కళను ప్రపంచానికి పరిచయం చేస్తూ…

అమ్మ ఒడే మొదటి బడి. అందుకే ప్రతి ఒక్కరికి అమ్మే ఆది గురువు అనడంలో ఎలాంటి సందేహం లేదు. తల్లి అడుగుజాడల్ని, కళనీ గమనిస్తూ, అనుసరిస్తూ పెరిగింది. అదే కళా పారంపర్యతో రెండవ తరం కథక్‌ డాన్సర్‌గా ఎంతో ప్రతిభను కనబరుస్తున్నది. ఆమె మరెవరో కాదు… కళా రంగానికే వన్నె తెచ్చిన భక్తి దేశ్‌ పాండే. పదేండ్ల వయసులోనే తల్లి ద్వారా నేర్చుకున్న కళను తనకంటే జూనియర్‌ విద్యార్థులకు బోధించి, వి హబ్‌ ఇంక్యుబేటర్‌ మద్దతుతో కూడా తన కళకు మరింతగా ఇనుమడించేలా చేశారు. కథక్‌ డాన్సర్‌ గానే కాకుండా నటిగా కూడా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆమె పరిచయం నేటి మానవిలో..
తల్లి పండిట్‌ విద్యా దేశ్‌ పాండే కథక్‌ డాన్సర్‌ కావడంతో సహజంగానే భక్తి దేశ్‌ పాండే పదేండ్ల వయసులోనే తల్లి ద్వారా కథక్‌ నేర్చుకుంది. ఆ వయసులోనే తనకంటే చిన్నపిల్లలకు కథక్‌ నేర్పించేది. అలా నేర్పించడం మామూలు విషయం కాదు. తనలోని కళా నైపుణ్యంతో అందరినీ అబ్బురపరిచేది.
చదువుతో పాటు కళపై మక్కువ
భక్తి దేశ్‌ పాండే కాలేజీ చదువు కోసం 18 ఏంతడ్ల వయసులో ముంబాయికి మారారు. వీరు మాస్‌ మీడియాలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చదివారు. చదువుతూనే తన కళను ఇతరులకు నేర్పించ సాగారు. ఇంతింతయి వటుడింతై… అన్నట్టుగా ఒక్కో మెట్టూ ఎక్కుతగా మంచి కళాకారురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తన జీవితాన్ని కళకే అంకితం చేయాలని భావించి తదనుగుణంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కథక్‌ డాన్సర్‌గా ఎదిగారు. అంతేకాకుండా మంచి నటిగా కూడా వివిధ భాషలలో గుర్తింపు పొందడం విశేషం. ఈ క్రమంలోనే కథక్‌ డాన్సర్‌గా థియేటర్‌ ఆర్టిస్టుగా ఎదుగుతూ మరాఠీ టీవీ సీరియల్స్‌లో ప్రధానమైన పాత్రను పోషించారు. ఆమె చేసిన టీవీ షోలు అత్యధిక టిఆర్పి రేటింగ్‌ అందుకుని ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. వత్తిపరంగా కూడా అనేక షోలను ఎంచుకొని రాణించడం గర్వించదగ్గ విషయం.
వి హబ్‌ ప్రోత్సాహంతో…
నటిగా బిజీగా మారిన ఆమెకు సమయం సరిపోయేది కాదు. దాని వల్ల ఎక్కువ మంది విద్యార్థులకు కథక్‌ నేర్పించలేకపోతున్నారనే విషయంలో కొంత బాధపడేవారు. ఎంతో గొప్ప గొప్ప వారిగా చెప్పుకునే ప్రముఖులు కూడా నేర్చుకోలేని, ఆసక్తి చూపించని కథక్‌ను తాను నేర్చుకోవడం ఎంతో గర్వకారణం అని దేశ్‌ పాండే చెప్పే తీరు ఆ కళపై తనకున్న ఆసక్తిని తెలియజేస్తుంది. తను నేర్చుకున్న కథక్‌ని ఇంకా ఎంతోమందికి అందించడానికి, నేర్పించడానికి సాంకేతికపరంగా వచ్చిన ఆలోచనే దేశ్‌ పాండేను ఒక అడుగు ముందుకు వేసేలా చేసింది. ప్రణాళికకు అనుగుణంగా వి హబ్‌ వారి సహకారం తోడైంది. ఇండియన్‌ ఆర్ట్‌ లెర్నింగ్‌ కోసం వారు ఆమెను ముందుకు ప్రోత్సహించారు.
