి దగ్గర ఒక వారం రోజులు ఉండి గానుగ నుండి నూనె తీసే విధానాన్ని నేర్చుకుంది జయమ్మ. చిత్తూరులో ఉన్న కోదండచారి గానుగను తయారు చేసే వీరికి ఇచ్చారు. అప్పటికి ఆమె వయసు 55. ఆ గానుగకు ఎద్దును కట్టి తానే దగ్గరుండి గానుగను తిప్పేది. గానుగ తిరుగుతూ నువ్వులు, పల్లీల నుండి నూనె వచ్చేది. కానీ నూనె మొత్తం సరిగ్గా వచ్చేది కాదు. ఆ సమస్యను పరిష్కరించుకోవడం కోసం మళ్ళీ ఒక వారం మైసూర్‌లో ఉండి గానుగ తిప్పడం నేర్చుకొని వచ్చింది. అప్పటికే చిత్తూరుకు చెందిన వినోద్‌ రెడ్డి ఎద్దుల గానుగను ప్రారంభించి నూనె తీస్తూ అందరికీ పంపుతూ వుండేవారు. జయమ్మ తనకు వచ్చే అనుమానాలను వినోద్‌ రెడ్డి ద్వారా పరిష్కరించుకునేది.
నిరుత్సాహపడకుండా…
2019 ఫిబ్రవరి నెలలో జయమ్మ గానుగను ప్రారంభించింది. ఫుడ్‌ లైసెన్స్‌ కూడా తీసుకుంది. నూనెను స్టోర్‌ చేసేందుకు గాజు పాత్రలు, మట్టి పాత్రలను ఉపయోగించే వారు. తాను క్యాన్సర్‌ పేషెంట్‌ అయినా రెండవసారి సర్జరీ జరిగినా లెక్కచేయకుండా గానుగ కొరకే జీవితాన్ని అంకితం చేసిన గొప్ప మనిషి జయమ్మ. ఆహార పదార్థాలను వండడానికి మంచి నూనె ఉన్నప్పుడే వ్యాధులు శరీరానికి సోకకుండా ఉంటాయి. ఇది స్వయంగా తెలుసుకున్న జయమ్మ కల్తీ లేని నూనెను గింజల నుండి తీయడం మొదలు పెట్టింది. ముందు బంధువులకు ఫ్రీగా సప్లై చేసేది. రాను రాను ఈ విషయం తెలిసిన వారు ఆర్డర్స్‌ ఇవ్వడం మొదలు పెట్టారు. తర్వాత 20 నుండి 25 మందిని పెట్టుకొని వారికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగింది.
– సి.హెచ్‌.హరిప్రియ, 9603099334