కొత్త తరహా కథలకు ఎప్పుడూ పెద్ద పీట వేసే నాగచైతన్య ప్రస్తుతం వెబ్ సిరీస్ ప్రపంచంలోకి అడుగు పెట్టారు. ఆయన ప్రధాన పాత్ర పోషించిన ‘దూత’ డిసెంబర్1 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ కానుంది.
మరోవైపు చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందనున్న భారీ ప్రాజెక్ట్ టైటిల్, ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘తండేల్’ అనే పవర్ ఫుల్ టైటిల్ ఖరారు చేశారు. నేడు గురువారం నాగచైతన్య పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు.
యూనిక్ కాన్సెప్ట్‌తో దూత
ఈ బర్త్ డే నాకు సమ్‌థింగ్ స్పెషల్. ఫ్యాన్స్‌కి కూడా సర్ప్రైజ్లు ఉన్నాయి. నేను చేసిన తొలి వెబ్ సిరీస్ ‘దూత’ ట్రైలర్ విడుదల అవుతోంది. చందూ మొండేటి దర్శకత్వంలో రూపుదిద్దుకొంటున్న సినిమా టైటిల్ ‘తండేల్’ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. విక్రమ్ కుమార్ ‘దూత’ లాంటి యూనిక్ కాన్సెప్ట్‌తో వచ్చారు. ఇది ఖచ్చితంగా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఈ సిరీస్‌కి సీజన్ 2, సీజన్ 3 ఐడియాలు విక్రమ్ దగ్గర ఉన్నాయి. సీజన్ 1 హిట్టయితే.. తప్పకుండా మరో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తాం.
ఈ సిరీస్‌కి సంబంధించి విక్రమ్ చెప్పిన ఐడియానే నాకు కొత్తగా అనిపించింది. ఇలాంటి సూపర్ నేచురల్ థ్రిల్లర్స్ తీయడంలో విక్రమ్ మాస్టర్. దూతలాంటి కాన్సెప్ట్ ఇప్పటివరకూ రాలేదు. విక్రమ్ అద్భుతంగా తీశారు. నిర్మాత శరత్ మరార్ ఎక్కడా రాజీపడకుండా చాలా గ్రాండ్‌గా ఈ సిరీస్‌ని నిర్మించారు. ఇప్పటి వరకు చూడని కొత్త లొకేషన్స్‌లో షూట్ చేశాం. టెక్నికల్‌గా ఉన్నత స్థాయిలో ఉంటుంది. ప్రేక్షకులు సీట్ ఎడ్జ్ థ్రిల్ ఫీలౌతారు.
తండేల్‌లో బెస్తవాడిగా..
చందూ మొండేటితో ‘తండేల్’ లాంటి ఓ స్పెషల్ ప్రాజెక్ట్ చేస్తున్నా. ఈ సినిమా కోసం శ్రీకాకుళంలోని కె.మత్స్యలేశం గ్రామానికి వెళ్లాం. అక్కడ పరిస్థితులని దగ్గరుండి అర్ధం చేసుకున్నాం. ఇది నా కెరీర్లో బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమా. చాలా పెద్ద కాన్వాస్, స్పాన్ ఉన్న కథ. కథ రీత్యా కొంత భాగం ఇండియాలో కొంత భాగం పాకిస్తాన్లో జరుగుతుంది. ఈ చిత్రం నా కెరీర్లోనే సెన్సేషనల్ మూవీ. ఇందులో నాది బెస్తవాడి పాత్ర. అలాగే శ్రీకాకుళం యాసను కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఓ ఫిషర్మెన్ జీవితంలో జరిగిన కొన్ని సంఘటల్ని సినిమాటిక్‌గా చెప్పబోతున్నాం. అలాగే అద్భుతమైన అనుభూతిని పంచే ప్రేమకథ ఉంది. ‘లవ్‌స్టొరీ’ తర్వాత నేను, సాయిపల్లవి మళ్ళీ కలిసి నటిస్తున్నాం. తన రాకతో ఈ కథకు మరింత బలం చేకూరినట్టయింది.