ఆన్‌లైన్‌ ద్వారా
వి హబ్‌ వారు పెట్టుబడి పెట్టడంతో మంచి సహకారం తోడై 2020 మార్చి 22వ తేదీ నుండి ఇప్పటి వరకు సాంకేతికంగా సుమారు 30 వేల మంది విద్యార్థులకు ఈ వేదిక ద్వారా కళను నేర్పించారు. ఆన్‌లైన్‌లో కళను నేర్చుకునేందుకు ఎక్కువ మంది విద్యార్థులు ముందుకు వచ్చారు. దాంతో నేర్పించడానికి గురువులు అవసరం కాబట్టి భారతీయ కళాకారులతో సహా 35 మందితో కూడిన బృందంతో గురువులను దేశ్‌ పాండే ఆధ్వర్యంలో తీర్చిదిద్దడం ఊహించని సాంకేతిక విజయం అని చెప్పవచ్చు. ఈ ప్లాట్ఫారం ద్వారా ఈ కళ ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి ఉన్నవారందరికీ అందుబాటులోకి రావడమే కాకుండా, మంచి ఆదాయ వనరుగా కూడా మారింది. దాంతో కళను నేర్చుకునే వారి సంఖ్య, నేర్పించే వారి సంఖ్య కూడా పెరిగి గొప్ప విజయం సాధించారు.
గొప్ప గొప్ప వేదికలపై…
ఇంత మంది కళా కారులను తయారు చేసిన దేశ్‌ పాండే భారత దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకమైన గొప్ప గొప్ప వేదికలపై ప్రదర్శనలిచ్చారు. అంతేకాకుండా ఎన్నో బాలీవుడ్‌ సినిమాలకు తన కళను అందించారు. అలాగే అనేక రియాలిటీ షోలకు కొరియోగ్రఫీ కూడా చేశారు. అంతే కాకుండా గుర్తింపు పొందిన ఇండియన్‌ ఫస్ట్‌ ఆల్‌ గర్ల్స్‌, ఇండియన్‌ క్లాసికల్‌ బ్యాండ్‌, సఖి వంటి వాటిలో భాగం కావడం వీరి కళా ప్రేమకు తార్కాణం. తల్లి పండిట్‌ దేశ్‌ పాండే స్ఫూర్తి, లెజెండరీ గురువు పండిట్‌ శిక్షణలో నేర్చుకున్న కళను, ఇంకా బిర్జు మహారాజ్‌ పండిట్‌ సురేష్‌ తల్వాల్కర్‌ వంటి వారితో కలిసి సహ వ్యవస్థాపకురాలిగా కళా సాధన చేస్తూ, కథక్‌ను నేర్చుకోవాలనుకున్న వారి ఆసక్తికి అనుగుణంగా ఆర్ట్‌ ఫిల్స్‌ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంచడం విశేషం. ఇంతటి గొప్ప కళా ప్రతిభను కలిగి తనదైన శైలిలో కళా రంగంలో ప్రత్యేకతను దశదిశల చాటుకుంటున్న దేశ్‌ పాండే కథక్‌ కళాకారిణిగా ప్రతి ఒక్కరికి ఆదర్శం. ఆమె సాధిస్తున్న విజయాలు సమాజానికి స్ఫూర్తిదాయకం.
– డా ఓరుగంటి సరస్వతి