– నికరంగా ఆరున్నరేండ్లే పాలించాం
– తెలంగాణ కోసం చచ్చేంతా మమకారం : క్రెడారు సమావేశంలో మంత్రి కేటీఆర్
నవతెలంగాణ – బిజినెస్ బ్యూరో
కొత్తగా ఇల్లు కొనుగోలు చేయాలను కుంటున్న మధ్యతరగతి ప్రజల కోసం త్వరలో కొత్త పథకం తీసుకు వస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. దీనిపై సీఎం కేసీిఆర్ ఆలోచన చేస్తున్నారన్నారు. రుణం తీసుకుని ఇల్లు కొనే మధ్యతరగతి వారికోసం ప్రభుత్వం కొత్త పథకం తేవాలనుకుంటుందన్నారు. శుక్రవారం నగరంలోని హెచ్ఐసిసిలో క్రెడారు నిర్వహించిన రియల్ ఎస్టేట్ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో కెటిఆర్ మాట్లాడుతూ.. నగరం అభివృద్థికి తాము అనేక ప్రణాళికలు కలిగి ఉన్నామన్నారు. గడిచిన తొమ్మిదిన్నరేళ్లలో కరోనా, ఎన్నికల వల్ల ఆరున్నరేళ్లుమాత్రమే నికరంగా పరిపాలించామని తెలిపారు. రెండేళ్లు కరోనాకే పోయిందన్నారు. సినీనటుడు రజనీ కాంత్కి కూడా హైదరాబాద్‌లో మార్పు అర్థమైందని.. కానీ ఇక్కడున్న గజినీలకు అర్థం కాలేదన్నారు. ఏపీ నుంచి వేరుపడినప్పుడు అనేక అనుమానాలు నెలకొనగా.. ప్రస్తుతం దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా నిలిచిందన్నారు. మాది 6.5 ఏండ్లయితే.. వారిది 65 ఏండ్ల పాలన అని ప్రతిపక్షాలను ఉద్దేశించి అన్నారు. ఈ తక్కువ సమయం లో ప్రజల కనీస అవసరాలు అన్ని తీర్చగలిగామన్నారు. గడిచిన 25 ఏళ్లలో ఏళ్లలో తెలంగాణ ప్రాంతంపై ప్రభావం చూపిన నేతలు చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి, కెసిఆర్ మాత్రమేనన్నారు. చంద్రబాబు ఐటి వృద్థికి పాటు పడితే, రాజశేఖర్ రెడ్డి పేదల కోసం పని చేయగా.. కానీ కేసీఆర్ హయాంలో ఐటి సహా పేదల వరకు అన్ని రంగాల వృద్థి జరిగిందన్నారు. టిఎస్ ఐపాస్‌తో 27000 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చామన్నారు. ప్రతి పక్షాలకు మమ్మల్ని తిట్టేందుకు ప్రజా సమస్యలు లేవని.. అందుకే మాకు అహంకారం అని తిడు తున్నారని పేర్కొన్నారు. మాకుంది అహంకారం కాదని … తెలంగాణ కోసం చచ్చేంత మమకారమన్నారు. 3వ తేదీన తామే విజయం సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. అభివృద్థి చేసే పార్టీకే ఓటు వేయాలని కెటిఆర్ కోరారు. 2047 నాటికి ఏపీ, తెలంగాణ, హిందూ, ముస్లిం లాంటి బేధాలు లేకుండా సమగ్ర వృద్థి ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.