గొర్రెల పంపిణీ వెంటనే ప్రారంభించి నగదు బదిలీ చేయాలి

– నేడు కలెక్టరేట్‌ ధర్నా
– జిఎంపిఎస్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చింతలచెర్వు కోటేశ్వరావు,తుశాకుల లింగయ్య
నవతెలంగాణ-ఖమ్మం
గొర్రెలు ఎప్పుడిస్తారో స్పష్టమైన తేదీ చెప్పకుండా ప్రభుత్వం యాదవ్‌, కురుమల చేత డీడీలు కట్టిస్తూ రేపు, మాపు అంటూ గత జూన్‌, 2022 నుండి ప్రభుత్వం మభ్య పెడుతుందని, ప్రకటనలు పక్కన పెట్టి పంపిణీ చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం ఉదయం 10 గంటలకు ఖమ్మం కొత్త కలెక్టరేట్‌ ఎదుట జరిగే ధర్నా చేస్తున్నట్లు జిఎంపిఎస్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చింతలచెర్వు కోటేశ్వరావు, తుశాకుల లింగయ్య పిలుపునిచ్చారు. డీడీ కట్టిన వారు, ఇతర సమస్యలు ఉన్న వారందరూ అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పారు. ఆదివారం ఖమ్మంలోని జిఎంపీఎస్‌ జిల్లా కార్యాలయంలో జిల్లా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ ఆలస్యం చేసినకొద్ది ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిచ్చారు. 10 నెలల క్రితం డిడిలు తీసి ఖమ్మం జిల్లాలో 40 కోట్ల రూపాయలు కట్టించి ఇప్పటి వరకు గొర్రెలివ్వకుండా నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు ఈ నెల రోజుల్లో మళ్లీ రాష్ట్ర వ్యాప్తంగా హడావిడిగా వేలాది మందిని డి.డి.లు తీయించారని, ఎన్ని నిధులు ఉన్నాయో చెప్పడం లేదని, ఏ జిల్లాలో ఏ గ్రామంలో ఎవరికి ముందు పంపిణీ చేస్తారనే కనీస ప్రణాళిక లేకుండా అందరిని ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. పాత పద్దతిలోనే దళారులతో గొర్రెలు పంపిణీ చేయిస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా మిగిలిపోయి ఉన్న 3.5లక్షల మంది డి.డి.లు తీయిస్తే ఎన్నికలు వచ్చేలోపు గొర్రెల పంపిణీ సాధ్యపడదన్నారు.
మునుగోడులో చేసినట్లు రాష్ట్ర వ్యాప్తంగా నగదు బదిలీ చేసి గొర్లకాపరులకు నచ్చినచోట ఇష్టమొచ్చిన గొర్రెలు కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అడిగినప్పుడల్లా త్వరలో ప్రారంభిస్తామని చెప్పడం విశ్వాసం కోల్పోతున్నారన్నారు.
ఇప్పటికే దశలవారిగా జిల్లా పశుసంవర్థక శాఖ అధికారులకు, శాసన సభ్యులకు మెమోరాండాలు ఇచ్చామని ఎలాంటి స్పందన లేదన్నారు. మరో వారం రోజుల్లో గొర్రెల పంపిణీ ప్రారంభించకుంటే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. దీనికి తోడు ప్రతి ఒక్కరూ కుల ధ్రువీకరణ పత్రం, సొసైటీ అధ్యక్షుల లెటర్లు, చనిపోయిన వారికి డెత్‌ సర్టిఫికెట్‌, నామినీ వివరాలు అఫ్‌ లోడ్‌ పేరుతో ఇంకా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. జిల్లాలో 9000 మంది పైగా డిడిలు తీయగా ఇప్పటికీ 2000 మంది దరఖాస్తులు మాత్రమే అఫ్‌ లోడ్‌ చేసినట్లు అధికారులు చెప్తున్నారని, ఇది తతంగమంతా చూస్తే ఇప్పట్లో గొర్రెల పంపిణీ పూర్తవుతుందనే నమ్మకం లేదని అన్నారు. ఈ సమావేశంలో జిఎంపిఎస్‌ జిల్లా నాయకులు మామిళ్ళ వెంకటేశ్వర్లు, గుమ్మా నర్సింహారావు, దొంతెబోయిన నాగేశ్వరరావు, అంగిరేకుల నర్సయ్య, యడ్ల తిరుపతి రావు, గజ్జి సూరిబాబు, భట్టు నర్సింహారావు, దొడ్డ లింగస్వామి, గాయం తిరుపతి రావు, రాజబోయిన సైదులు, చీర్ల రాధాకృష్ణ మొర్రి మేకల అమరయ్య తదితరులు పాల్గొన్నారు.